శ్రీకాళహస్తి టిడిపిలో అసంతృప్తి సెగలు…ముఖ్యనేతల పక్కచూపులు – ప్రశ్నార్థకంగా సామాన్య కార్యకర్తల భవిత!

– వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అధికారం కోల్పోవడంతో కొంతమంది ముఖ్యనేతలు పక్కచూపులు చూస్తున్నారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి వల్ల పదవులు అలంకరించిన కొందరు నేతలు కూడా నేడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసిపి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీలోని సామాన్య కార్యకర్తల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడుతున్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం…తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి 1989 నుంచి ఐదు పర్యాయాలు శాసన సభ్యునిగా గెలిచారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభంజనంలో ఎస్సీవీ నాయుడు గెలుపొందగా…ఇటీవల జరిగిన ఎన్నికల్లో బియ్యపు మధుసూదన్‌ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టిడిపి టికెట్టు బొజ్జల సుధీర్‌ రెడ్డికి ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాపితంగా వైసిపికి అనుకూలంగా గాలి వీయడంతో శ్రీకాళహస్తిలో కూడా అదే ఫలితం వచ్చింది. వైసిపి ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ కూడా వచ్చింది.

అందుబాటులో లేని బొజ్జల కుటుంబం : ఇదిలావుండగా ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కష్టకాలంలో సామాన్య కార్యకర్తల్లో అత్మస్థైర్యం నింపాల్సిన ముఖ్య నేతలు కనీసం అందుబాటులో ఉండటం లేదు. వారు ఎక్కడో దూరంగా ఉంటూ తమకు అనుకూలమైన కొందరితో మాత్రమే మాట్లాడుతున్నారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బొజ్జల కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే తమకు ధైర్యంగా ఉంటుందని అంటున్నారు. టిటిడి తరపున పోటీ చేసిన సుధీర్‌ రెడ్డి స్థానికంగా ఉంటే తమ కష్టాలు చెప్పుకునే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ అండలేకపోవడంతో తమపై వేధింపులు ఎక్కవయ్యాయని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగేవుంటే ఏదో ఒక మార్గం చూసుకోక తప్పదని బహిరంగంగానే చెబుతున్నారు.

టిడిపి నేతల పక్క చూపులు : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చుక్కాని లేని నావలా తయారవడంతో నేతలు పక్కచూపులు చూస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కీలక పదవి అనుభవించిన ఓ నేత ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అనుచరగణం కూడా పార్టీ కార్యక్రమాలు హాజరుకావడం లేదు. టిడిపిని వీడి వేరే పార్టీలోకి మారడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది.

ఇక బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అన్నీ తామై వ్యవహరించిన కొందరు నాయకులు ప్రస్తుతం టిడిపి కార్యక్రమాలకూ దూరంగా ఉంటుండటం విస్మయం కలిగిస్తోంది. ముందుచూపుతోనే వీరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. ఈ నేతలు కూడా పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తి …అనైక్యతను తమకు అనుకూలంగా మార్చుకోడానికి వైసిపి, బిజెపి ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీల వారు ఇప్పటికే టిడిపి అసమ్మతి నేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిలో ముఖ్యనేతలకు పదవులు కూడా ఆశచూపుతున్నారు. దీంతో టిడిపి నేతలు పార్టీ మారడానికి సిద్ధమయ్యారు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా…: రెండు రోజుల క్రితం అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాపితంగా ఆందోళనలు చేపట్టింది. పలు నియోజకవర్గాల్లో ప్రముఖ నేతలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. ఆయన ప్రధాన అనుచరులు అనే చెప్పుకునేవారు కూడా పాల్గొనకపోవడం కూడా విశేషం. ఇక ప్రతినెలా నిర్వహించే సాధారణ సమావేశానికి, సమన్వయ కమిటీ సమావేశానికి కూడా కొందరు నేతలు హాజరుకావడం లేదు. వీరి తీరును చూసి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన పలువురు నేతలు ప్రస్తుతం పత్తాలేకుండా పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కార్యకర్తలకు కష్టాలు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న సామాన్య కార్యకర్తలు ప్రస్తుతం ఇబ్బందిపడుతున్నారు. వైసిపి అధికారంలోకి రావడంతో వీరికి ఎక్కడా పనులు జరగడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీ నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. అధికారులు కూడా వీరికి సహకరించడం లేదు. టిడిపికి సహకరిస్తే ఇబ్బంది పడాల్సివస్తుందని ఉద్యోగులూ భయపడుతున్నారు. సంఘమిత్ర, చౌకదుకాణాల డీలర్లను తొలగిస్తున్నారు. నియోజకవర్గంలో పెద్దదిక్కు అందుబాటులో లేకపోవడంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీరు ఆందోళన చెందుతున్నారు.

అందుబాలులో లేకుంటే కష్టమే : బొజ్జలు సుధీర్‌ రెడ్డి అందుబాటులో లేకుంటే టిడిపి కార్యకర్తలకు కష్టమేనని వారు అంటున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. ఇటువంటి కీలక తరుణంలోనూ ముఖ్యనేతలు అందుబాటులో లేకపోవడంపై కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బొజ్జల కుటుంబం ఎలా స్పందిస్తుంది, అసలు వారి ఆంతర్యం ఏమిటి అనేది తెలియాల్సివుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*