వైసిపి రిలాక్స్‌ … టిడిపి యాక్టివ్‌..! 100 రోజుల్లో రివ‌ర్స్..!

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం వారపత్రిక

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులవుతోంది. ప్రతిష్టాత్మకంగా, హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించింది. ఏకంగా 151 సీట్లతో అంచనాలకు మించిన గెలుపును సొంతం చేసుకుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కల నెరవేరింది. ఈ విజయంతో, తొమ్మిదేళ్లు పడిన శ్రమను జగన్‌తో పాటు కార్యకర్తలూ మరచిపోయారు. వైసిపి శ్రేణులన్నీ సంతోషంలో మునిగిపోయాయి.

జగన్‌ వంద రోజుల పాలనపై చాలా విశ్లేషణలే వస్తున్నాయి. సహజంగానే వైసిపిని అభిమానించే వారు జగన్‌ పాలన అద్భుతం అంటూ ఆకాశాని ఎత్తుతుంటే… వ్యతిరేకించే వారు ‘చేతగాని పాలన’ అంటూ తీసిపారేస్తున్నారు. పాలన ఎలావుంది అనే సంగతి పక్కనబెడితే….అధికారం దక్కించుకున్న తరువాత పార్టీగా వైసిపి ఎలావుంది, అధికారం కోల్పోయాక టిడిపి ఎలావుంది అనే అంశాలను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తాను.

ఒక్కమాటలో చెప్పాలంటే…’వైసిపి పూర్తిగా రిలాక్స్‌ అయింది – టిడిపి బాగా యాక్టివ్‌ అవుతోంది’ అని చెప్పాలి. ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేసి, దాన్ని వాడుకుని లబ్ధిపొందడానికి టిడిపి ప్రయత్నిస్తుంటే…దీన్ని కనీస స్థాయిలోనూ ఎదుర్కోలేని దుస్థితిలోకి వైసిపి వెళ్లిపోయింది.

మొన్నిటి ఎన్నికల్లో….కలలో కూడా ఊహించనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ తీవ్రమైన నిరాశలో కూరుకుపోయింది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం సాధ్యంకాదనే భావన అందరిలోనూ కలిగింది. అయితే….ఇంతలోనే అధికార పార్టీగా వైసిపి తప్పిదాలు, నిర్లిప్తత ప్రతిపక్షానికి ఎనలేని ధైర్యాన్ని ఇచ్చాయి. లేచి నిలబడటం పెద్ద కష్టం కాదన్న భరోసాని కలిగించాయి.

క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు లక్ష్యం చేరుకున్నాక రిలాక్స్‌ అవడం సహజం. కానీ రాజకీయ క్రీడలో అలా రిలాక్స్‌ అవడంసాధ్యం కాదు. రిలాక్స్‌ అయితే….ఇక అంతే సంగతులు. 151 సీట్లు గెలుచుకున్నాం…ఇక మనకు తిరుగేముంది…అని అనుకున్నారో ఏమోగానీ వైసిపి నాయకులు, కార్యకర్తలు పూర్తిగా రిలాక్స్‌ అయిపోయారు.

పోలవరం టెండర్ల రద్దు కావచ్చు, రాజధాని అంశం కావచ్చు, దాడుల పేరుతో జరుగుతున్న హడావుడి కావచ్చు, వరదల సందర్భంగా జరిగిన తంతు కావచ్చు, గోదావరి జలాల మళ్లింపు అంశం కావచ్చు, ఇసు వ్యవహారం కావచ్చు….ఏదైనా సరే ప్రతిపక్షం తన వాదనను జనంలోకి తీసుకెళుతున్నంత సమర్థవంతంగా వైసిపి తీసుకెళ్లలేకపోతోంది. వాస్తవమున్నా లేకున్నా టిడిపి చెప్పేది బలంగా జనంలోకి వెళుతోందన్నది మాత్రం వాస్తవం. ఈ ప్రచారం వల్లే వంద రోజుల్లోనే జగన్‌ పాలనపై ప్రజల్లో పెదవి విరుపు కనిపిస్తోంది.

ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు బలంగా బదులిచ్చే నాయకులు వైసిపిలో కనిపించడం లేదు. ఎవరికివారు పదవులు, ఇతర పనుల్లో బిజీ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో మునిగిపోయారు. పార్టీపైన, ప్రభుత్వంపైన వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు కనిపించదు. ప్రతి జిల్లాలోనూ కనీసం 10 మంది వైసిపి ఎంఎల్‌ఏలున్నా నోరువిప్పి మాట్లాడుతున్నవారు కానరావడం లేదు.

