వేడుకగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం..3000 మందికిపైగా భజనమండళ్ల స‌భ్యుల భజనలు

 శ్రీ పురందరదాసవర్యుల కీర్తనల్లో వేదాల సారం దాగి ఉందని వ్యాస‌రాజ మఠం పీఠాధిప‌తి  విద్యాశ్రీ‌శ‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమ‌వారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  విద్యాశ్రీ‌శ‌తీర్థ‌స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ శ్రీపురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు.
ఈ సందర్భంగా దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి  పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి ఎందరో మహర్షులు, రాజులు కాలినడకన తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. 3000 మందికిపైగా భజనమండళ్ల స‌భ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*