శ్రీవారికి కానుకగా వచ్చే ఆభరణాల్లోని విలువైన రాళ్లు ఏమవుతున్నాయి…!

తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించుకునే భక్తులు….బంగారు, వెండి ఆభరణాలనూ హుండీలో కానుకలుగా సమర్పిస్తుంటారు. కొందరు భక్తులైతే నిలువు దోపిడీ పేరుతో…ఒంటిపైన ఉన్న నగలు, ఆభరణాలను ఉన్నవి ఉన్నట్లుగా తీసి హుండీలో వేస్తుంటారు.

ఆభరణాలంటే…సహజంగానే అందులో విలువైన రాళ్లు పొదిగివుంటాయి. అందులో వజ్రాలు ఉండొచ్చు, ముత్యాలు ఉండొచ్చు. రత్నాలు ఉండొచ్చు. మరగత మాణిక్యాలూ ఉండొచ్చు. శ్రీవారికి కానుకగా లభించే ఆభరణాల్లోని ఈ విలువైన వజ్ర వైఢూర్య మరగత మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు ఏమవుతున్నాయన్నది ప్రశ్న.

ఇన్ని కిలోల బంగారాన్ని ఫలానా బ్యాంకులో డిపాజిట్‌ చేశాం, ఇన్ని కోట్ల రూపాయలను ఫలానా బ్యాంకులో పెట్టాం అని చెప్పడం చూశాంగానీ…. ఆభరణాల్లోని విలువైన రాళ్లను టిటిడి ఏం చేస్తోందన్న వివరాలు మాత్రం ఇప్పటిదాకా ఒక సందర్భంలోనైనా ప్రకటించిన ఉదంతాలు లేవు.

ధర్మచక్రం సేకరించిన వివరాల ప్రకారం….శ్రీవారికి హుండీద్వారా లభించే ఆభరణ్లాను తిరుమల పరకామణిలోనే చిన్నచిన్న మూటలుగా కట్టి, అక్కడా వాటి బరువును లెక్కిస్తారు. ఆపై తిరుపతిలోని ట్రెజరీకి పంపుతారు.

తిరుపతిలో బంగారానికి విలువకట్టే అప్రైజర్లు….తిరుమల నుంచి వచ్చిన బంగారు ఆభరణాలను తనిఖీ చేసి ఖజానాలో జమ చేస్తారు. ఈ సందర్భంగా బంగారు నాణ్యతతో పాటు ఆభరణాల్లోని రాళ్ల వివరాలనూ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.  ఆపై పెద్దమొత్తంలో ఆభరణాలను ముంబైలోని మింట్‌కు తరలిస్తారు. అక్కడ కరిగించి, శుద్ధిచేసి, కడ్డీలుగా రూపొందిస్తారు. ఈ విధంగా ఆభరణాలను పంపేటప్పుడే వాటిలోని రాళ్లను ట్రెజరీలో బయటకు తీస్తారు. పెద్దగా విలువ లేని రాళ్లను, తీయడానికి సాధ్యంకాని అతి సూక్ష్మమైన రాళ్లను అలాగే వదిలేస్తారు. వాటిని మింట్‌లో వేరు చేస్తారు.

ట్రెజరీలో వేరుచేసిన రాళ్లను లూజ్‌ స్టోన్స్‌ పేరుతో మూటలుగా కట్టి నిల్వవుంచుతున్నట్లు సమాచారం. శ్రీవారి ఆభరణాలకు సంబంధించి ఏవైనా మరమ్మతులు వచ్చినపుడు….ట్రెజరీలో స్టోర్‌ చేసిన రాళ్లను వాడుతారని తెలుస్తోంది. అయినా…ఇలా వినియోగించినా ఎన్నిరాళ్లు వినియోగిస్తారు అనేది ప్రశ్న.

సంవత్సరాల తరబడి హుండీ ద్వారా వస్తున్న ఆభరణాల్లో వజ్రాలు, రత్నాలు వంటివి ఏమేరకు ఉన్నాయి? వాటిని ఏం చేస్తున్నారు? అసలు ఆభరణాల్లో ఉన్న రాళ్లు విలువ ఏమిటో లెక్కించే నిపుణులు ఉన్నారా? ఇటువంటివన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి. అదేవిధంగా మింట్‌లో వేరుపడే రాళ్లు వృథాగా కింద పోతున్నాయా? వాటిలో విలువైనవి ఉంటే వెనక్కి ఇస్తున్నారా? ఇటువంటి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

టిటిడి ఉన్నతాధికారులు ఈ అంశంపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఆభరణాల్లోని రాళ్లకు సంబంధించి టిటిడి ఆమలవుతున్న విధానం ఏమిటో భక్తులకు వెల్లడించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

– ఆదిమూలం శేఖర్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*