శ్రీవారికి కంటినిండా నిద్ర కరువు..!

  • శ్రీ‌నివాసునికి విశ్రాంతి లేదు
  • ఏకాంతసేవ ముగిసిన అర్ధగంటలోనే సుప్రభాతం
  • రద్దీ పేరుతో పాత సంప్రదాయానికి తెరతీశారు

తిరుమల శ్రీవారి ఆలయం….శనివారం (05.10.2019) అర్ధరాత్రి దాటింది. సమయం 2 గంటలు దాటుతోంది. అప్పటికీ భక్తులు దర్శనం కోసం లోనికి వెళుతూనే ఉన్నారు. సరిగ్గా 2.10 గంటలకు క్యూలైను ఆపారు. లోనికి వెళ్లినవారంతా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 2.30 అయింది. ఇంతలోనే….సుప్రభాత సేవ నిర్వహించే అర్చకులు ఆలయ ప్రవేశం చేశారు. సుప్రభాత సేవ జరిగిపోయింది. ఇంతకీ శనివారం రాత్రి ఏకాంతసేవ ఎన్ని గంటలకు నిర్వహించారు…స్వామివారిని ఎంతసేపు నిద్రపోనిచ్చారు..నిమిషాలైనా స్వామికి విశ్రాంతి ఇచ్చారా….ఏమో స్వామికే తెలియాలి..!

పెరటాసి నెల ముగింపు రోజులు కావడంతో భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. క్యూకాంప్లెక్స్‌లు నిండిపోయి….క్యూలైను వెలుపలికి వచ్చేస్తోంది. ఈ పరిస్థితుల్లో భక్తులకు త్వరగా దర్శనం చేయించాలన్న ఆతృతలో ఉన్న అధికారులు….శని, ఆదివారాల్లో సాధ్యమైనంత ఎక్కువ సమయం ఆలయం తెరిచివుంచారు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత సేకాంత సేవ నిర్వహించి, కొన్ని నిమిషాల వ్యవధిలోనే సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపినట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు. నో సీల్‌ డే పేరుతో….సంప్రదాయం కోసం ఆలయ తలుపులు మూసి, సీలు వేయకుండా కొన్ని నిమిషాల వ్యవధిలోనే మళ్లీ తెరిచారని అంటున్నారు.

కొన్నేళ్ల క్రితం….శ్రీవారి ఆలయంలో ఇదే ధోరణి ఉండేది. భక్తుల రద్దీ పెరిగినపుడల్లా ఏకాంత సేవను సాధ్యమైనంత ఆలస్యంగా నిర్వహించేవారు. ఆలయాన్ని అటు మూసి, ఇటు తెరిచిన సందర్భాలున్నాయి. దీనిపై భక్తుల నుంచి, పీఠాధిపతుల నుంచి విమర్శలు వచ్చాయి. రద్దీ పేరుతో ఇష్టానుసారం వ్యవహరించకూడదని, దేవుడికైనా తగిన విశ్రాంతి ఇవ్వాలని, ఆలయ సంప్రదాయాలను పాటించాలని అందరూ సూచించారు. దీంతో రాత్రి 12.30 – 1.00 గంట మధ్య ఏకాంత సేవ; 2.20 – 2.30 గంటల మధ్య సుప్రభాత సేవ నిర్వహించడం ఒక నిర్ణయంగా చేసుకుని అమలు చేస్తున్నారు.

అటువంటిది మళ్లీ సంప్రదాయానికి తెరతీయడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 12, 13 తేదీల్లో లక్ష మందికిపైగా దర్శనం చేసుకున్నట్లు టిటిడి అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా రోజలో 75,000 నుంచి 85,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఈ రెండు రోజుల్లో ఆ సంఖ్య లక్ష దాటిందంటే దానికి కారణం…ఏకాంత సేవను ఆలస్యంగా నిర్వహించడం వల్లే సాధ్యమైనందని ఆలయ అర్చకులు చెప్పారు.

తిరుమల శ్రీవారికి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడం లేదని ఆ మధ్య రమణ దీక్షితులు తీవ్రమైన విమర్శలు చేశారు. రద్దీ పేరుతో, విఐపి దర్శనాల పేరుతో కొన్ని సేవలను హడావుడిగా ముగిస్తున్నారంటూ….అప్పుడు ప్రధాన అర్చకులుగా ఉన్న వ్యక్తే విమర్శలు చేయడం దుమారం రేపింది. అటువంటి విమర్శలకు ఊతమిచ్చేలా అధికారుల చర్యలు ఉన్నాయన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. భక్తులకు త్వరగా దర్శనం చేయించడం ఎంత ముఖ్యమో…ఆలయ సంప్రదాయాలను పాటించడమూ అంతే ముఖ్యమన్నది భక్తుల అభిప్రాయం.

తనకు ఆకలి వేస్తుందని, నిద్ర వస్తోందని దేవుడు చెప్పకపోవచ్చు. అంతమాత్రాన నైవేద్యం సమర్పించడం, నిద్రపుచ్చడం, మేల్కోలపడం వంటివి మానేస్తామా..! ప్రతిదానికీ ఒక సంప్రదాయం ఉందికదా…! ఆలోచించాల్సింది అధికారులు, అర్చకులే.

…..ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*