శివయ్య స్కిట్‌కు …ఎంఎల్‌ఏతోనే మోక్షం..!

  • వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ప్రధాన ఆశయంతో నెలకొల్పిన శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (స్కిట్‌) ఇంజినీరింగ్‌ కాళాశాల కాలగర్భంలో కలిసిపోపయే ప్రమాదంలో పడింది. కళాశాలను బాగు చేయాల్సిన దేవాదాయ శాఖ అధికారులు ఏ కారణంగానో నిద్రావస్థలో ఉన్నారు. ఫలితంగా కళాశాల భవిత ప్రశ్నార్థకంగా మారింది. స్కిట్‌ కళాశాలకు ఈ విద్యాసంవత్సరంలో ఏఐసిటిఈ అనుమతి కూడా రాలేదు. కళాశాలకు అనుమతులు సాధించడం కోసం నూతన ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.రజనీకాంత్‌ ఎంతో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందిస్తేగానీ కళాశాలకు పూర్వవైభవం రాదు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా పట్టణంలో 1997లో స్కిట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దేవాదాయ శాఖ తరపున ఏర్పాటు చేసిన ఏకైక ఇంజినీరింగ్‌ కాలేజీ ఇదే కావడం విశేషం. ఈ కళాశాల ఏర్పాటుకు అప్పటి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి చొరవ తీసుకున్నారు. కళాశాలను మొదట కాసాగార్డెన్‌లోని భవనాల్లో నిర్వహించారు. ఆ తరువాత…. కళాశాల కోసం శ్రీకాళహస్తి పట్టణ శివార్లలో, పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారి పక్కనే సుమారి 55 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించారు. మొదట్లో బిజెక్‌ కోర్సులకే అనుమతి ఉండేది. ఆ తరువాత ఎంటెక్‌ కోర్సులకూ అనుమతి లభించింది. స్కిట్‌కు ఎంతో పేరు ఉండేది. ఇక్కడ చదవడమంటే ప్రతిష్టాత్మకంగా భావించేవారు. స్కిట్‌లో చదివిన ఎందరో విద్యార్థులు ఇప్పుడు అతున్నత స్థానాల్లో, విదేశాల్లో స్థిరపడ్డారు.

2014 తరువాత.. : ఒకనాడు ఎంతో కీర్తి ఆర్జించిన స్కిట్‌…2014 తరువాత పతనం మొదలయింది. ప్రిన్సిపాల్‌ను తరచూ మార్చడం, ఆలయ ఈవోలు పట్టించుకోకపోవడం, అధ్యాపకులు గ్రూపులుగా విడిపోవడం, బోధన పట్టించుకోపోవడం….తదితర కారణాలతో స్కిట్‌ అస్థవ్యస్థంగా మారింది. కొందరు అంకితభావంతో పని చేసినా కొందరు….నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చదువులు పూర్తిగా కుంటుపడ్డాయి. ఉత్తీర్ణత తగ్గిపోయింది. దీంతో ఈ కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతూ వచ్చింది. రెండేళ్లుగా ఒకరు కూడా చేరలేదు. ఇక్కడ నిర్వహిస్తున్న డిప్లొమా కోర్సుల్లో మాత్రమే విద్యార్థులు చేరుతున్నారు. గతంలో పని చేసిన ఓ ప్రిన్సిపాల్‌ సకాలంలో నివేదికలు సమర్పించకపోవడంతో 2019-2020 విద్యాసంసవత్సరానికి ఏఐసిటిఈ నుంచి అనుమతులు కూడా రాలేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి.

జెఎన్‌టియూలోకి విలీనమంటూ…: కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో పడిన స్కిట్‌ను జెన్‌టియు (ఎ)లోకి విలీనం చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందుకోసం ఓ కమిటీని నియమించారు. అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్‌ అనురాధ స్వయంగా కళాశాలను సందర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కళాశాల విలానానికి గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చారు. అయితే…ఆ తరువాత సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడంతో విలీనం ప్రక్రియ ఆగిపోయింది. ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సివుంది.

దేవాదాయ శాఖ నిర్లక్ష్యం…: దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కళాశాల ప్రాభవం కోల్పోయిందనే అభిప్రాయం సర్వత్రావుంది. ముక్కంటి ఆలయ ఈవో స్కిట్‌ కరస్పాండెంట్‌గా ఉంటారు. అయితే…ఈవోలుగా వచ్చినవారు ఆలయానికే పరిమితమవడం, కళాశాలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. శ్రీకాళహస్తి ఆలయానికి ప్రస్తుతం రూ.100 కోట్ల వార్షిక ఆదాయం ఉంది. ఇందులో 10 శాతం స్కిట్‌కు కేటాయిస్తే పూర్వవైభవం తీసుకురావచ్చు.

అప్పుల ఊబిలో… : విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో స్కిట్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. బకాయిలు చెల్లించకుంటే….కనెక్షన్‌ తొలగిస్తామని విద్యుత్‌ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా సిబ్బంది వేతనాల కోసం నెలకు రూ.25 లక్షలు ఆలయం నుంచి ఖర్చు చేయాల్సివస్తోంది.

ఎంఎల్‌ఏ చొరవ అవశ్యం : స్కిట్‌ బాగుపడాలంటే స్థానిక ఎంఎల్‌ఏ బియ్యపు మధుసూదన రెడ్డి చొరవ ఎంతయినా అవసరం. కళాశాల గురించి ముఖ్యమంత్రితో చర్చించి, జెన్‌టియులోకి విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాల్సివుంది. ఇంకో ఆలోచన ఏదైనావుంటే…ఆచరణలోకి తీసుకురావాలి. అదేవిధంగా తక్షణం…కళాశాలకు ఏఐసిటిఈ అనుమతులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి.

  • డాక్టర్‌ వి.రజనీకాంత్‌, ప్రిన్సిపాల్‌, స్కిట

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*