శ్రీకాళహస్తి ఆలయంలో హైడ్రామా! పాత ఈవో లేకుండానే కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ

శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. పాత ఈవో భ్రమరాంబ బయట క్యాంపులో ఉండగానే, కొత్త ఈవో రామస్వామి వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇది వివాదంగామారే సూచనలు కనిపిస్తున్నాయి. 2015 అక్టోబర్‌ నుంచి ఇక్కడ పని చేస్తున్న ఈవో భ్రమరాంబ చాలా మంది అక్రమార్కులకు కంటగింపుగా మారారు. ఆమెను బదిలీ చేయించడానికి రెండేన్నరేళ్లుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు వారం క్రితం ఆమెను బదిలీ చేస్తూ, ఆ స్థానంలో కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌-2గా ఉన్న రామస్వామిని నియమించారు. మాస్టర్‌ ప్లాన్‌ పనులు మధ్యలో ఉండగా భ్రమరాంబ బదిలీ జరిగింది. దీంతో ఇంకొంతకాలం ఇక్కడే పనిచేసి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్న ఆలోచనలో ఆమె ఉన్నారు. ఈ మేరకు ఎండోమెంట్‌ ఉన్నతాధికారులకు తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే…మళ్లీ భ్రమరాంబను కదిలించడం కష్టమనుకున్న కొందరు…ఆగమేఘాలపై కొత్త ఈవోనూ రప్పించినట్లు తెలుస్తోంది. శుక్రవారం భ్రమరాంబ బయట క్యాంపులో ఉండగా….రామస్వామి ఆలయానికి వచ్చారు. ఈవో ఛాంబర్‌కు తాళం వేసివుంది. అయినా…భ్రమరాంబ వచ్చేదాకా ఆగకుండా…ఏఈవో ఛాంబర్‌లో కూర్చుని బాధ్యతలు తీసుకుంటున్నట్లు సంతకాలు చేశారు. కొత్త ఈవో వచ్చి బాధ్యతలు చేపట్టిన సంగతి భ్రమరాంబకు తెలియదు. ఆమెను ధర్మచక్రం ప్రతినిధి ఫోన్‌ చేయగా…..’ఆయన ఎప్పుడు వస్తున్నదీ తెలుసుకోడానికి రాత్రి, ఉదయం కూడా పలుసార్లు ఫోన్‌ చేశాను. ఆయన తీయలేదు. ఇంతలో ఆఫీసుకు వచ్చి బాధ్యతలు చేపట్టినట్లు ఎవరో వీడియోను వాట్సాప్‌లో పెట్టారు’ అని వివరించారు.

భ్రమరాంబ అంటే గిట్టని కొందరు అధికారులు, అర్చకులు కలిసి కొత్త ఈవోను బలవంతంగా తీసుకెళ్లి ఏఈవో ఛాంబర్‌లో కూర్చోబెట్టారని చెబుతున్నారు. భ్రమరాంబకు దేవాదాయ శాఖ అధికారుల్లో మంచి పలుకుబడివుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఆమెపై సదాభిప్రాయం ఉంది. మొదట్లోనే ఆమెను బదిలీ చేయాలని కొందరు ఒత్తిడితెస్తే…. అన్నీ సర్దుకునేదాకా భ్రమరాంబ శ్రీకాళహస్తి ఆలయంలోనే ఉంటారు’ అని శ్రీకాళహస్తిలోనే మీడియా సమావేశంలో చెప్పారు ముఖ్యమంత్రి. అందుకే ఆమె ముఖ్యమంత్రి కలిసి…తాను ఇంకొంతకాలం కొనసాగాల్సిన అవసరాన్ని వివరించివుంటే…ఆమె అభ్యర్థనకు ఆమోదముద్ర పడేది. ఇలాంటిది ఏదో జరుగుతుందని అంచనావేసి….నాటకీయంగా కొత్త ఈవోను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈవో ఛాంబ‌ర్ వ‌ద్ద భ్ర‌మ‌రాంబ నేమ్‌బోర్డును విరిచేసారు. ఇదేనా మ‌హిళా అధికారికి ఇచ్చే గౌర‌వం. బోర్డు విరిచేసిన వ్య‌క్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డానికి భ్ర‌మ‌రాంబ సిద్ధమైన‌ట్లు స‌మాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*