శివాజీ జవాబు చెప్పాల్సిన ప్రశ్నలెన్నో..!

వైపిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో….సినీనటుడు శివాజీ వార్తల్లో కేంద్ర బిందువైపోయారు. అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయన పేరునే స్మరిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్నా స్కైప్‌ ద్వారా టివి ఛానళ్లలో ప్రత్యక్షమై మాట్లాడుతున్నారు.

ఆపరేషన్‌ గరుడ పేరుతో ఆరు నెలల క్రితం శివాజీ వెల్లడించినట్లే….రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి సహా టిడిపి నేతలంతా చెబుతున్నారు. ఆపరేషన్‌ గరుడ సూత్రధారి బిజెపి అని, వైసిపి అందులో పాత్రధారి అని అంటున్నారు.

వైసిపి ఏమో…గరుడ పురుణం రాసింది చంద్రబాబు నాయుడేనని, దాన్ని శివాజీతో పఠింపజేశారని అంటున్నారు. ఆపరేషన్‌ గరుడలో ప్రధాన పార్టీ నేతపై ప్రాణహాని లేని దాడి జరుగుతుందని చెప్పినదాన్ని నిజం చేయడానికే…జగన్‌పై దాడి చేయించారని వైసిపి ఆరోపిస్తోంది. ఎవరికీ తెలియని విషయాలు శివాజీకి ఎలా తెలిశాయో ఆయన్ను విచారించాలని చాలామంది డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శివాజీ ప్రధాన చర్చనీయాంశమయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలకు శివాజీ చాలా ఉద్వేగభరితంగా, ఆవేశపూరితంగా సమాధానాలిస్తున్నారు. టిడిపితో కలిసి ఇదంతా చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై శివాజీ స్పందిస్తూ…తనకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రభుత్వం తప్ప…పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. టిడిపితో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే తనను అమరావతి వీధుల్లో ఉరి తీయండి అని అంటున్నారు.

శివాజీ అవునన్నా కాదన్నా….ఆయన మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడాలన్న తాపత్రయం కనిపిస్తోంది. తాను తెలుగుదేశం అభిమానని, ఆ పార్టీ కోసం పని చేస్తానని శివాజీ చెప్పుకుంటే తప్పులేదు. టిడిపి గెలుపు కోసం అహర్నిశలూ పని చేసినా ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే…రాష్ట్ర ప్రయోజనాల పేరుతో తెలుగుదేశం తప్ప మిగిలిన అన్ని ప్రధాన పార్టీలపైన దాడి చేయడమే అభ్యంతరకరంగా కనిపిస్తోంది.

శివాజీ తాను తటస్థున్ని అని నిరూపించుకోవాలంటే…ఆయన సమాధానం చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో ఆయన చెబుతున్న అంశాల్లో తప్పొప్పులు ఏమిటో కూడా ఆయన బదులివ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.

సిబిఐ, ఐటి పేర్లతో దాడులు చేస్తారు, కేసులు పెడతారని శివాజీ చెప్పారు. పన్నులు ఎగ్గొట్టి కోట్లు వెనకేసుకున్న ప్రజాప్రతినిధుల రూపంలో ఉన్న వ్యాపారవేత్తలపై ఐటి దాడులు నిర్వహించడం ఏ విధంగా తప్పవుతుంది. అది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం అని శివాజీ ఎలా చెప్పగలరు? అవినీతిపరులపై కేసులు పెట్టకూడదా? శివాజీ ఏమి చెప్పదలచుకున్నారు? అక్రమార్కులైన కొందరిపై ఐటి దాడులు నిర్వహిస్తే….అది ఆంధ్రప్రదేశ్‌పై దాడిగా తెలుగుదేశం అభివర్ణిస్తోంది. అదే మాటను శివాజీ అంటున్నారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షించేవారైతే….అవినీతిపరులపై ఐటి దాడులు జరుగుతున్నందుకు సంతోషించాలి. అంతేగానీ….అదేదో నేరమన్నట్లు ఎందుకు మాట్లాడాలి?

