శేషాద్రివాసుని హారతికి శేషాద్రి అడ్డు..! ఇది ధర్మమా?

దేవుడికి హారతి ఇవ్వడానికి హారతిపళ్లెంతో వచ్చిన భక్తులను ఏ అర్చకుడైనా తిప్పిపంపుతారా? స్వామికి హారతి ఇవ్వకుండా అడ్డుకుంటారా? తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అటువంటి సంఘటనే జరిగింది. వాహన సేవలో శ్రీవారికి హారతి ఇవ్వడానికి వచ్చిన టిటిడి ఉద్యోగులకు ఆ అవకాశం లేకుండా…తిప్పి పంపడమేగాక…ప్రశ్నించినందుకు ఓ ఉద్యోగిని బ్రహ్మోత్సవాలు ముగియక మునుపు బదిలీ చేసిన ఉదంతం చూస్తే…ఇదేమి ధర్మం అనిపించకమానదు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన పెద్ద శేష వాహనం సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే…

ఆ రోజు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన కూడా వాహన సేవలో పాల్గొన్న విషయం తెలిసిందే. శ్రీవారి వివిధ వాహనాలపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగేటప్పడు…టిటిడికి చెందిన ఒక్కో విభాగం వారు ఒక్కో పాయింటు వద్ద హారతి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. వైకుంఠం-2 ఉద్యోగులకూ ఒక హారతి పాయింటు ఉంది. పెద్ద శేషవాహనం రోజు సిఎం వచ్చిన హడావుడి నేపథ్యంలో….అక్కడి సిబ్బంది సకాలంలో హారతి తీసుకురాలేకపోయారు. ఆ పాయింటు దాటుకున్నాక, కొన్ని నిమిషాలు ఆలస్యంగా ఇంకో పాయింటు వద్దకు హారతి తీసుకొచ్చారు. వాహనం వద్ద ఉన్న డాలర్‌ శేషాద్రికి హారతి పళ్లెం అందజేశారు. స్వామికి హారతి ఇవ్వకుండా…ఆ పళ్లేన్ని వెనక్కి ఇచ్చేవారు. ‘మీ పాయింటు ఇది కాదు… వెళ్లిపోండి’ అని హారతి ఇవ్వఆనికి తిరస్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు – ఆయనకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆఖరికి హారతి ఇవ్వకుండానే ఉద్యోగులు వెను దిరిగారు.

తమకు కేటాయించిన పాయింటు వద్దకు సకాలంలో హారతి తీసుకురాకపోవడం ఉద్యోగుల తప్పేకావచ్చు. అయినా…ఇంకో పాయింటు వద్ద హారతి ఇవ్వకూడదని ఏముంది? హారతి ఇవ్వడానికి స్వామి ముందుకు తీసుకొచ్చిన పళ్లెంను చిన్న సాంకేతిక కారణంతో తిప్పిపంపవచ్చా? ఇది ధర్మమా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా…ఈ ఉదంతాన్ని మనుసులో ఉంచుకుని వైకుంఠం-2 సూపరింటెండెంట్‌, ఉద్యోగ సంఘ నాయకుడు మోహన్‌ రెడ్డిని బదిలీ చేస్తూ ఆగమేఘాలపై ఉత్తర్వులు ఇచ్చారు. పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. జెఈవో వద్ద రిపోర్టు చేయమని సూచించారు. దీనిపై టిటిడి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి హారతి ఇవ్వకుండా అడ్డుకున్న శేషాద్రిపై చర్యలు తీసుకోవడం బదులు…హారతి తీసుకొచ్చిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సమ్మెకు నోటీసు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంఘాల నేతలపై అకారణంగా చర్యలకు పూనుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*