శ్రీనివాసునికి ‘సర్వ’0 నష్టమే!

భక్తులు క్యూలైన్లలో గంటల కొద్దీ వేచివుండాల్సిన అవసరం లేకుండా, తమకు కేటాయించిన సమయానికి క్యూలోకి ప్రవేశించి, గంట-రెండు గంటల్లో దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేలావుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో సర్వ,దర్శనం (ఉచిత దర్శనం) భక్తులకూ టైంస్లాట్‌ పద్ధతి ప్రవేశపెట్టారు. రూ.300 ప్రత్యేక దర్శనం, కాలినడక భక్తులకు ఇప్పటికే ఈ విధానం అమలువుతోంది. సర్వదర్శనం భక్తులకూ దీన్ని అమలు చేయడంతో అందరూ సంతోషించారు. అయితే ఇందులో ఎదురయ్యే సమస్యలను ముందుగా అంచనా వేయలేకపోయారు. అదేవిధంగా ఎన్ని కౌంటర్లు అవసరమవుతాయనేది కూడా సరైన అంచనా వేయలేదు. టిటిడి కోట్లాది రూపాయలు నష్టపోయింది.

ఇదీ జరిగింది…జరుగుతోంది….
సమయ నిర్దేశిత సర్వదర్శనం అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేదు. అందరూ టోకెన్లు తీసుకున్న, తీసుకున్నవారు సాధారణ క్యూలైన్లలో వెళ్లిపోవడం, దీంతో కేటాయించే సమయం అంతకంతకూ పెరిగిపోవడంతో కొన్ని రోజులు ఈ టోకెన్లను పూర్తిగా రద్దు చేశారు. ఆ తరువాత శని, ఆదివారాల్లో 30 వేలు, కొన్ని రోజులు 20 వేలు, మరి కొన్ని రోజుల్లో 17 వేల టోకెన్లు మాత్రమే ఇచ్చేలా మార్పులు చేశారు. తిరుమలలో సిఆర్‌ఓ, కౌస్తుభం మినహా మిగిలిన చోట్ల ఉన్న కౌంటర్లను మూసేశారు. ఈ టోకెన్ల కేటాయింపులో ఇంకో సమస్య కూడా ముందుకొచ్చింది. రాత్రి 12 గంటలకు కౌంటర్లు తెరవగానే రెండు మూడు గంటల్లోనే ఆ రోజు కోటాలోని టోకెన్లు అయిపోతున్నాయి.

ఏర్పాటుకే రూ.7 కోట్లు?
సర్వదర్శనం టైంస్లాట్‌ టోనెన్లు ఇచ్చేందుకు మొత్తం 109 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో తిరుమలలో ఆర్‌టిసి బస్టాండు-8, కౌస్తుభం-8, సిఆర్‌వో-10, ఎంబిసి-3, నందకం-4 మొత్తం ఐదుచోట్ల 33 కౌంటర్లు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా తిరుపతిలో విష్ణునివాసం-22, శ్రీనివాసం-5, భూదేవి కాంప్లెక్స్‌-10, సత్రాలు-8, ఆర్‌టిసి బస్టాండు-10, అలిపిరి-2, గాలిగోపురం-10, శ్రీవారిమెట్టు మార్గం మొదట్లో-1, 1200వ మెట్టువద్ద -6 కౌంటర్లున్నాయి. మొత్తం తొమ్మిది చోట్ల 57 కౌంటర్లు పెట్టారు. ఈ కౌంటర్ల ఏర్పాటుకు అవసరమైన సివిల్‌ నిర్మాణాలు, కౌంటర్ల ఏర్పాటు, క్యూలైన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ లైన్లు వంటివాటి కోసం ఏడు కోట్లు దాకా ఖర్చు పెట్టారు. ఇదికాకుండా 109 కౌంటర్ల నిర్వహణ బాధ్యతను ఏసి ఆన్‌లైన్‌ అనే సంస్థకు అప్పగించారు. కౌంటర్ల నిర్వహణకుగాను ఈ సంస్థకు నెలకు కోటి రూపాయల దాకా చెల్లించాల్సిన పరిస్థితి.

అవసరానికి మించిన కౌంటర్లు
ప్రస్తుతం రోజుకు 85 వేలకు మించి దర్శనం చేయించే పరిస్థితి లేదు. ఇందులో దివ్యదర్శనం కోటా కింద 20 వేల మంది, రూ.300 ప్రత్యేక దర్శనం కింద 20 వేల మంది, ఇక ఆర్జిత సేవల కింద 10 వేల మంది దాకా దర్శనానికి వెళతారు. అంటే 50 వేల మంది సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చే అవకాశం లేదు. ఇక ఈ కౌంటర్లు అవన్నీ పట్టించుకోకుండా క్యూకాంప్లెక్స్‌లో వెళ్లేవాళ్లు 10 వేల దాకా ఉంటారు. ఇక మిగిలింది 20 వేలు – 25 వేల మంది మాత్రమే. వీరు మాత్రమే సమయ నిర్దేశిత సర్వదర్శనానికి వెళతారు. గరిష్టంగా 25 వేల మంది అనుకున్నా….ఈ 25 వేల మంది కోసం 109 కౌంటర్లు అవసరమా అనేది ప్రశ్న. ఈ లెక్కన సగటున ఒక్కో కౌంటర్‌లో రోజుకు 229 టోకెన్లు వస్తాయి. అంటే గంటలకు 10 టోకెన్లు ఇచ్చినా సరిపోతాయన్నమాట. రోజుకు 20 వేల టోకెన్ల జారీ అవుతున్న దివ్యదర్శనంలో ఎన్ని కౌంటర్లు ఉన్నాయో పరిశీలిస్తే….సర్వదర్శనం టైం స్లాట్‌కు ఇన్ని కౌంటర్లు ఎందుకు? అనిపిస్తుంది. టిటిడి అధికారులు మాత్రం ఈ పోలికే చూసుకున్నట్లు లేరు. సర్వదర్శనం కౌంటర్లు దశల వారీగా పెంచుకుని ఉండొచ్చు. ఏరోజుకు ఆరోజు కేటాయిస్తున్న టోకెన్లు గంట – రెండు గంటల్లో అయిపోతున్నాయి. ఇక అప్పటి నుంచి ఆ కౌంటర్ల సిబ్బందికి పని లేదు. ఇంతమాత్రానికి ప్రైవేట్‌ సంస్థకు కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాలనేది ప్రశ్న.

