శ్రీవారికి జరిగే పుళుగుకాప్పు కైంకర్యం గురించి తెలుసా..?

ఆదిమూలం శేఖ‌ర్‌, సంపాద‌కులు, ధ‌ర్మ‌చ‌క్రం

తిరుమల శ్రీవేంకటేవ్వరునికి ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అభిషేకం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడనికి భక్తులు ఎంతగానో తపనపడుతుంటారు. పుళుగుకాప్పు కైంకర్యం గురించి వివరిస్తారనుకుంటే…అభిషేకం గురించి చెబుతున్నారేమిటి.. అనుకుంటున్నారు కదూ…!

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ‘పుళుగుకాప్పు’ కైంకర్యానికీ, అభిషేకానికీ సంబంధం ఉంది. ఇప్పుడు అభిషేకంలో ఉపయోగించే పునుగుపల్లి తైలాన్ని అప్పట్లో పుళుగుకాప్పు అని పిలిచేవారు. అభిషేకం కూడా పుళుగుకాప్పు కైంకర్యం పేరుతో కొంతకాలం చెలామణిలో ఉంది. దీనికి సంబంధించి ఇంకొంచెం లోతుగా వెళితే….

ఇప్పుడైతే శ్రీవారికి అభిషేకం వారానికొకరోజు నిర్వహిస్తున్నారుగానీ…ఒకప్పుడు అభిషేకం ప్రతినిత్యమూ జరిగేదట. కందాడై రామానుజయ్యంగార్‌ అనే దాత తిరుమల శ్రీవారికి, తిరుపతి గోవిందరజాస్వామికి ప్రతిరోజూ అభిషేకం చేయించేవారాట. (శా.శ., శాసనం నెం.4, టిటి). ఈ ఉత్సవానికి అవసరమైన చందనం, పసుప్పొడి లేపనం, కరక్కాయ లేపనం, కస్తూరి లేపనం, పచ్చకర్పూర లేపనం, అంగవస్త్రం, తలమపాలకులు, వొక్కలు సమర్పించేవారట. అభిషేకాన్ని స్నానోత్సవం అని కూడా పిలిచేవారు.

శ్రీవారికి అభిషేకానికి అవసరమైన వస్తువుల్లో పుళికాప్పు ఒకటిగా అప్పటి శాసనాల్లో పేర్కొన్నారు. స్వామివారి ముఖమండలాన్ని అలంకరించడం కోసం పుళికాప్పు, శ్రీగంధం, కర్పూరం మొదలైన వస్తువులు అవసరం. పుళికాప్పు అనే పదాన్ని కీ.శ. 1433 సంవత్సరం నాటి శాసనంలో మొదటిసారి కనిపించింది. అప్పట్లో పునుగు తైలాన్ని శ్రీవారి ముఖమండాలనికి మాత్రమే వినియోగిం చేవారని తెలుస్తోంది. ఇప్పుడు స్వామివారి శరీరం మొత్తానికి పునుగు తైలాన్ని అద్దుతున్నారు.

ఒకప్పుడు (కీ.శ.1433) అభిషేకం నిత్యసేవల్లో భాగంగా ఉండేది. ఆ తరువాత కాలక్రమేణా 15 రోజులకు ఒకసారి నిర్వహించే సేవగా మారినట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయి. కీ.శ.1504లో వేయబడిన ఓ శాసన ప్రకారం….ప్రతి 15 రోజులకు ఒకసారి శుక్రవారం నాడు పళికాప్పు కైంకర్యం పేరుతో అభిషేక సేవ జరిగినిట్లు వెల్లడవుతోంది.

ఆ తరువాత అభిషేక సేవ వారానికి ఒకసారి శుక్రవారం నాడు నిర్వహించేలా మార్పులు జరిగినట్లు కీ.శ.1533 నాటి శాసనం (నెం.331, తిరుమల టెండపుల్‌) ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం… సంవత్సరంలో 53 రోజులు అభిషేకం జరుగుతోంది.

ఇప్పటికీ….అభిషేకంలో పునుగుపల్లి తైలాన్ని వినియోగిస్తున్నారు. ఇందుకోసం టిటిడి ఎస్‌వి జూపార్కులో పునుగు పిల్లులను పెంచుతోంది. ఒకప్పుడు ఎస్‌వి డెయిరీ ఫాంలోనే పునుగు పిల్లులను పెంచేవారు. పునుగుపిల్లులు రశీరాన్ని గంధపు చెక్కకు రాజుకోవడం ద్వారా ఒక రకమైన తైలం ఉత్పత్తి అవుతుంది. దాన్ని సుగంధ పరిమిళంగా స్వామివారికి అద్దుతారు. ఇదీ పుళుగుకాప్పు కైంకర్యం కథకమామీషు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*