శ్రీవారికి కానుకగా వచ్చిన 35 టన్నుల నాణేలు కరిగిస్తారట!

కొందరు పేద భక్తులు శ్రీవారికి మొక్కులు తీర్చుకోడానికి ముడుపులు కడుతారు. పావలా అర్థరూపాయి హుండీలో పోగేసి, మొక్కు తీర్చుకునే సమయంలో ఆ కాసులన్నీ తీసుకొచ్చి హుండీలో కుమ్మరిస్తుంటారు. ధనవంతులైన భక్తులు నోట్ల కట్టలను ఎంత భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారో అంతే భక్తిభావంతో పేద భక్తులు నాణేలను సమర్పిస్తుంటారు. ఈ విధంగా సమకూరుతున్న కానుకలను శ్రీవారి కోసం సద్వినియోగం చేయడంలో టిటిడి విఫలమవుతోంది. నాణేలను సకాలంలో బ్యాంకుల్లో జమ చేయకుండా, కుప్పలు కుప్పలుగా భద్రపరచుకుని, ఎప్పుడో తీరికయినపుడు వాటి గురించి పట్టించుకుని, ఏదో విధంగా వదిలించుకుంటారు. దీనివల్ల భక్తులు ఏ ఉద్దేశంతోనైతే ఆ కానుకలు సమర్పించారో అది నెరవేరకుండాపోతోంది. ఇంతకీ విషయం ఏమంటే….

టిటిడి వద్ద సంవత్సరాల తరబడి పోగుపడివున్న 25 పైసలు, అంతకంటే తక్కువ విలువగల నాణేలను, కరిగించి లోహం రూపంలో విక్రయించాలని నిర్ణయిచింది. 2011, జూన్‌ 30 నుంచి 25 పైసలు, అంతకంటే తక్కువ విలువైన నాణేలను చెలామణి నుంచి తప్పిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అయినా…ఈ నాణేలను 2014 ఫిబ్రవరి దాకా బ్యాంకులు ఆమోదిస్తూ వచ్చాయి. అంటే బయట చెల్లకున్నా బ్యాంకులు మాత్రం తీసుకుంటాయన్నమాట. ఆ గడువు తరువాత బ్యాంకులూ తీసుకోవడం మానేశాయి.

2014 ఫిబ్రవరి గడువు ముగిసే సమయానికి టిటిడి తన వద్దనున్న చెలామణిలో లేని నాణేలను బ్యాంకుల్లో జమ చేయడంపై దృష్టి పెట్టలేదు. దీంతో టిటిడి వద్ద 35 టన్నుల నాణేలు పోగుపడ్డాయి. (ఇవి కాకుండా అర్థరూపాయి, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు టన్నుల కొద్దీ ఉన్నాయి. అది వేరే కథ). ఈ 35 టన్నుల నాణేలను ఏమి చేయాలనేదానిపై ఆర్‌బిఐ అధికారులకు టిటిడి లేఖ రాసింది. తాము ఏ నిర్ణయమూ చేయలేమని, కేంద్ర ఆర్థిక శాఖను సంప్రదించమని సూచించింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ మధ్యలోనే రిజర్వు బ్యాంకు స్పందించి…. బ్యాంకుల ద్వారా వెనక్కి తీసుకున్న చెల్లుబాటులో లేని నాణేలను మింటు ద్వారా తమిళనాడు సేలంలోని సెయిల్‌ (స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా)కు తరలించి, అక్కడ కరిగిస్తున్నామని, టిటిడి కూడా సెయిల్‌ను సంప్రదించాలని సూచించింది.

టిటిడి అధికారులు సెయిల్‌ను సంప్రదించారు. టిటిడి తన వద్దనున్న నాణేలను (చెల్లుబాటులో లేనివి) లోహాల (అల్యూమినిం, కప్రో నికిల్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కాపర్‌, బ్రాస్‌) వారీగా విడగొట్టి, తమకు అందజేస్తే వాటిని కరిగించలమని సెయిల్‌ తెలియజేసింది. కరిగించగా వచ్చే లోహం విలువకు నగదు రూపంలో చెల్లించబోమని, ఇప్పటికే సెయిల్‌కు టిటిడి ఏవైనా ఆర్డర్లు (ఏవైనా యంత్రాలు, పరికరాలకు) ఇచ్చివుంటే….ఆ బిల్లులో సర్దుబాటు చేస్తామని తేల్చిచెప్పింది. ఇక చేసేది లేక టిటిడి సెయిల్‌ ప్రతిపాదనకు అంగీకరిచింది. ఈ మేరకు ఇటీవల బోర్డు సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు.

ఇక్కడ టిటిడి సమాధానం చెప్పాల్సింది ఏమంటే….చెల్లుబాటులో లేని నాణేలను బ్యాంకులు 2014 ఫిబ్రవరి దాకా ఆమోదించినా, ఆ గడువులోపు ఎందుకు బ్యాంకుల్లో జమ చేయలేకపోయారు? ఇంకా టిటిడి వద్ద ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న నాణేలు కూడా టన్నుల కొద్దీ ఉన్నాయి. వాటినీ ఇదేవిధంగా బొక్కసాల్లో మగ్గబెడితే…భవిష్యత్తులో వాటినీ ఈ విధంగా కరిగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పటికే ఆర్థ రూపాయి బిల్లను బయట మార్కెట్‌లో ఎవరూ అంగీకరించడం లేదు. అటువంటి వాటిని ఆర్‌బిఐ కూడా చెల్లుబాటు నుంచి ఉపసంహరించవచ్చు. అదే జరిగితే….అర్థ రూపాయి బిల్లలనూ కరిగించి, లోహం రూపంలో అమ్ముకోవాలా? దీనివల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని అలావుంచితే…భక్తుల మనోభావాల మాటేమిటి? తాము సమర్పించినా నాణేలను కరిగించి అమ్ముతున్నారంటే భక్తులు బాధపడరా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*