ద్వితీయ శ్రేణి నాయకులైతే అసలు పట్టించుకోవడం లేదు. తాము రాత్రింబవళ్లూ శ్రమించి గెలిపించిన నాయకులే తమను పట్టించుకోవడం లేదన్న తీవ్రమైన అసంతృప్తి దీనికి కారణం. ఇంతకాలం తాము పార్టీ కోసం కష్టించి పనిచేస్తే….అధికారం రాగానే ఎవరెవరో నాయకుల వద్ద చేరిపోయారని, నాయకులు కూడా గతాన్ని మరచిపోయి వ్యవహరిస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకత్వం వాపోతోంది. అందుకే….ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలన్న తాపత్రయం వారిలో కనిపించడం లేదు. ఈ పరిస్థితి ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తోంది.

ఇక ఎన్నికలకు ముందు వైసిపి కోసం ఎంతో చురుగ్గాపని చేసిన సోషల్‌ మీడియా కూడా ఇప్పుడు తమకు సంబంధం లేదన్నట్లు ఉంటోంది. వైసిపి అధికారికంగా నియమించుకున్న సోషల్‌ మీడియా ఉద్యోగులు చేసింది 10 శాతమైతే…పార్టీతో ప్రత్యక్షంగా సంబంధం లేనివారు చేసింది 90 శాతం. అప్పటి అధికార పార్టీపై ఆగ్రహంతోనో, వైసిపిపై ప్రేమతోనో సోషల్‌ మీడియా వేదికగా కలం, గళం ఝుళిపించారు. అధికారం చేపట్టాక కూడా అలాంటి వారిని గుర్తించిన పాపానపోలేదు వైసిపి నాయకులు. ఎన్నికలకు మునుపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ అనుకూల మీడియాను చీల్చిఛండాడిన సోషల్‌ మీడియా యాక్టివిస్టులు…ఇప్పుడు ‘మాకెందుకులే… మేమెందుకు చేయాలి’ అనే భావనలోకి వెళ్లిపోయారు.

ఈ వంద రోజుల్లో జగన్‌ ప్రభుత్వం ప్రజా సానుకూల నిర్ణయాలు అనేకం తీసుకుంది. అయితే… ప్రభుత్వానికి ఆ మేరకు ప్రతిష్ట లభించలేదు. ఇంకా చెప్పాలంటే… గ్రామవాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామకం, ఆర్‌టిసి విలీనం, నామినేటెడ్‌ పదవుల్లో ఎస్‌సి, ఎస్టీ, బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు…వంటి అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ…ప్రతికూల ప్రచారమే జరుగుతోంది. దీనికి కారణం టిడిపి, దాని అనుకూల మీడియా ప్రచార దాడి తీవ్రం చేయడం, ఆ స్థాయిలో ఎదుర్కోవాలన్న దృష్టి వైసిపికి లోపించడమే.

ఇక తెలుగుదేశం పార్టీ అతి తక్కువ సమయంలోనే కోలుకుని, అధికారపార్టీపై దాడి మొదలుపెట్టింది. అన్న క్యాంటీన్ల మూసివేతపైన ఆందోళనలు చేపట్టింది. ఇసుక కొరతపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. రాజధాని అంశాన్ని కంపుకంపు చేసింది. వైసిపి కార్యకర్తలు తమ పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారంటూ ప్రచారం హోరెత్తిస్తోంది. ఏ అంశాన్నయినా….తమకు అనుకూలంగా మార్చు కోవడంలో టిడిపి సక్సెస్‌ అవుతోంది. జగన్‌ పాలన అంత బాగోలేదన్న భావనను జనంలోకి తీసుకెళ్లడంలో ఈ వంద రోజుల్లోనే టిడిపి విజయం సాధించింది.

ఇదే ధోరణి కొనసాగితే…వైసిపి గ్రాఫ్‌ పడిపోవడం ఖాయం. ప్రజల్లో ఉన్న పెదవి విరుపు రాజకీయ వ్యతిరేకతగా రూపుదాల్చితే….భారీ మూల్యమే చెల్లించాల్సిరావచ్చు. వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి మేల్కొంటారా..! పరిస్థితిని చక్కదిద్దుతారా..! ఈ వంద రాజుల ధోరణినే కొనసాగిస్తారా…! ఏమో చూద్దాం..!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*