వైభవంగా ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.00 నుండి 7.30 గంటల మద్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది. ఆలయ కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి మునిరత్నంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశామని తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వాహనసేవల్లో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాబృందాలు ప్రదర్శనలివ్వనున్నట్టు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో మొదటిదైన పెద్దశేష వాహన సేవ రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది.

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున పుష్పాలంకరణలు :
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు రూపొందించారు. ఆలయం ప్రాంగణంలో మధుకైటభలనే రాక్షసులను సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి హయగ్రీవ రూపమున సమర్పిస్తున్న శ్రీ మహవిష్ణువు సెట్‌లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి డిఇ చంద్రశేఖర్‌, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ గోశ్రీపాలకృష్ణా, ఎవిఎస్వో పార్థసారధిరెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*