శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు ‘చెవిలో పువ్వు’..!

శ్రీకాళహస్తి ఆలయం రాహు-కేతు పూజలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ రోజూ 1500 దాకా రాహు-కేతు పూజలు జరుగుతుంటాయి. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. ఆలయానికి ఈ పూజల ద్వారానే ఏడాదికి రూ.50 కోట్లు దాకా సమకూరుతోంది. ఇదిలావుంటే…ఈ పూజలు చేయించుకోడానికి వచ్చే భక్తులను కొందరు దళారులు నిలువునా మోసం చేస్తున్నారు.

శ్రీలయంలోకి ప్రవేశించే భిక్షాల గాలిగోపురం వద్ద పది మంది దళారులు తిష్టవేశారు. వీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల దాకా గోపురం ఎంట్రెన్స్‌లోనే చిన్న స్టూళ్లు వేసుకుని, కొన్ని పూలు పెట్టుకునివుంటారు. రాహు-కేతు పూజలు చేయించుకోడానికి హడావుడిగా లోనికి వస్తున్న భక్తులను అడ్డగిస్తారు. ఆ పూజ చేయడానికి ముందుగా…పక్కనే ఉన్న కాశీ విశ్వనాధ ఆలయంలోని హుండీలో పూలు చేయాలని, అలా వేస్తేనే రాహు-కేతు పూజ ఫలితాన్ని ఇస్తుందని నమ్మిస్తారు. ఈ మాటలు చెబుతూనే చేతిలో నాలుగు పూలు పెడతారు. డబ్బులు కూడా అడగరు. ఇదేదో దేవస్థానం ఉచితంగా ఇస్తున్నదేమో అనుకుని భక్తులు పూలు అందుకుని, గుడిలోకి వెళ్లి హుండీలో వేసి దండం పెట్టుకుని బయటకు వస్తారు. అప్పుడు పట్టుకుంటారు…’రూ.200 ఇవండి’ అని డిమాండ్‌ చేస్తారు. దీంతో విస్తుపోయిన భక్తులు….’డబ్బులివ్వాలా.. నాలుగు పూలకు రూ.200లా…’ అంటూ నోరువెల్లబెడతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు చేసేదిలేక, గొడవ ఎందుకులే అనుకుని రూ.200 సమర్పించుకుని వెళ్లిపోతారు. ఎవరైనా గొడవపడితే….’పూలకు కూడా డబ్బులివ్వలేనివాళ్లు పూజలకు మీలాంటి వాళ్లు ఎందుకొస్తారు…ఎంతోఒకింత అవ్వండి…ఏంచేద్దాం’ అంటూ దురుసుగా మాట్లాడుతారు. అలాంటి వాళ్ల వద్ద కూడా రూ.100కు తగ్గకుండా లాగేస్తారు. భక్తులు డబ్బులు ఇవ్వబోమని ఎదురుతిరిగితే…దళారులంతా ఒకటై దాడికి పూపునుకుంటారు. మాపూలు మాకు తెచ్చివ్వండి…అంటూ వితండ వాద‌న‌కు దిగుతారు. ఈ విధంగా ఆ దళారులు రోజూ భక్తుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నారు.

కాశీ విశ్వనాథ స్వామి ఆలయం శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నప్పటికీ…దానితో ఈ ఆలయానికి సంబంధం లేదు. అందుకే ఆలయ అధికారులు ఏమీ చేయలేదుకున్నారు. ఒక్కోసారి పోలీసులు దళారులను పట్టుకెళుతుంటారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి చెందిన రాజకీయ నాయకుడు ఒకరు వారిని విడిపిస్తుంటారు. మళ్లీ తెల్లారేసరికి స్టూళ్లు, వాటిపైన పూలు ప్రత్యక్షమవుతాయి. మోసం యథావిధిగా సాగిపోతుంటుంది. కాశీవిశ్వనాథ ఆలయంపై శ్రీకాళహస్తి ఆలయ అధికారులకు అధికారంలేకపోవచ్చుగానీ… ఆలయ అవరణలోనే శివయ్య భక్తులను మోసం చేస్తున్న దళారులను అరికట్టడానికి అధికారులకు అధికారం ఉంది. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి భక్తుల చెవిలో పూలు పెడుతున్న దళారుల ఆటకట్టించాల్సిన అవసరంవుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*