శ్రీకాళహస్తి ఆలయంలో ‘దర్శన దళారులు’!

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మళ్లీ దర్శన దళారులు పేట్రేగిపోతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా ఆలయంలోకి దూసుకెళుతున్నారు. నిన్నటి దాకా ఈవోగా ఉన్న భ్రమరాంబ బదిలీపై వెళ్లిన మరుక్షణం నుంచి ఆలయం దళారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. అడిగేవారే లేరు. దీంతో ఆలయానికి రోజూ వేలాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.

శ్రీకాళహస్తి ఆలయంలో ఒకప్పుడు దళారులు యథేచ్ఛగా తమ పార్టీలకు దర్శనాలు చేయిస్తూ జేబులు నింపుకునేవారు. ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు ఐదు, పది వేల మంది వచ్చేది కష్టంగా ఉండేది. ఇప్పుడు 20 వేలు – 30 వేలు కూడా వస్తున్నారు. దర్శనానికి గంటల సమయం పడుతోంది. దీన్ని దళారులు అవకాశంగా మార్చుకున్నారు. ముందుగానే భక్తుల బృందాలతో మాట్లాడుకుని, అక్రమ మార్గాల్లో లోనికి తీసుకెళ్లి దర్శనాలు చేయించేవారు. ఒక్కో పార్టీ నుంచి రూ.2000 నుంచి మూ.3000 దాకా వసూలు చేసుకునేవారు. నిత్యం 20-30 మంది దళారులకు ఇదే పనిగా ఉండేది. 2015 అక్టోబర్‌లో భ్రమరాంబ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత దళారులను పూర్తిగా కట్టడి చేశారు. క్యూలైన్ల వ్యవస్థను, సిసి మెకెరాల నిఘాను పటిష్టం చేసి, అక్రమ మార్గాల్లో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించానికి వీల్లేకుండా కట్టుదిట్టం చేశారు. ఎవరైనా ఉద్యోగులు…దళారులను అడ్డదారుల్లో లోనికి పంపిస్తే సస్పెండ్‌ అయ్యేవాళ్లు. దీంతో దాదాపుగా దళారులే లేకుండాపోయారు.

అక్రమార్కులకు కంటగింపుగా మారిన భ్రమరాంబ ఎప్పుడెప్పుడు ఆలయం నుంచి వెళ్లిపోతారా…అని ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఎట్టకేలకు వారు కోరుకున్న కొండపై వర్షం కురిసింది. భ్రమరాంబ నాలుగు రోజుల క్రితం బదిలీ అయ్యారు. అప్పటి నుంచి దళారులు రెచ్చిపోతున్నారు. రోజూ దాదాపు 150 మందిని అక్రమ మార్గాల్లో తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తున్నట్లు సమాచారం. దళారులను అరికట్టడానికే భ్రమరాంబ రూ.200 ప్రత్యేక దర్శనం ప్రవేశపెట్టారు. త్వరగా వెళ్లాలనుకునేవారు ఈ టికెట్టు కొనుగోలు చేయవచ్చు. దళారులు భక్తుల వద్ద టికెట్టు డబ్బులు వసూలు చేసుకుని, టికెట్టు కొనుగోలు చేయకుండానే లోనికి తీసుకెళుతున్నారు. పట్టణంలోని కొన్ని లాడ్జీలతో అనుసంధానంగా ఉన్న దళారులు…భక్తులను అక్కడే మాట్లాడుకుని దర్శనాలు చేయిస్తున్నారు. పది మంది భక్తులు నేరుగా టికెట్టు కొనుగోలు చేసి దర్శనానికి వెళితే రూ.2000 అవుతుంది. అయితే..లోపల అది చూపిస్తాం…ఇది చూపిస్తాం అంటూ రూ.4,000 నుంచి రూ.5,000 దాకా వసూలు చేనుసుకుంటున్నట్లు సమాచారం.

భ్రమరాంబ వెళ్లిపోయిన తరువాత దళారులు పేట్రేగిపోతున్నారని సవివరమైన ఇంటలిజెన్స్‌ నివేదికలు ప్రభుత్వానికి వెళ్లినట్లు సమాచారం. ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలను చూసి కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భ్రమరాంబను ఇందుకే పంపేశారా…అని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన ఈవో ఇంకా ఆలయ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేదు. తక్షణం ఆయన క్యూలైన్లపై దృష్టిసారించి….దళారులకు కళ్లెం వేయాలి. భ్రమరాంబ వెళ్లిపోయినా…ఆలయ పద్ధతులు మారలేదని భక్తులకు చాటాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*