శివాజీ కొత్త సిద్ధాంతం! ప్ర‌భుత్వం ప‌ని చేయ‌కున్నా ప్ర‌తిప‌క్ష కుట్రే..!

సినీనటుడు శివాజీ చాలా రోజుల తరువాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన సమయంలో అమెరికాలో ఉన్న శివాజీ అక్కడి నుంచి తెలుగుదేశం అనుకూల టివి ఛానళ్లలో గంటలకొద్దీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. స్వదేశానికి వచ్చిన తరువాత మీడియా ముందు కనిపించలేదు.

తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆపరేషన్‌ గరుడ అమలవుతోందంటూ హడావుడి చేసిన ఆయన తాజాగా మరో వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడానికి, 12 లక్షల ఓటర్లను తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి చ్కుల భూముల వ్యవహారాన్ని చూపించారు.

గుంటూరు జిల్లాలోని ఏదో సర్వే నెంబరులోని భూములు రిజిస్ట్రేషన్‌ కావడం లేదని, దీనివల్ల ఆ రైతు కుటుంబాలకు చెందిన 12 లక్షల ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారని, ఇదంతా కుట్రపూరితంగా సాగుతోందని, కొందరు అధికారులు ఇదంతా చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

తాను ఏది చెప్పినా…గంటల తరబడి చూపించే ఛానళ్లు, పేజీల కొద్దీ రాసే పత్రికలు ఉన్నాయన్న ధైర్యం కావచ్చు…అందుకే అడ్డగోలుగా మాట్లాడటమే కాదు….దబాయించి మాట్లాడే స్థాయికి శివాజీ వెళ్లిపోయారు. భూముల రిజిస్ట్రేషన్‌ కాకుంటే…అందుకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం. సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. నిలదీయాల్సింది ప్రభుత్వాన్ని.

చుక్కల భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. శివాజీ చెబుతున్న భూములు ఎందుకు రిజిస్ట్రేషన్‌ కావడం లేదో ప్రభుత్వాన్ని అడగాలి. ఒకరిద్దరు అధికారులు అడ్డుపడటం వల్లే ఇదంతా ఆగిపోయిందని శివాజీ చెబుతున్నారు. ఏదైనా పనిని ప్రభుత్వం చేయాలనుకుంటే ఒకరిద్దరు అధికారులు ఆపేయగలరా? నిజంగా అధికారులు కుట్రపూరితంగా అడ్డుపడుతుంటే, ఆ పని చట్టపరిధిలో ఉన్నదే అయితే…ఆ అధికారులను మార్చేసి పని చేయించాలి.

చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి వద్ద అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని అనుకోలేం. అలా వ్యవహరిస్తే ఏమీ చేతకానట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తారని భావించలేం. ప్రభుత్వం చెప్పినా అధికారులు చేయలేదంటే…అది చట్టాలకు విరుద్ధమై ఉండాలి. అందువల్లనే ప్రభుత్వం వెనకడుగువేస్తుండాలి. అయినా….రైతులకు అన్యాయం జరుగుతోందని శివాజీ భావిస్తే ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని. అది వదిలేసి ఒకరిద్దరు అధికారులు కుట్ర చేస్తున్నారని చెప్పడం అర్థరహితం అవుతుంది.

భూముల రిజిస్ట్రేషన్‌ జరగకుండా చూస్తున్న అధికారులు…ఉద్యోగాలకు రాజీనామా చేసి నచ్చిన పార్టీలో చేరాలని శివాజీ కామెంట్‌ చేశారు. అయినా…ముందుగా ముసుగు తీసి అధికార పార్టీలో చేరాల్సింది శివాజీనే. ఆయన బాధ రైతుల భూముల రిజిస్ట్రేషన్‌ కాదు…ఆ రైతుల ఓట్లు టిడిపికి దక్కకుండాపోతాయనేదే. రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునే శివాజీకి ఆ ఓట్లు ఎటుపోతే ఆయనకు ఏమిటి…అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.

రైతుల సమస్య పరిష్కారంకాకపోడానికి ప్రభుత్వానికంటే…ప్రతిపక్షానిదే బాధ్యత అన్నట్లు మాట్లాడుతున్నారు శివాజీ. ఇటువంటి సమస్యలను ప్రతిపక్షం అడగడం లేదట, ముఖ్యమంత్రి పదవి తప్ప ఇంకొకటి ప్రతిపక్షానికి పట్టదట. శివాజీ మాట్లాడిన ఏమాటకూ హేతుబద్ధత కనిపించడం లేదు.

అయినా…2 లక్షల ఓట్లు వస్తాయనుకుంటే ఆ పనిని చంద్రబాబు ఎందుకు చేయకుండా ఉంటారు? అతి చట్టానికి వ్యతిరేకమైనదై ఉండాలి. పని చేయలేకపోవడంతో…దాన్ని నేరుగా చెప్పకుండా ఎవరో అధికారులు కుట్ర చేయడం వల్లే ప్రభుత్వం పని చేయలేకపోతోందని శివాజీ ద్వారా ప్రచారం చేయించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*