శివానందం…సుందరంగా స్వర్ణముఖి..!

  • జోరుగా జరుగుతున్న ప్రక్షాళన పనులు
  • పైపులైన్ ద్వారా మురికినీరు
  • తరలించేందుకు చొరవ
  • నది సుందరీకరణపై ఎంఎల్ఎ ప్రత్యేక దృష్టి

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

  ఇన్నాళ్లు రాళ్ళు, రప్పలు, చెత్తా చెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోయి చూసేందుకే అంద విహీనంగా ఉండేది స్వర్ణముఖి నది. అయితే స్వర్ణముఖి నది ప్రక్షాళనకు ఎంఎల్ఎ బియ్యపు మధుసూదన్ రెడ్డి చొరవ చూపడంతో ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత పది రోజులుగా ప్రక్షాళన పనులు జరగతుండటంతో నదిలో ఎటుచూసినా పరిశుభ్రత కనిపిస్తోంది. నది ఆనకట్ట పై కూడా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వంతెనపై వెళ్లేప్రయాణీకులు, భక్తులు సైతం ఆగిమరీ నదిని చూస్తున్నారంటే అభివృద్ధి ఏస్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. ఈ పనులన్నీ ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి చొరవతో దాతల దాతృత్వంతో జరుగుతున్నాయి.

సుందరంగా స్వర్ణముఖి నది
గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి స్వర్ణముఖి నది ప్రక్షాళనకు పూనుకున్నారు. గత పది రోజులుగా నదిలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. జలవినాయకుని ఆలయం నుంచి అర్ధనారీశ్వరాలయం వరకు ప్రక్షాళనకు పూనుకున్నారు. ఇందులో భాగంగా మొదటగా జలవినాయకుని ఆలయం నుంచి దుర్గమ్మ కొండ సమీపంలో ఉన్న కాజ్ వే వరకు సుమారు 20 జెసిబిలు, 6 ఇటాచీలతో నదిలో మొక్కలు తొలగించి, చెత్తా చెదారాలను ఏరివేసి శుభ్రం చేశారు. దీనికి తోడు ఎంతోకాలంగా నదికట్టపై ఉన్న ఆక్రమణలు తొలగించి కట్టను చదునుచేయించారు. నదికట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు 40 ట్రాక్టర్లు ద్వారా గ్రావెల్ తోలించి చదును చేయిస్తున్నారు. ఆలయం సమీపంలో ఉన్న వంతెన నుంచి కాజ్ వే వరకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం, కాజ్ వే వద్ద వాకర్సు కూర్చొనే సదుపాయం కల్పించడం , మొక్కలు పెంచడం వంటి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నది ఆనకట్ట దారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను సైడుకు వేయాలని ఇప్పటికే ట్రాన్స్ కో అధికారులకు సూచించినట్లు సమాచారం. దీనికి తోడు నదికట్టపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రాజెక్ట్ వీధి వాసులు ఎంతో కాలంగా ఇబ్బందిపడుతూ వచ్చిన మందుబాబులు సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. మరోవైపు దేవస్థానంకు సంబంధించిన రెండున్నర ఎకరాల బేరివారిసత్రం పూలతోట స్థలంలో పిచ్చిమొక్కలు తొలగించి, ఆక్రమణలు నివారించి అక్కడ కూడా వాకర్సు కూర్చునే సదుపాయం కల్పించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రెండో దశలో భాగంగా కాజ్ వే నుంచి అర్దనారీశ్వరాలయం వరకు ఇదేతరహా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఎంఎల్ఎ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ తగు సూచనలు ఇస్తుండగా, ఆ పార్టీ నాయకులు అంజూరు శ్రీనివాసులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.

రూ.21 కోట్లతో పైపులైన్….
స్వర్ణముఖి నది ప్రక్షాళన పనులు ఎంత జరుగుతున్నా పట్టణ ప్రజలను, భక్తులను వేధిస్తున్నది మురికినీటి సమస్య. పట్టణంలోని డ్రైనేజీ నీరు నదిలో కలుస్తుండటం వలన నది పూర్తిగా కాలుష్యం అవుతోంది. ఈ సమస్య పరిష్కారం పై ఎంఎల్ఎ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 21కోట్ల రూపాయల తో పైపులైన్ ఏర్పాటు చేసి మురికినీటిని కన్నలి కాలువలో కలిసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అక్కడ మురికినీరు ప్యూరిపై చేసి చెత్తను తొలగించి ఆనీటిని వ్యవసాయానికి ఉపయోగిం చనున్నట్లు తెలుస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమం మరో మూడు నెలలు లోపు ప్రారంభించున్నట్లు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే స్వర్ణముఖి నదికి పూర్వవైభవం రావడం ఖాయమని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా స్వర్ణముఖి నదికి మంచి రోజులు తీసుకువచ్చిన ఎంఎల్ఎను పురప్రజలు అభినందిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*