విసి గీసీ జాన్తా నై..! నేనే బిగ్‌ బాస్‌…!

టిటిడికి ఈవో అత్యున్నత అధికారి. కింది స్థాయి అధికారులు తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా…ఆయన సమీక్షించవచ్చు. మార్పు చేయవచ్చు. తుది నిర్ణయం చేయవచ్చు. ఉదాహరణకు కొందరు ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ….సర్వీసెస్‌ డిప్యూటీ ఈవో ఒక ఫైలు ఈవోకు పంపారని అనుకుందాం….దాన్ని పరిశీలించిన ఈవో మార్పులు చేర్పులు చేయవచ్చు. తుదిగా ఈవో సూచించిన మేరకు ఆర్డర్స్‌ రూపొందించి ఇవ్వాల్సివుంటుంది. అంతేగానీ….ఈవో నిర్ణయాన్ని అమలు చేయకుండా సర్వీసెస్‌ డిప్యూటీ ఈవో ఆ ఫైలును తన వద్ద పెట్టుకోడానికి వీల్లేదు. ఇది క్రమశిక్షణారాహిత్యం అవుతుంది. ఆ డిప్యూటీ ఈవోపైన చర్యలు తీసుకునే అవకాశమూ ఉంటుంది.

ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియే కాదా…ఇదంతా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది…! అని అనిపించవచ్చు. ఇది ఏ ప్రభుత్వ శాఖలోనైనా జరిగే సాధారణ పాలనా ప్రక్రియే అయినా….ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి ఓ కారణం ఉంది. వివాదంగా మారిన (మార్చబడిన) ఎస్‌వి యూనివర్సిటీ బదిలీ వ్యవహారాన్ని చర్చించాలంటే పాలనా విషయాలకు సంబంధించిన ఈ ప్రాథకమి అవగాహన అవసరం కాబట్టే…టిటిడి ఉదాహరణ చెప్పాల్సివచ్చింది. అసలు విషయంలోకి వెళితే…

ఇటీవల దాకా ఎస్‌వి యూనివర్సిటీ విసిగా పని చేసిన ఆవుల ఆమోదరం….యూనివర్సిటీలో కొందరు ఉద్యోగులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 50 మంది ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలును రిజిస్ట్రార్‌ అనురాధ, విసి దామోదరానికి పంపారు. ఆ ఫైలును పరిశీలించిన ఆయన…కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకున్నారు. సమర్థత లేని వారిని కీలక పోస్టుల నుంచి తప్పించడంతో పాటు, సమర్థులైన ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతో రిజిస్ట్రార్‌ పంపిన బదిలీ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. రాజకీయ పలుకుబడి, సామాజిక పలుకుబడి లేకుండా చాలాకాలంగా సరైన స్థానాలకు నోచుకోకుండా ఉండిపోయిన ఉద్యోగులను గుర్తించి సముచిత స్థానాల్లోకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 50 మందిలో 10 – 15 మార్పులను మాత్రమే విసి సూచించారు. తాను మార్పులు చేసిన ప్రతిచోటా సంతకం కూడా చేశారు.

ఇదిలావుండగా….విసి నుంచి రిస్ట్రార్‌ వద్దకు వెళ్లిన ఆ ఫైలుకు విముక్తి కలగలేదు. తాను చేసిన ప్రతిపాదనల్లో విసి మార్పులు చేశారన్న కోపంతో…ఆమె ఫైలును మూలనపడేశారు. వాస్తవంగా విసి సంతకం అయిన తరువాత రిజిస్ట్రార్‌ ఫైలును మూలనపడేయడానికి వీల్లేదు. ఒకవేళ విసి తీసుకున్నది సరైన నిర్ణయంకాదని భావిస్తే….వెళ్లి చర్చించాలి. అంతేగానీ ఆ ఫైలుకు విలువ లేదన్నట్లు, అందులోని ఆదేశాలను అమలు చేయకుండా పక్కనపడేయడానికి వీల్లేదు. అయినా…విసిలేదు గీసీలేదు…ఇక్కడ నేనే బిగ్‌బాస్‌ అనే తరహాలో రిజిస్ట్రార్‌ ఆ ఫైలును చెత్తబుట్టలో పడేశారు. బదిలీ ఉత్తర్వులు వస్తాయని ఉద్యోగులు ఎదురుచూస్తేనే ఉన్నారు.

ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు. రిజిస్ట్రార్‌ బదిలీల ఫైలును మూలనవేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులు కొందరు…ఇటీవల తిరుపతికి వచ్చిన ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. బదిలీ అయిన ఉద్యోగుల్లో ఎస్‌సిలు ఉండటం వల్ల ఫైలును పక్కన పెట్టేశారని ఫిర్యాదు చేశారు. దీనిపైన ఆయన యూనివర్సిటీని వివరణ కోరారు.

ఈ నేపథ్యంలో….ఈ బదిలీ వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. బదిలీల్లో ఎవరెవరో చక్రం తిప్పారని, లక్షలాది రూపాయలు చేతులు మారాయని, దీనిపైన విజిలెన్స్‌ విచారణ జరుపుతోందని రాశారు. అర్థంపర్థం లేని వాదనలు అందులో ఉన్నాయి. నోట్‌ఫైలులో విసి దామోదరం కొన్ని పేర్లు కొట్టేసి రాశారట. అవినీతి జరిగిందని చెప్పడానికి ఇదో రుజువట. నోట్‌ఫైలులో కొట్టి రాయడం, కొట్టిన చోట సంతకం పెట్టడం సహజం. నోట్‌ఫైలులో రాయకుండా ఉత్తర్వులు ఇవ్వమని మౌఖికం చెబితే నేరమవుతుందిగానీ…పక్కాగా ఫైలులో రాయడం తప్పు ఎలా అవుతుందో తెలియదు.

ఎస్‌సి కమిషన్‌ ప్రశ్నించిన నేపథ్యంలో ఈ వ్యహారానికి అవినీతి రంగుపూసి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే మీడియా ప్రతినిధులను తప్పుదారి పట్టించి, రహస్యంగా ఉండాల్సిన నోట్‌ఫైళ్లను సైతం ఇచ్చి కథనాలు రాయిస్తున్నారని దళిత ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఏమీలేని దీనిపై విజిలెన్స్‌ విచారణ జరుపుతోందని కూడా హడావుడి చేస్తున్నారు. అసలు బదిలీలే జరగలేదు. రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాంటప్పుడు…ఇందులో అవినీతి జరగడం ఏమిటి? ఎవరైనా మధ్య దళారులకు బదిలీల కోసం డబ్బులు ఇచ్చివుంటే…ఇచ్చినవారే ఆ దళారులను చొక్కాపట్టుకుంటారు. అంతేగానీ…ఇందులో విజిలెన్స్‌ వచ్చి విచారణ జరపడానికి ఏముంది? ఇది ప్రాథమికమైన ప్రశ్న.

ఒకవేళ బదిలీల్లో అవినీతి జరిగిందని అనుకుందాం…దానిపైన విచారణ జరిపించొచ్చు. ఎవరో ఒకరిద్దరు అక్రమాలకు పాల్పడ్డారని అందరికీ బదిలీలు ఆపేస్తారా? విసి సంతకం అయిన తరువాత కూడా మూలనపడేస్తారా? ఇది క్రమశిక్షణారాహిత్యం కిందకు రాదా? అసలు విచారణ జరపాల్సివస్తే…విసి ఆదేశాలను ఎందుకు బేఖాతరు చేశారనేదానిపై విచారణ జరపాలి. అసలు రిజిస్ట్రార్‌ ప్రతిపాదించిన పేర్లలోనే అక్రమాలు ఉన్నాయని, అందుకే విసి కొన్ని పేర్లు మార్పు చేశారని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు.

ఇందులో ఇంకో కీలకమైన అంశమూ ఉంది. దామోదరం వెళ్లిపోయి ఒకటిన్నర నెల అవుతోంది. నిజంగా ఆయన చేసిన మార్పులు చేర్పుల్లో ఏవైనా లోపాలువుంటే…వాటిని పక్కనపెట్టవచ్చు. ఇన్‌ఛార్జి విసితో చర్చించి బదిలీలపై నిర్ణయం తీసుకునివుండొచ్చు. అంతేగానీ దళిత ఉద్యోగులకు మేలు జరుగుతుందన్న భావనతో ఏకంగా ఫైలునే పక్కనపడేసి, ఇదేమిటని ఎస్‌సి కమిషన్‌ ప్రశ్నించే సరికి…ఇందులో ఏదో అవినీతి జరిగినట్లు, అందుకే పక్కనపెట్టినట్లు ప్రచారం చేస్తే ఎవరూ అంగీకరించరు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రస్తుత విసి, రిజిస్ట్రార్‌ కూర్చుని, చర్చించి, తక్షణం బదిలీలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారుల అధిపత్య ధోరణి వల్ల ఉద్యోగులు నష్టపోకూడదు. ఇబ్బందిపడకూడదు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*