విఫల వ్యూహమే మళ్లీ ‌మళ్లీ… చంద్రబాబు లొల్లి లొల్లి…!!

Nara Chandrababu Naidu

ధర్మచక్రం ప్రతినిధి – విజయవాడ

ఒకసారి విఫలమైన వ్యూహాన్ని మళ్లీ మళ్లీ ప్రయోగించలేం. అలా ప్రయోగించడమంటే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే వ్యూహం‌ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇదో యుద్ధతంత్రం.‌

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం‌ విఫలమైన వ్యూహాన్నే మళ్లీ మళ్లీ ప్రయోగించేందుకు పూనుకుంటున్నారు. అది తన ఉనికికే ప్రమాదం తెస్తోందని గ్రహించలేకున్నారు.

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, వైసిపిపైన చేసిన తీవ్రమైన విమర్శ ఏమంటే…జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోతుందని, ఇళ్లలోకి చొరబడి ఆడబిడ్డలను‌ ఎత్తుకెళ్లి పోతారని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, అవినీతి పెరిగిపో తుందని…!

ఇటువంటి ప్రచారం తరువాత కూడా వైసిపి‌151 సీట్లతో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. దీనర్థం చంద్రబాబు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదనే కదా..! తాను‌‌ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలు ఎంచేశామో చెప్పడంకంటే జగన్ ను విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.‌

అదేవిధంగా తన అనుకూల మీడియా ద్వారా జగన్ వ్యతిరేకంగా మితిమీరి ప్రచారం చేయించారు. మీడియా కూడా చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడానికి బదులు కప్పిపుచ్చుతూ వచ్చింది. బాబు ఏమి చేసినా అద్భుతం అంటూ ఊదరగొట్టింది. దీంతో తెలుగుదేశం అధినేత భ్రమల్లోకి వెళ్లిపోయారు. తిరిగి తామే అధికారంలోకి రాబోతున్నామని కలలుగన్నారు. తీరా ఫలితాలు ఎలా వున్నాయో చూశాం.

ఎన్నికలై ఏడాది మాత్రమే అవుతోంది. మళ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల‌ సమయం ఉంది.‌ మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో, ఓడినా అంత ఘోర ఓటమికి కారణాలు ఏమిటో సమీక్షించుకోవాల్సిన అవసరం టిటిడికి ఉంది. అటువంటి సమీక్ష, ఆత్మశోధన ఏదీ‌ టిడిపిలో జరిగినట్లు లేదు.

ఈ కాలంలో కూడా చంద్రబాబు నాయుడు…ఎన్నిక ముందునాటి వ్యూహాన్నే నమ్ముకుని‌ అడుగులేస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా తన అనుకూల మీడియాలో తీవ్రమైన ప్రచారం చేయడం ద్వారా లబ్ధిపొందవచ్చి భావిస్తున్నారు.

కోర్టులే లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో అనే భయం కలుగుతోందని చంద్రబాబు ‌అంటున్నారు. రౌడీయిజం పెరిగిపోయిందనీ విమర్శిస్తున్నారు. ఇవి ఎన్నికల ముందు చేసిన ఆరోపణలనే తలపిస్తున్నాయి. గోరంతను కొండంతగా ప్రచారం చేస్తున్నారు.‌

వరదల వల్ల ఇసుక కొరత వస్తే…అదేదో ప్రభుత్వ తప్పిదం అన్నట్లు ప్రచారం చేశారు. ఎన్నికల వేడిలో అక్కడక్కడా ఘర్షణలు జరిగితే…అధికార పార్టీ‌‌ దౌర్జన్యాలుగా ప్రచారం చేసి, శాంతిభద్రతలు లోపించా యంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆఖరికి కరోనా విపత్తు వేళ కూడా ప్రభుత్వంపై రాళ్లు విసురుతూనే ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థ సత్ఫలితాలిస్తుంటే… ప్రభుత్వ సొమ్మును వాలంటీర్లకు దోచిపెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

ఇక చంద్రబాబు అనుకూల మీడియా గురించి చెప్పనవసరం లేదు. ఎద్దు ఈనిందని బాబు చెబితే…గాట్లో కట్టేయండి అంటూ మీడియా హడావుడి చేస్తోంది. అటువంటి పత్రికలు, టివి ఛానళ్లు పుంఖాను పుంఖాలుగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలను వండి వార్చుతున్నాయి.

ఇదంతా తమకు పొలిటికల్ మైలేజీ పెంచుతుందని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తోందని బాబు అంచనా వేస్తున్న ట్లున్నారు. తన అనుకూల మీడియా కూడా ఆయనకు అదే చెబుతుండొచ్చు.

అయితే…క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నా…ఆయన దృష్టి మాత్రం ప్రజలపైనే ఉంది. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశాగా సాగుతున్నారు. జగన్ ఎన్నికల్లో చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారన్న అభిప్రాయాన్ని జనంలో కలిగించగలిగారు.

అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, గోరుముద్దు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, వాహన మిత్ర …వంటి పథకాలతో ప్రజలకే నేరుగా నగదు అందజేసే పథకాలు అమల్లోకి వచ్చాయి.

వాలంటీర్లు,‌ గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజల ముంగిటకు వెళ్లింది. ఫించనా, రేషన్ కార్డా, ఆరోగ్యశ్రీ కార్డా, కరొఇబా సాయమా… ఏదైనా ఇంటికే చేర్చుతున్నారు వాలంటీర్లు. దీంతో గత ప్రభుత్వానికీ‌ ఈ ప్రభుత్వానికీ స్పష్డమైన తేడాను ప్రజలు చూస్తున్నారు. జగన్ వ్యతిరేకులైనా వాలంటీర్ల వ్యవస్థను తప్పుబట్టలేని పరిస్థితి.

ఇవన్నీ చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది కలిగించేవే. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ఆయన చేయలేని పనులను జగన్ చేయగలుగుతున్నారు. ఇది టిడిపి శ్రేణులకూ అర్థమవుతోంది. బాబుకు‌ ఆందోళన కలిగిస్తోంది.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఒక విధమైన అసహనంలో, గందరగోళంలో ఉన్నారనిపిస్తుంది. దేన్ని సమర్థించాలో దేన్ని విమర్శించాలో తెలియక‌ సతమతం అవుతున్నారు.‌ అసలు‌ ఎటువంటి వ్యూహం అనుసరించాలో కూడా అంతుబట్టడం లేదు.‌ ఈ‌ తడబాటు నుంచే…తడబాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

చంద్రబాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉంటున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అడ్డొకోవడం బాబు తీరుకు పరాకాష్ట. ఇంగ్లీషు మీడియం జీవోను అడ్డుకోవడంగానీ, కరోనా వేళ విమర్శలుగానీ ఈ కోవలోకే వస్తాయి. ఇటువంటి వాటివల్ల చంద్రబాబు ప్రతిష్ట దిగజారడం మినహా పెరిగేది ఉండదు.

మీడియా ప్రచార వ్యూహం ఒకప్పుడు చెల్లిందేమోగానీ ఇప్పుడు పారదు. సోషల్ మీడియా యుగం‌ ఇది. ఏది తప్పో ఏది ఒప్పో క్షణాల్లో తేల్చేస్తోంది సోషల్ మీడియా. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తన విఫల వ్యూహాన్ని, కాలం చెల్లిన ఎత్తుగడలను‌ విడిచిపెట్టడం మంచిది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*