శిలాశాసనాల్లో 1000 ఏళ్ల తిరుమల చరిత్ర..!

  • నిగ్గు తేల్చిన సాధు సుబ్ర‌మ‌ణ్య శాస్ర్తి
  • 8 ఏళ్ల పాటు ప‌రిశోధ‌న‌
  • 1167 శాస‌నాల్లోని స‌మాచారం సేక‌ర‌ణ‌

తిరుమల, తిరుపతి ఆలయాలకు వెయ్యేళ్లకుపైగా చరిత్రవుంది. శిలాశాసనాల రూపంలో అనేక విషయాలు పదిలంగా ఈ కాలానికి లభ్యమయ్యాయి. ఈ సమాచారాన్ని సమీకరించి, క్రోడీకరించి, పుస్తకాలుగా ప్రచురించారు. మహంతు ప్రయాగదాస్‌జీ హయాంలో 1919లో టిటిడిలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన సాధు సుబ్రమణ్యశాస్త్రి ఈ బృహత్‌ కార్యాన్ని నిర్వర్తించారు.

తిరుమల, తిరుపతి దేవాలయాల ప్రాకార గోడలపై చెక్కివున్న విషయాల గురించి తెలుసుకోవాలని ప్రయాగదాస్‌కి అనిపించింది. మనసులోని మాటను తెలియజేస్తూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎఫిగ్రాఫికల్‌ విభాగం….తమ వద్ద తగినంత మంది సిబ్బంది లేరని, దేవస్థానంలో పనిచేసే ఉద్యోగిని ఎవరినైనా పంపితే శిక్షణ ఇస్తామని తెలియజేసింది. ఈ మేరకు సాధు సుబ్రమణ్య శాస్త్రిని ఎంపిక చేసి, శిక్షణ కోసం మద్రాసులోని పురావస్తు పరిశోధన శాఖకు పంపారు. ఏడు నెలలు శిక్షణ తీసుకున్న శాస్త్రి, ఆపై తిరుమల, తిరుపతి ఆలయాల్లోని విషయాలను కాపీ చేయడం ప్రారంభించారు. ఇందుకు ఆయనకు 1922 మార్చి నుంచి 8 సంవత్సరాల సమయం పట్టింది.

సుబ్రమణ్యశాస్త్రి మొత్తం 1,167 శాసనాలను వెలికితీశారు. ఈ శాసనాలను 6 సంపుటాలుగా ప్రచురించారు. మొదటి సంపుటంలోని 236 శాసనాల్లో పల్లవులు, చోళులు, పాండ్యులు, యాదవరాజులు, మొదటి విజయనగర రాజుల గురించి వివరించారు. రెండో సంపుటంలో 169 శాసనాల వివరాలున్నాయి. ఇందులో విజయనగరరాజు సాళువ నరసింగరాజు గురించి పేర్కొన్నారు.

మూడో సంపుటిలో 229 శాసనాలున్నాయి. ఇవి శ్రీకృష్ణ దేవరాయుల గురించినవే. నాల్గవ సంపుటిలో 251 శాసనాల వివరాలు నమోదు చేశారు. విజయనగర రాజైన అచ్చుతరాయల కాలంనాటి సమాచారం ఇందులోవుంది. ఐదో సంపుటిలో 147 శాసనాల వివరాలున్నాయి. ఇందులో సదాశివరాయల కాలంనాటి విషయాలున్నాయి. 135 శానాలున్న ఆరో సంపుటిలో విజయనగర సామ్రాజ్య కడపటి రాజులైన అరవీడు రాజుల పాలనా విశేషాలున్నాయి. ఈ శాసనాలు కీ.శ. 614 నుంచి కీ.శ.1909 దాకా ఉన్నాయి. ఇందులో తిరుమల, తిరుపతికి సంబంధించి చాలా విషయాలున్నాయి.

ఆయన సేకరించిన శాసనాలలో 640 శాసనాలను తిరుమల శ్రీవారి ఆలయం నుంచే సేకరించారు. 340 శాసనాలను తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి సేకరించారు. ఇతర దేవాలయాల నుంచి 187 శాసనాలను క్రోడీకరించారు. సాధు సుబ్రమణ్యశాస్త్రి సేకరించిన 1,167 శాసనాలలో 50 తప్ప మిగిలినవన్నీ తమిళ భాషలోనే ఉన్నాయి. ఈ 50 తెలుగు, కన్నడ, సంస్తృత భాషల్లో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయుల ముందు కాలానికి సంబంధించి లభించిన శాసనాల్లో తెలుగులో రాసినది ఒకటి మాత్రమే ఉంది.

సాధు సుబ్రమణ్యశాస్త్రి శాసనాలను అధ్యయనం చేయడం ప్రారంభించేనాటికే అనేకమైన శిలాశాసనాలు శిథిలమయ్యాయి. వాటి విలువ తెలియని వారు సాధారణ బండరాళ్లలాగా విరగ్గొట్టి ఇతర నిర్మాణాల్లో వినియోగించారు. దీంతో కొన్ని ముక్కలు మ్కులుగా దొరికాయి. ఇలాంటి వాటి నుంచి సమాచారం సేకరించడం సాధ్యంకాలేదు.

శాసనాల్లోని సమాచారాన్ని క్రోడీకరించడమంటే సామాణ్యమైన విషయం కాదు. దానికి బహుభాషా పరిజ్ఞానం మాత్రమే సరిపోదు….శారిత్రక పరిజ్ఞానమూ అవసరం అవుతుంది. వివిధ కాలాల్లోని శాసనాల్లోని భాషను అర్థం చేసుకోవడం, ఆ పదాలను ప్రస్తుత (వివరాలు సేకరించిన కాలం) కాలంతో పోల్చుకోవడం, ఇంకా తేదీలను సరిపోల్చుకోవడం, దానికి ముందు శాసనాలతో బేరీజు వేసుకోవడం ఇలా ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. దీన్ని సమర్థవంతంగా నిర్వర్తించారు సుబ్రమణ్య శాస్త్రి.

శ్రీవారికి ఏకాలంలో ఎవరెవరు ఎటువంటి కానుకలు బహూకరించారో ఈ శాసనాల ద్వారానే తెలిసింది. శ్రీవారి ఆలయాన్ని దశల వారీగా ఎవరెవరు నిర్మించారో, ఎప్పుడెప్పుడు మరమ్మతులు చేయించారో తెలుసుకోడానికీ ఈ శాసనాల ద్వారానే వీలయింది. ఆలయ పూజా విధానాల్లో కాలక్రమంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో కూడా తెలిసింది.

తిరుమల, తిరుపతి ఆలయాలకు సంబంధించి వందల, వేల పేజీల సమాచారం అందుబాటులో ఉందంటే…దానికి సాధు సుబ్రమణ్యశాస్త్రి చేసిన కృషే కారణమని చెప్పాలి. ఎందరో రాజులు కోట్ల విలువైన కానుకలను శ్రీవారికి సమర్పించి ఉండొచ్చుగానీ…సుబ్రమణ్య శాస్త్రి సమర్పించిన ఈ కానుక వెలకట్టలేనిది. అమూల్యమైనది.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*