భక్తులకు అవస్థలు
సర్వదర్శనానికి 40 గంటలు – 50 గంటలు కేటాయించడం వల్ల భక్తులు అంత సమయం తిరుమలలోనే ఉండాల్సిన పరిస్థితి. దీంతో గదులు తీసుకున్నవారు రెండు మూడు రోజులు ఖాళీ చేయడం లేదు. ఇది మరో ఇబ్బందికి దారితీసింది. అదేవిధంగా మూడు రోజుల పాటు తిరుమలలో ఉండటమంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దేవుని దగ్గరకు వెళ్లేలోపే జేబులోని డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి. స్వామికి వేయాలనుకున్న డబ్బుల్లోనూ కోతపడుతోంది. ఆ విధంగా కూడా స్వామికి నష్టమే జరుగుతోంది. ఇక కొందరు తిరిగి తిరుపతికి వెళ్లిపోతున్నారు. అక్కడ సందర్శనీయ ప్రదేశాలను చూసి మళ్లీ తిరుమలకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వదర్శనం టైంస్లాట్‌ విధానాన్ని పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఆచరణ యోగ్యమైన మార్పులు చేయాలి.

‘సుదర్శనం’ మాదిరి పెట్టడమే బెటర్‌..!
గతంలో టిటిడి సుదర్శనం పేరుతో రూ.50 టికెట్‌పై దర్శనానికి టైంస్లాట్‌ విధానాన్ని అమలు చేసింది. తిరుపతిలో మాత్రమే కాకుండా టిటిడి సమాచార కేంద్రాల్లో ఈ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇది భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. తిరుమలకు బయలుదేరే ముందే కంకణం కట్టుకునేవాళ్లు. దర్శనం ఏ రోజు ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే తెలిసిపోయేది. ఆ మేరకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని వచ్చేవాళ్లు. ఇప్పుడు రూ.300 టికెట్లు కలిగిన భక్తులు ఏవిధంగానైతే వస్తున్నారో…ఆదేవిధంగా సర్వదర్శనం భక్తులూ సమయానికి క్యూలోకి వెళ్లి దర్శనం చేసుకుని, ఒకటి రెండు గంటల్లోనే బయటపడేవారు. తిరుమలకు వచ్చి నిరీక్షించాల్సిన అవసరం ఉండేది కాదు.

ఇప్పుడు సర్వదర్శనానికి ప్రవేశపెట్టిన టైంస్లాట్‌లోనే కొన్ని మార్పులు చేయాలి. కౌంటర్లన్నీ తిరుపతిలో ఉండటం వల్ల…ఇక్కడికొచ్చి టోకెన్‌ తీసుకున్నాక, ఎన్ని గంటలైనా ఇక్కడే వేచి వుండాల్సివస్తోంది. అదే ఆయా ప్రాంతాల్లో కౌంటర్లు ఉంటే….తమకు దర్శనం సమయం లభించినదాన్నిబట్టి భక్తులు తమ స్వస్థలం నుంచి బయలుదేరి వస్తారు. అప్పుడు నిరీక్షణ సమయంలో 50 గంటలున్నా, 60 గంటలున్నా ఇబ్బంది ఉండదు. తిరుమలకు బయలుదేరడానికి ఒక రోజు ముందే టిటిడి సమాచార కేంద్రానికి వెళ్లి టోకెన్‌ తీసుకుంటారు. అప్పుడు ఈ ఇబ్బందులన్నీ తప్పిపోతాయి. అవసరమైతే…సుదర్శనం టికెట్లనూ ఇంటర్‌నెట్‌ ద్వారా ఇవ్వడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి. రోజుకు 20 వేల టోకెన్లు ఈ పద్ధతిలో ఇచ్చినా…భక్తులు ఆ మేరకు ముందస్తుగా ఆన్‌లైన్‌లో టోకెన్లు తీసుకుని తిరుమలకు వస్తారు. తక్షణం ఇలాంటి మార్పులకు టిటిడి శ్రీకారం చుట్టాలి.

2 Comments

  1. Om namo venkateshaya

    It should be audited periodically and altered the functioning. Allotment of huge funds on this also needs to be audited in order to eradicate the fraud awarding of tenders.

Leave a Reply

Your email address will not be published.


*