వెంకన్నను ఇరికించావు కదయ్యా బాబూ..!

ఏడుకొండల వెంకన్న సాక్షిగా ప్రధాన మంత్రిని నిలదీస్తానంటూ తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిర్వహించిన సభ వల్ల ప్రధాన మంత్రిని ఎంత మేరకు దోషిగా నిలెట్టారో తెలియదుగానీ….వెంకన్నను కూడా దోషిగా నిరూపించారు. ఇదేమిటి? ఇందులో వెంకన్నకు సంబంధం ఏమిటి? అనుకుంటున్నారు కదూ….నిజంగానే వెంకన్నను నేరస్తున్ని చేసి చూపించారు బాబుగారు. అయితే…ఈ వెంకన్న ఆ ఏడుకొండల వెంకన్నకాదు. ఢిల్లీలో ఉండే వెంకన్న. అదే మన ఉప ముఖ్యమంత్రి ముప్పవరపు వెంకన్న. వెంకయ్యనాయడు.

నమ్మక ద్రోహం, కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం అంటూ తిరుపతిలో తెలుగుదేశం నిర్వహించిన సభలో, గత ఎన్నికల సమయంలో నిర్వహించిన సభల్లో మోడీ చేసిన ప్రసంగాల వీడియోను చూపించారు. తిరుపతి, నెల్లూరు, అమరావతి సభల్లో మోడీ మాట్లాడగా….వెంకయ్యనాయుడు తెలుగులోకి అనువదించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే…మోడీ మాట తప్పిడం ఎంత వాస్తవమో, ఇప్పుడు వెంకయ్యనాయుడు నోరు మెదపకుండా ఉండటం అంతే వాస్తవం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంకయ్యనాయుడు సాధించారని మోడీ నెల్లూరు సభలో చెప్పారు. ప్రత్యేక హోదా రాలేదుగానీ…వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యారు. ప్రత్యేక హోదా బదులు…ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అందుకు చంద్రబాబును ఒప్పించింది వెంకయ్యనాయుడే. అందుకే అప్పట్లో వెంకయ్యకు రాష్ట్రంలో సన్మానాలు, సత్కారాలు చేశారు.

వెంకయ్య నాయుడు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని గమనించిన బిజెపి, ఆయన్ను ఉప రాష్ట్రపతిగా పంపించి, కట్టడి చేసిందని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు తన మాటల గారిడీతో ఇంతెత్తున లేచేవారు. ప్రత్యేక హోదా విషయంలోనూ పార్లమెంటులో అదేవిధంగా మాట్లాడారు. ఇప్పుడు సొంత పార్టీ అన్యాయం చేస్తుంటే నోరు మెదపడం లేదు. ఆయన తన ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తానని ఒక మాట అంటే కేంద్రం దిగివస్తుంది. ఉప రాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకూడదు కాబటి…మాట్లాడటం లేదన్నట్లు ఉంది ఆయన వైఖరి. ప్రత్యేక హోదా అడగడం రాజకీయం ఎలావుంది? అది రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఒక సమస్య. అదీ సొంత రాష్ట్రానికి సంబంధించిన సమస్య. దీనిపైన పార్టీతో గట్టిగా మాట్లాడొచ్చు. పదవి భయమో, ఇంకోటోగానీ మాట్లాడటం లేదు. దీనిర్థం వెంకన్న కూడా ప్రధానితో సమానమైన దోషి అనే కదా? ప్రధాని నమ్మక ద్రోహం చేశారని చెబుతున్న చంద్రబాబు…వెంకయ్యనాయుడిని గురించి పల్లెత్తి మాట్లాడటం లేదు. వాస్తవంగా వెంకయ్య తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ కూడా వచ్చింది. చంద్రబాబు తెలివిగా ఆ ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడుతున్నారు. రాష్ట్రానికి హోదా సాధించాలంటే ప్రధానిపై ఎంత ఒత్తిడి చేస్తామో…వెంకయ్యపైనా అంతే ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*