శ్రీకాళహస్తిలో దొడ్డిదారి దర్శనాలకు దేవస్థానం బ్రేక్..!

  • అనుమతి ఉంటేనే ప్రత్యేక ప్రవేశమార్గం
  • రోజూ ఇఓకు, ఉన్నతాధికారులకు నివేదిక
  • రోజుకు 150 సిఫార్సు లేఖలు ఇస్తున్న అధికారులు..?

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

   శ్రీకాళహస్తీశ్వరాలయానికి మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ఇన్నాళ్లూ అడ్డుగోలు దర్శనాలతో, దళారీ వ్యవస్థతో అప్రతిష్టపాలయిన ముక్కంటి ఆలయాన్ని గాడిలో పెట్టే దిశగా చర్యలు చేపడు తున్నారు. ఇందులో భాగంగా మూడు రోజులుగా దర్శనాలను కట్టుదిట్టం చేశారు.200 రూపాయల టికెట్ కొన్న భక్తులు మినహా మరెవరైనా నేరుగా దర్శనాలకు వెళ్లాలంటే అధికారుల దగ్గర అనుమతి లెటర్ తీసుకోవాల్సిందే. ఈచర్యతో అడ్డుగోలు దర్శనాలు చేయించేవారు హడలిపోతున్నారు. 

అడ్డుగోలు దర్శనాలకు బ్రేక్…
ముక్కంటి ఆలయంలో
దళారీ వ్యవస్థ, అడ్డుగోలు దర్శనాలు చేయించడం ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉంది. భ్రమరాంబ ఇఓగా ఉన్నప్పుడు కొంతమేర కట్టుదిట్టం చేసినప్పటికీ తదుపరి అదే విధానం కొనసాగుతూ వస్తూఉంది. దీంతో భక్తులు ఇబ్బందిపడటమే కాక , దేవస్థానంకు చెడ్డపేరు ఉండేది. అయితే మూడు రోజులు క్రితం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణ క్యూలైన్లో వెళ్లే భక్తులు మినహా స్పెషల్ క్యూలైన్లో వెళ్లాలంటే తప్పనిసరి గా 200 టికెట్ కొనుగోలు చేసేలా అధికారులు నిబంధనలు విధించారు. టికెట్ లేకుండా నేరుగా దర్శనాలకు వెళ్లాలంటే దేవస్థానం అధికారులు నుంచి తప్పనిసరిగా సిఫార్సు లెటర్ ఉండాల్సిందే. ఒక్కో లెటర్ ద్వారా పది మంది వరకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు సమాచారం. ఈ సిఫార్సు లెటర్ ద్వారా ఏ రాజకీయ పార్టీ, లేదా మీడియానా లేదా దేవస్థాన సిబ్బందా…లేక ఇతర అధికారులా.. అనే సమాచారం సిఫార్సు లెటర్ లో పొందుపరుస్తున్నారు. అలాగే దర్శనానికి వెళ్లే గేటు వద్ద రిజిస్టర్ లో వీటిని నమోదు చేసుకుని దర్శనానికి పంపుతున్నారు. ఇలా రోజూ ఎన్ని సిఫార్సు లెటర్స్ ద్వారా ఎంత మంది దర్శనాలకు వెళుతున్నారో ఆ వివరాలు సాయంత్రానికి ఇఓకు ,ఆయన ద్వారా ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని పగడ్బందీగా నిర్వహిస్తుండటంతో దళారులు, అడ్డుగోలు దర్శనాలు చేయించేవారు హడలి పోతున్నారు.

రోజుకు 150 సిఫార్సు లెటర్లట..?
దేవస్థానం
అధికారులు సిఫార్సు లెటర్లు తెరపైకి తేవడంతో అడ్డుగోలు దర్శనాల బండారం బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్క రోజే సుమారు150 సిఫార్సు లెటర్లు ఇచ్చినట్లు సమాచారం. తద్వారా ఒక్కో లెటర్ ద్వారా ఏడు మంది అనుకున్నా వెయ్యి మంది పైనే స్పషల్ దర్శన మార్గం గుండా టికెట్ కొనుగోలు చేయకనే దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫలితంగా దేవస్థానంకు రోజుకు రూ.2 లక్షల మేర నష్టం వాటిళ్లుతుందనే విమర్శలున్నాయి. టిటిడి తరహాలో ఇక్కడ కూడా టికెట్లు వ్యవహారం పూర్తిగా అమలు పరిస్తే బాగుంటుందనేది పలువురి అభిప్రాయం పాలకులు ఏచర్యలు చేపడతారో వేచిచూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*