వెంకయ్యను ఇరుకునపెట్టేలా వైసిపి మంత్రుల లేఖ..!

ఏ పత్రిక ఎవరి పక్షమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధికార వైసిపికి అధికార పత్రిక వంటిది సాక్షి. ఇక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అసలు విషయానికొస్తే…సాక్షి పత్రికలో ఈరోజు ఒక ముఖ్యమైన వార్త ప్రచురితమయింది. అయితే…అ వార్త ఆ పత్రికల్లో మాత్రం కనిపించలేదు. మీ చొరవతో కేంద్రం నుంచి నిధులు ఇప్పించండి…అంటూ, రాష్ట్ర మంత్రులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారట. వెంకయ్య నాయుడు మొన్నొ ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. పంట ఉత్పత్తుల కొనుకోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందిగా సూచించారు. అయితే…పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని, ఆ తరువాత‌ కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు నగదు చెల్లిస్తుందని వివరించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, కన్నబాబు స్పందిస్తూ వెంకయ్య నాయుడికి ఓ లేఖ రాశారు. ‘మీరు రైతుల సమస్యపై సమీక్ష చేసినట్లు పత్రికల్లో చూశాం. తెలుగు రైతులు, తెలుగు ప్రజల మీద మీకున్న ప్రత్యేక అభిమానం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 2017 ఆగస్టు ఉపరాష్ట్రపతి అయిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి పట్ల మీరు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు ధన్యవాదాలు’ అంటూ వెంకయ్యను అభినందిస్తూనే….ఆంధ్రప్రదేశ్ రైతులకు ధాన్యం సేకరణకు‌ సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.4,724 కోట్లు ఇప్పించడంలోనూ, పోలవరం ఆర్ అండ ఆర్ ప్యాకేజీ కోసం రావాల్సిన నిధులు ఇప్పించడంలోనూ చొరవ తీసుకోవాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జగన్ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలనూ లేఖలో వివరించారు.

ఇదే సమయంలో….ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.960 కోట్లు ఎగ్గొట్టారని, ఆ బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు. ఇంకా గత ప్రభుత్వం 40 వేల కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టి, రెండున్నర లక్షల కోట్ల పైగా అప్పుల భారాన్ని మోపి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని వివరించారు.

ఈ వార్త సాక్షిలో మొదటి పేజీలో ప్రచురించారు. ఆ పత్రికల్లో ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్య నాయుడు ఎంతగానో సహకరిస్తున్నారని తెలుగుదేశం అధికారంలో ఉ‌న్నంత కాలం ప్రచారం హోరెత్తించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. ఇంగ్లీషు విషయంలో వెంకయ్యను కూడా జగన్ ఎత్తిచూపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మంత్రులు వెంకయ్య నాయుడు లేఖ రాయడం ఆసక్తి కలిగిస్తోంది.

నిజంగా వెంకయ్య నాయుడి సహకారం కోరి లేఖ రాశారా లేక ఆయన్ను ఇరుకున పెట్టడానికి రాశారా అనేది పక్కన పెడితే…అంత ముఖ్యమైన వార్తను ప్రధాన పత్రికలు రెండు ప్రచురించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జగన్ ప్రభుత్వానికి పేరు వస్తుందని రాయలేదా అసలు సమాచారమే లేదా అనేది తెలియదు. అయినా…అసలు వెంకయ్య నాయుడు ఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*