శ్రీకాళహస్తి ఆలయం : రూ.14 కోట్లతో అభివృద్ధి పనులు – రూ.6 కోట్లతో కొత్త ప్రతిపాదనలు

వి.రవి – ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

దక్షిణ కాశి, వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయం ఇటీవల కాలంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ముక్కంటి ఆలయం పరిధిలో సుమారు రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా, మరో 5 కోట్ల రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫలితంగా భక్తులకు ఎప్పటి నుంచో ఉంటున్న వసతిగృహాలు సమస్య దాదాపు పరిష్కారమవడమేగాక, ఉచిత వసతి సమస్య కూడా పరిష్కారానికి నోచుకోనుంది.

రూ.14కోట్లతో అభివృద్ధి పనులు
ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తులకు ఎప్పటి నుంచో వసతి గృహాల సమస్య ఉంది. ఆలయం తరపున తగినన్ని వసతి గృహాలు లేకపోవడంతో భక్తులు అధికంగా ప్రయివేటు లాడ్జీలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈవిషయంపై దృష్టి పెట్టిన అధికారులు భరద్వాజ సదన్ సమీపంలో ప్రస్తుతం ఉన్న గంగా సదన్ కు ఆనుకుని 5 కోట్ల 60 లక్షల రూపాయలతో 132 గదులను నిర్మిస్తున్నారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పనులు మరో మూడు నెలల్లో పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇవి పూర్తయితే భక్తులకు వసతి సమస్య దాదాపు తొలగినట్లే.

అలాగే ముక్కంటి ఆలయ ప్రతిష్ట మరింతగా పెంచేలా భక్తకన్నప్ప గుడి వద్ద 2 కోట్ల 85 లక్షలతో 52 అడుగుల శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలలుగా జరుగుతున్న ఈపనులు మరో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారుల సమాచారం.

అదేవిధంగా భక్తకన్నప్ప కొండకు దారిసౌకర్యం , శివపార్వతుల విగ్రహాలు వద్ద పార్కింగ్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కోసం 4 కోట్ల 60 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. లోబావి వద్ద విద్యుత్ సౌకర్యం మెరుగు పరచాలనే ఉధ్దేశ్యంతో 4 లక్షల 20 వేల రూపాయలతో ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న త్రినేత్ర అతిథిగృహం లో గతంలో ఉన్న గదులు తొలగించి 6 లక్షల 93 వేల రూపాయలతో మరుగుదొడ్లు, మరో 7 లక్షల 27 వేల రూపాయలతో డార్మిటరీ, కింది భాగంలో 3 గదులు ఏర్పాటు నిర్మిస్తున్నారు. ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాత్రిపూట ఆరుబయట పడుకునే భక్తులకు ఈ డార్మిటరీ లు ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం.

అలాగే లోబావి వద్ద ఉన్న గోశాల వద్ద 42 లక్షల రూపాయలతో రెండు సేంద్రియ ఎరువుల తయారీ మిషన్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నెహ్రూ రోడ్ లో ఉన్న రామమందిరం పెండింగ్ పనులను 4 లక్షల తో చేపడుతున్నారు. లక్షా 40 వేలతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూ.6 కోట్లతో కొత్త ప్రతిపాదనలు
ఆలయానికి అనుబంధం గా ఉన్న లోబావి వద్ద రూ.3 కోట్లతో వృద్దాశ్రమం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అలాగే గంగాసదన్, నూతనంగా నిర్మిస్తున్న కైలాస సదన్ అతిథిగృహాల చుట్టూ 85 లక్షలతో కాంపౌండ్ నిర్మించేందుకు, దేవాంగుల వాహన మండపం వద్ద 1కోటి 20లక్షల తోమండపం, కొత్త వంతెన నుంచి పాత వంతెన వరకు రూ9 లక్షల10 వేలతో కంచె ఏర్పాటుకు, నాట్యగణపతి ఆలయం వద్ద 3లక్షలతో చెరువు కట్ట ఎత్తు పెంచేందుకు, వేయిలింగాలస్వామి ఆలయం సమీపంలో 9లక్షల తో రోడ్డు ఏర్పాటుకు, నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహంలో 35 లక్షలతో 60 ఏసీ లు ఏర్పాటు చేసేందుకు, ఆలయంలో 17లక్షల 50 వేలతో పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు కు , 8 లక్షలతో కార్యాలయంలో ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*