వివేకా హత్య కేసు పోలింగ్ ముగిసేదాకా నాన్చుడే…!

సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పట్లో తేలేలా లేదు. రాష్ట్రం లో పోలింగ్ ముగిసేదాకా కేసు మిస్టరీ వీడే సూచనలు కనిపించడం లేదు. పోలింగ్ కు, వివేకా హత్య కేసు విచారణకు సంబంధం ఏమిటన్న అనుమానం కలగవచ్చు.

రాజకీయ కారణాలతో టిటిపికి చెందిన తమ ప్రత్యర్థులే వివేకాను చంపారని వైసిపి‌ ఆరోపిస్తోంది. జగన్ ఇంట్లోవాళ్లే వివేకాను అంతమొందించి, హత్యను సాధారణ మరణంగా చూపించేందుకు ప్రయత్నించారని, అధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారని టిడిపి ప్రత్యారోపణ చేస్తోంది.

వివేకా హత్యపైన సిబిఐ విచారణ జరిపించాలని జగన్ డిమాండు చేశారు. అందుకు అంగీకరించని ప్రభుత్వం సిట్ తోనే విచారణ చేయిస్తోంది.‌ హత్య మిస్టరీని ఛేదించాల్సింది పోలీసులే. అయితే…ఇందులో సాధించిన పురోగతి ఏమిటో ఎవరికీ తెలియదు.

అయితే…చంద్రబాబు సహా ప్రతి టిడిపి నాయకుడూ ఈ అంశాన్ని ఎన్నికల సభల్లో ప్రస్తావిస్తున్నారు. సొంత చిన్నాన్ననే చంపేసి తప్పించుకోవాలను చూస్తున్నారని, ఇలాంటివాళ్లు అధికారంలోకి వస్తే రాష్ట్రం లో అరాచకం పెరిగిపోతుందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

వివేకా హత్య కేసు మిస్టరీ వీడకపోవడమే ఇప్పుడు అధికార పార్టీకి‌ కావాల్సింది. మిస్టరీ వీడిపోతే జగన్ పై విమర్శలు చేసే అవకాశం ఉండదు. నిజంగా టిడిపి చెబుతున్నట్లు కుటుంబ కలహాల వల్లే హత్య జరిగివుంటే, అందుకు ఆధారాలుంటే పోలీసుల ద్వారా చెప్పించవచ్చు. అప్పుడు అధికార పార్టీకి ఇంకా మేలు జరుగుతుంది. ఆధారాలు లభించివుంటే జగన్ పైన టిడిపి‌ దుమ్మెత్తి పోసివుండేది. అటువంటి‌ ఆధారాలు‌ దొరికినట్లు లేదు. అందుకే పోలీసులు ఏమీ చెప్పడం లేదు.

అయినా టిడిపి నాయకులు వైసిపిపైన విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను‌ ఇలాగే కొనసాగించాలంటే…ఈ మిస్టరీ ఇలాగే కొనసాగాలి. పోలింగ్ లోపు కేసు చిక్కుముడిని విప్పేసినా, హత్యలో జగన్ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తేలినా… దాన్ని పోలీసులు ప్రకటించ కపోవచ్చు. పైగా మిస్టరీ సినిమాల్లో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని అనుమానాస్పదంగా చూపిస్తారో…ఆ విధంగా విచారణ పేరుతో మధ్యమధ్యలో జగన్ కుటుంబీకులే నేరస్తులన్నట్లు అనుమానాస్పదంగా ప్రచారం చేస్తారనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*