విమ‌ర్శ‌లు కాదు….విచార‌ణే ప‌రిష్కారం!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు, విమర్శలకు టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. దీక్షితులు చేసిన ఏ ఆరోపణనూ ఆయన అంగీకరించలేదు. ఆలయంలో కైంకర్యాలన్నీ సమయపాలన ప్రకారమే జరుగుతున్నాయన్నారు. పోటులో మరమ్మతులే తప్ప తవ్వకాలు జరగలేదన్నారు. మాయమైనట్లు దీక్షతులు చెబుతున్న పింక్‌ డైమైండ్‌ లేనేలేదని, ఉన్నది రంగురాయి మాత్రమేనని, అది పగిలిపోయిందని వివరించారు. అయినప్పటికీ…రమణ దీక్షితులు తన ఆరోపణలకు, విమర్శలకు కట్టబడే ఉన్నానని చెబుతున్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే అన్నీ బయటికొస్తాయని అంటున్నారు. రమణ దీక్షతులు చేసిన విమర్శలు, ఆరోపణలకు టిటిడి ఈవో వివరణ ఇవ్వడంలో సహేతుకంగా లేదు. ఆయన ఆరోపణలు చేస్తున్నదే టిటిడి ఉన్నతాధికారులపైన. ఇక ఆ ఉన్నతాధికారులే అన్నీ బాగున్నాయని చెప్పుకోవడమంటే… న్యాయస్థానంలో నిందితులే తీర్పు చెప్పుకున్నట్లు ఉంది. ఫిర్యాదుదారుడుగానీ, ముద్దాయిగానీ తీర్పు చెప్పడానికి వీల్లేదు. న్యాయమూర్తి తీర్పు చెప్పాలి.

ఆలయంలో కైంకర్యాలు త్వరత్వరగా ముగించమని ఓ అధికారి తొందరపెడుతురన్నది దీక్షితులు చేస్తున్న ఆరోపణ. తొంతరపెట్టారా లేదా అనేది తేల్చడానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. సిసి కెమెరాల్లో చూస్తే అన్నీ తెలిసిపోతాయి. సిసి కెమెరాలు శ్రీవారివైపు ఉండవుగానీ…ఆలయమంతా ఉంటాయి. ఈ సేవకు ఎన్నిగంటలకు లోనికి వెళ్లారు, ఎన్నిగంటలకు బయటకు వచ్చారు అనేది చూసినా తెలిసిపోతుంది. ఇది చేయాలంటే నిష్పక్షపాతంగా ఉండే ఓ కమిటీని నియమించి, ఆ కమిటీతో విచారణ జరిపించాలి. ఇక పోటు వ్యవహారం…మరమ్మతులు మాత్రమే చేశామని టిటిడి అధికారులు అంటుంటే….తవ్వకాలు జరిగాయని దీక్షితులు చెబుతున్నారు. ఇంతకీ తవ్వకాలు జరిగాయా లేదా అని తేల్చాల్సింది ఇంజినీర్లు. పురావస్తు శాఖ అధికారులూ దీనికి సంబంధించి నిర్ధారణ చేయగలరు. వారితో ఆపని చేయించాలి. అదేవిధంగా గతంలోనూ పోటు రిపేరయినపుడు ప్రసాదాలు బయట తయారు చేయించామని ఈవో చెబుతున్నారు. దీన్ని కూడా కైంకర్యాలపై పరిశీలన చేసే కమిటీ నిగ్గుతేల్చవచ్చు. ఇక గులాబీవర్ణ వజ్రం వ్యవహారం. హారంలో వజ్రమే ఉండేదని దీక్షితులు చెబుతున్నారు. వజ్రమే లేదని అధికారులు అంటున్నారు. రంగురాళ్ల ముక్కలు చూపిస్తున్నారు. రంగురాళ్ల ముక్కలు చూపించడంలోనే సమస్యవుంది. దీన్ని తేల్చాలంటే సాధారణ విచారణ సరిపోతుంది. లోతుగా విచారించగల ఏదైనా సంస్థతోనే ఆ పని చేయించాలి. అదేగాదు…ఇదే సమయంలో మిగతా ఆభరణాల్లోని వజ్రాల నాణ్యతనూ పరిశీలించేలా పని జరగాలి.

రమణ దీక్షితులు మొత్తం టిటిడి వ్యవహారాలపై సిబిఐ విచారణ అడుగుతున్నారు. ఆ స్థాయిలో విచారణ జరిగితేనే బయటకు వస్తాయని చెబుతున్నారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆయన చెప్పేవన్నీ తప్పులని తేల్చాలంటే….ప్రతిష్టాత్మకమైన ఏజెన్సీతో విచారణ జరిపించి నిజాలు వెల్లడిస్తేనే సాధ్యం. అలాకాకుండా రాజకీయ నాయకులు, టిటిడి అధికారులు, కొందరు అర్చకులు మార్చిమార్చి విలేకరుల సమావేశాలు నిర్వహించి, రమణ దీక్షితులుపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఇలాంటి చర్యలు భక్తుల్లో నమ్మకాన్ని కలిగించలేవు. ఆయన ఆరోపణలు చేయడం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉంటేవుండొచ్చుగాక…ఆయన లేవనెత్తుతున్న అంశాలు చాలా కీలకమైనవి. ర‌మ‌ణ దీక్షితులు కోసం కాదు…భ‌క్తుల కోసం విచార‌ణ జ‌రిపించాలి.

1 Comment

  1. Once the allegations are raised from TTD Prime Dikshitulu himself, there must be comprehensive inquiry to place all the facts on record. Based on the inquiry report appropriate action to be taken to safe guard the Lord’s and devotees property.

Leave a Reply

Your email address will not be published.


*