శ్రీకాళహస్తి ఆలయానికి రూ.6 కోట్లపైనే నష్టం…! దర్శనాలకు ఏర్పాట్లు..!

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వలన దేశవ్యాప్తంగా విధించింది లాక్ డౌన్ నేపధ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయం కూడా తీవ్రంగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. లాక్ డౌన్ వలన ముక్కంటి ఆలయం రోజుకు పన్నెండు లక్షల రూపాయలు పైగానే నష్టపోవాల్సి వచ్చింది. లాక్ డౌన్ విధించిన నాటి నుండి నేటి వరకు శ్రీకాళహస్తీశ్వరాలయం సుమారు ఆరుకోట్ల రూపాయలు పైగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

కరోనా కష్టంతో ముక్కంటికి నష్టం ..
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రతిరోజూ విచ్చేస్తుంటారు. మంగళ, బుధ ,గురు ,శుక్రవారం వంటి సాధారణ రోజుల్లో రోజుకు 20 నుంచి30 వేల మంది శని ,ఆది ,సోమవారం వంటి రద్దీ రోజుల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తుంటారు. అయితే కరోనా వలన మార్చి 24వ తేదీ నుంచి నేటి వరకు అంటే 49 రోజులు దేశమంతా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో నే ముక్కంటి ఆలయానికి భారీగానే నష్టం వాటిల్లింది. ముక్కంటి ఆలయానికి ప్రధాన ఆదాయమార్గం రాహుకేతు సర్పదోషపూజలు నుంచే వస్తోంది. సాధారణ రోజుల్లో నే రాహుకేతు పూజల ద్వారా ఆలయానికి నెలకు 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. రద్దీ రోజుల్లో సర్పదోషపూజలు ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా సర్పదోషపూజలు ద్వారానే 49.రోజులకు గాను సుమారు కోటి రూపాయల వరకు ముక్కంటి ఆలయానికి నష్టం వాటిల్లిందని సమాచారం. ఇక ఇతర సేవల ద్వారా నెలకు పది లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. ఇతర సేవలు ద్వారానే ఆలయం సుమారు 20 లక్షల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 200 రూపాయల దర్శన టికెట్లు ద్వారా నెలకు పదిలక్షల వరకు వచ్చేది. రద్దీ రోజుల్లో టికెట్లు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఈ లెక్కన ఈ టికెట్లు ద్వారానే సుమారు 20 లక్షల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచనా. దేవస్థానం ఆధ్వర్యంలో వివిధ అతిథిగృహాలు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 31 లక్షల వరకు ఆదాయం వచ్చేది. లాక్ డౌన్ నేపథ్యంలో వీటి ద్వారా సుమారు 50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. ఇక ప్రసాదాలు ద్వారా నెలకు 90 లక్షల వరకు ఆదాయం వచ్చేది. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రసాదాలు ద్వారానే సుమారు కోటిన్నర వరకు నష్టం వాటిల్లిందని అంచనా. ఇవి కాకుండా దేవస్థానంలో హుండీలను నెలకు రెండు పర్యాయాలు లెక్కించేవారు. ఒక్కో పర్యాయం 70 నుంచి 80 లక్షల వరకు ఆదాయం వచ్చేది. లాక్ డౌన్ 49 రోజులకు గాను మూడు హుండీ లెక్కింపు లు అనుకున్నా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు వరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఇప్పటి వరకు దాదాపు ఆరుకోట్ల రూపాయలు వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

దర్శన ఏర్పాట్లుకు చర్యలు
లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే శ్రీకాళహస్తీశ్వరాలయం లో భక్తులకు దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు ఆలయ అధికారులు. ఈ నేపథ్యంలో నే భక్తులు సామాజిక దూరం పాటించేలా దూరం దూరంగా వృత్తాలు ఏర్పాటు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి దర్శనం ప్రారంభించినా ఒకరు తరువాత ఒకరు దర్శనం చేసుకునే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*