శాస్త్రోక్తంగా తిరుమల వ‌రాహ‌స్వామివారి ఆల‌య మహాసంప్రోక్షణ

– మధ్యాహ్నం 3 నుండి భక్తులకు దర్శనం ప్రారంభం

తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో శ‌నివారం ఉదయం 11.07 నుండి మ‌ధ్యాహ్నం 1.16 గంట‌ల మధ్య క‌ర్కాట‌క ల‌గ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ కెఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద‌యం మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఆలయ విమాన గోపురానికి యాగశాలలోని కలశంతో అభిషేకం చేశారు. విమాన గోపుర శిఖ‌రంలో న‌లుగురు దేవ‌త‌లుంటారు. వీరిని విమానం ప్ర‌ప‌ధ్యే.., విష్ణుమ‌యం ప్ర‌ప‌ధ్యే…, దేవావాసం ప్ర‌ప‌ధ్యే…, వైకుంఠోద్భ‌వం ప్ర‌ప‌ధ్యే…అనే మంత్రాల‌తో ప్రార్థిస్తారు. గోపురం చుట్టూ 24 మంది ఆవ‌ర‌ణ దేవ‌తలు ఉంటారు. మ‌హాసంప్రోక్ష‌ణ‌తో యాగ‌శాల‌లో కుంభంలో ఉన్న దేవ‌తామూర్తుల శ‌క్తిని బింబం(విగ్ర‌హం)లోకి ఆవాహ‌న చేశారు. విమాన‌గోపురంలోని దేవ‌త‌ల శ‌క్తితో పాటు శ్రీ వ‌రాహ‌స్వామి, శ్రీ విష్వ‌క్సేనుల‌వారు, శ్రీ రామానుజాచార్యులు, పుష్క‌రిణి వ‌ద్దగ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హాల‌కు తిరిగి దైవ‌శ‌క్తి చేకూరింది. దేవ‌తామూర్తుల విగ్ర‌హాల‌కు 12 జీవ‌స్థానాలు, 4 ఉప‌స్థానాలు, 48 క‌ళ‌లు ఉంటాయి. క‌ళాక‌ర్ష‌ణంతో తొల‌గించిన ఈ 48 క‌ళ‌ల‌ను మహాసంప్రోక్ష‌ణ‌తో తిరిగి ఆవాహ‌న చేస్తారు. మ‌హాసంప్రోక్ష‌ణ అనంత‌రం విశేష ఆరాధ‌న‌లు, నైవేద్యాలు స‌మ‌ర్పించారు. ఆ తరువాత అక్ష‌తారోప‌ణం చేపట్టారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు. రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యం నుండి ఈ ఊరేగింపు మొద‌ల‌వుతుంది.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో 1982లో ఈ ఆల‌యంలో మ‌హాసంప్రోక్ష‌ణ జ‌రిగింద‌ని, తిరిగి ఇప్పుడు నిర్వహించే అవకాశం తమకు దక్కిందన్నారు. మ‌హాసంప్రోక్ష‌ణకు ఏప్రిల్ 22న ఉదయం రుత్విక్ వరణం, రాత్రి అంకురార్పణం జరిగాయన్నారు. ఏప్రిల్ 23న కళాకర్షణం జరిగిందని, 4 రోజుల పాటు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ఏప్రిల్ 25న అష్ట‌బంధ‌న కార్యక్ర‌మం, ఏప్రిల్ 26న మహాశాంతి హోమం, మహాశాంతి అభిషేకం చేపట్టామన్నారు.
ఈ ఆల‌య విమాన గోపురానికి బంగారు తాప‌డం చేసేందుకు ఈ బాలాల‌య కార్యక్ర‌మాల సంద‌ర్భంగా కొల‌త‌లు తీసుకున్నట్టు ఈఓ తెలిపారు. అదేవిధంగా ఇక్కడి సేనాధిపతి వారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి, శ్రీ రామానుజుల‌వారికి బంగారు పూత పూసిన మకరతోరణాలు సమర్పించామని, వీటి విలువ దాదాపు రూ.7 ల‌క్ష‌లని తెలిపారు. ఇక్కడ మహాసంప్రోక్షణ కారణంగా శ్రీ‌వారి ఆలయంలో శనివారం ఉద‌యం 11 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఆపేశారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు భక్తులందరూ సహకరించారని, టిటిడి అర్చకస్వాములు, ఇంజినీరింగ్ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది బాగా కృషి చేశారని కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ ప్రభాకర్, డెప్యూటి ఈఓలు హరీంద్రనాథ్, నాగరత్న, ఆలయ ఓఎస్డి శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*