వైసిపి కొంపముంచుతున్న కరెంటు ఛార్జీలు..!

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాది తిరక్క మునుపే…ఎన్నికల‌ హామీలన్నీ అమలు చేయాలన్న తలంపుతో అనేక పథకాలు తీసుకొచ్చింది. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు….ఇలా నవరత్నాల్లోని‌ హామీలను ఆచరణలోకి తెస్తోంది. ఇవన్నీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడటానికి దోహదపడ్డాయి.

అయితే, ఇదే సమయంలో కరెంటు ఛార్జీల వ్యవహారం ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని రగుల్చుతోంది. పేద ధనిక తేడా లేకుండా…ఈ అసంతృప్తి రాజుకుంటోంది. కరోనా వల్ల ఏప్రిల్ నెలలో మీటర్ రీడింగ్ తీయలేదు. మార్చి నెలలో ఎంత బిల్లు చెల్లించివుంటే అంతే మొత్తాన్ని ఏప్రిల్ నెలలో ఆన్ లైన్ లో చెల్లించా ల్సిందిగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు సూచించాయి. ఈ మేరకు కొందరు చెల్లించారు. కొందరు చెల్లించలేదు.

ఇదిలావుండగా…మే నెల మొదటి వారంలో మామూలుగా మీటర్ రీడింగ్ తీశారు. అంటే రెండు నెలల తరువాత రీడింగ్ నమోదు చేసి బిల్ చేశారు. దీంతో శ్లాబ్ మారిపోయి బిల్లు అమాంతం పెరిగిపోయింది. తక్కువ యూనిట్లు వాడేవారికి ధర తక్కువగా ఉంటుంది. యూనిట్ల వాడకం పెరిగే కొద్దీ‌‌‌ శ్లాబ్ మారిపోయి ధర పెరిగిపోతుంది. రెండు నెలల తరువాత రీడింగ్ తీయడం వల్ల ఎక్కువ యూనిట్లు వాడిన శ్లాబులో బిల్లులు వచ్చాయి. అదేవిధంగా…లాక్ డౌన్ వల్ల అందరూ ఇంట్లో ఉండటం వల్ల వాడకం కూడా భారీగా పెరిగింది. ఈ రెండు కారణాల రీత్యా బిల్లులో భారీ తేడా వచ్చింది. ఆరేడు వందల రూపాయల బిల్లు వచ్చేవారికి దాదాపు రెండు వేలు వచ్చింది. ఇంకా రూ.1500 వచ్చే వారికి రూ.5000 దాకా వచ్చేసింది. ఇది ప్రజల్లో ఆందోలన కలిగిస్తోంది.

అసలే లాక్ డౌన్ లో ఉండటం వల్ల ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఈ సమయంలోనే కరెంటు బిల్లులు భారీగా పెరగడం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. పైగా గత నెలలో బిల్లు చెల్లించని వినియోగదారులకు ఫైన్ కూడా విధించారు. దీనిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్డకాలంలో ప్రజలకు చేయాల్సింది ఇదేనా ప్రశ్నిస్తున్నారు.

ఈ పరిస్థితి వైసిపి ప్రభుత్వానికి రాజకీయంగా తీవ్ర నష్టం చేకూర్చేలా ఉంది. కరోనా కష్టకాలంలో అదనంగా వచ్చిన బిల్లును మాఫీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నిర్ణయం తీసుకోగలిగితే ప్రభుత్వానికి రాజకియంగానూ మంచి మైలేజీ వస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*