ఈ దాడులు రాజకీయ కక్షతోనే చేశారని అనుకుందాం….అదే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదా? తనకు నచ్చని నేతలను, ప్రశ్నించేవారిని బెదిరించడం లేదా? ఎంఎల్‌సి ఎన్నికల్లో రాయలసీమ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని తిరుపతికి చెందిన ఓ విద్యావేత్త పూనుకుంటే…ఎన్నికలకు రెండు రోజుల ముందు ఆమె విద్యాసంస్థలపై దాడులు చేయించి, ఆఖరు నిమిషంలో ఆమెను పోటీ నుంచి తప్పించలేదా? అసలు అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో ప్రతిపక్ష పార్టీల నేతపై ఎన్ని అక్రమ కేసులు బనాయించడం లేదు…? ఇది ప్రజాస్వామ్యంపై దాడి కాదా?

ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయని శివాజీ తెగబాధపడిపోతున్నారు. అయినా….ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఆయనకు తెలియవా? ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న పంచాయతీ సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు ఉండగా.. జన్మభూమి కమిటీల పేరుతో వచ్చిన వాళ్లు పెత్తనం చేస్తున్న సంగతి శివాజీకి తెలియదా? ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కేయడం కాదా?

ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటన ఉంటే…ముందురోజు రాత్రే కమ్యూనిస్టు పార్టీల నేతలను అరెస్టు చేయడం; సిఎం సభలో చిన్నపాటి నిరసన వ్యక్తం చేస్తే కేసులు పెట్టడం, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయడం….ఇవన్నీ ప్రజాస్వామ్యం కోసమేనా? ఏనాడైనా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని శివాజీకి అనిపించలేదా?

వైసిపి నుంచి ఎన్నికైన 23 మందిని టిడిపిలో చేర్చుకున్నారు. కొందరికి మంత్రిపదవులు ఇచ్చారు. దీనిపైన వైసిపి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా చర్యలు లేవు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా? దీన్ని గురించి శివాజీ మాట్లాడరా?

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా…ఎంఎల్‌ఏలకు ఏడాదికి రూ.2 కోట్ల నిధులు ఇచ్చేవారు. ఈ నిధులను ఆయా నియోజకవర్గాల్లో అత్యవసర పనుల కోసం ఎంఎల్‌ఏలు వినియోగించేవారు. ఆ నిధులను టిడిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి ఎంఎల్‌ఏలు లేనిచోట్ల పార్టీ ఇన్‌ఛార్జ్‌లు సిఫార్సు చేసిన పనులకు నిధులు ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? దీని గురించి శివాజీ ఎందుకు మాట్లాడరు?

ఇటువంటివి అనేకం ఉన్నాయి. ప్రజాస్వామ్యమంటే….ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పీఠాన్ని కాపాడటం మాత్రమే అని శివాజీ అనుకున్నారా? ప్రజాస్వామ్యానికి ఉన్న విస్తృతమైన అర్థం ఇన్ని మాట్లాడుతున్న శివాజీకి తెలియదనుకోవాలా?

ప్రజాస్వామ్యం, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఏది మాట్లాడినా చెల్లిపోతుందని శివాజీ భావించవచ్చు. ఇది చెల్లుబాటయ్యేది కాదు. రాజకీయం చేయదలచుకుంటే…. బహిరంగంగా చేయాలి. అంతేగానీ…తానేదో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా, ప్రభుత్వ ధోరణిని విమర్శించేవాళ్లంతా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యక్తులుగా శివాజీ చూపించాలనకుంటే సాధ్యమయ్యే పని కాదు.

అయినా…రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం సహజం. అధికార పార్టీని గద్దె దింపడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోవు. ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతూనే ఉంటాయి. అదేదో దేశ ద్రోహానికి పాల్పడినట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు శివాజీ.

ఇక ఆపరేషన్‌ గరుడ విషయానికొద్దాం….ఆపరేషన్‌ గరుడను కేంద్రంలోని బిజెపి అమలు చేస్తోందని అనుకుందాం…ఆరు నెలల క్రితమే శివాజీ అన్ని విషయాలను బహిరంగంగా చెప్పిన తరువాత కూడా….అదే వ్యూహాలను అమలు చేస్తుందా? ప్రాణహాని లేని దాడి జరగబోతోందని బయటకు తెలిసిపోయిన తరువాత కూడా అదేపని చేస్తారా?

ఇప్పటికైనా మించిపోయింది లేదు. తాను అధికార పార్టీ తరపున నిలబడాలంటే నిలబడొచ్చు. బహిరంగంగా రాజకీయాలు చేయొచ్చు. అంతేగానీ…ముందే చెప్పినట్లుగా ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం అంటూ నీతులు వళ్లించాలనుకుంటే ప్రజలు విశ్వసించరు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*