శ్రీవారికి వంద కోట్లు గండికొట్టే…విద్యుత్‌ ఒప్పందాన్ని సమీక్షిస్తారా…!

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందన్న కారణంగా….ఆ కాలంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. యూనిట్‌ రూ.2.40కి వస్తున్న తరుణంలో రూ.4.75కు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం….పలు ప్రైవేట్‌ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అది అటుంచితే…టిటిడిలోనూ ఒక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరిగింది. అసంబద్ధమైన ఈ ఒప్పందం వల్ల శ్రీవారి ఖజానాకు రూ.100 కోట్లు గండిపడే పరిస్థితి వచ్చింది. మరి ఈ ఒప్పందాన్నీ….సమీక్షిస్తారా? అలాగే వదిలేస్తారా…?

సొంత భూమి ఇచ్చి….

టిటిడి ఏటా విద్యుత్‌ ఛార్జీల కోసమే రూ.50 కోట్లకుపైగా చెల్లిస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలన్న సదుద్దేశంతో సౌర విద్యుత్‌ను వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఓ ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లి ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం టిటిడికి అనుబంధంగా ఉంది. ఈ ఆలయానికి చెందిన 65 ఎకరాల భూముల్లో సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మించాలని టిటిడి సంకల్పించింది. ఈ మేరకు కలకత్తాకు చెందిన విక్రమ్‌ సోలర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భూములను లీజు ప్రాతిపదికన విక్రమ్‌ సోలార్‌కు ఇస్తే…ఆ సంస్థ అందులో రూ.50 కోట్ల వ్యయంతో 10 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.49 వంతన 20 ఏళ్లపాటు టిటిడినే కొనుగోలు చేస్తుంది. ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయి….ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది.

రూ.100 కోట్లు నష్టం…

తంబళ్లపల్లి సౌర విద్యుత్‌ కేంద్రంలో ఏడాదికి 155 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ మొత్తం విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.49 వంతున టిటిడి కొనుగోలు చేస్తుంది. అంటే ఏడాదికి విక్రమ్‌ సోలార్‌ సంస్థకు దాదాపు రూ.7 కోట్లు చెల్లించాల్సివుంటుంది. ఈ విధంగా 20 ఏళ్లకు రూ.140 కోట్లదాకా ప్రైవేట్‌ సంస్థకు ఇవ్వాలి. ఈ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు రూ.50 కోట్లు ఖర్చవుతాయిని టిటిడినే చెబుతోంది. ఈ రూ.50 కోట్లు పెట్టుబడిని టిటిడినే పెట్టగలిగితే….ప్రైవేట్‌ సంస్థకు ఏటా రూ.7 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏడేళ్లలో ఈ మొత్తం పెట్టుబడి విద్యుత్‌ రూపంలో టిటిడికి జమవుతుంది. తరువాత ఈ కేంద్రం ఎన్నేళ్లు పనిచేస్తే….అన్నేళ్లు ఉచితంగానే విద్యుత్‌ అందుతుంది. ప్రస్తుతం ఒప్పందంలోని 20 ఏళ్లు లెక్క తీసుకున్నా…దాదాపు రూ.100 కోట్లు ఆదా అవుతాయి. రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టడం దేవస్థానానికి పెద్ద సమస్య కాదు.

ధర కూడా ఎక్కువే…

ప్లాంట్‌ సొంతంగా పెట్టకున్నా….ప్రైవేట్‌ సంస్థ వద్దే కొనుగోలు చేయాలనుకున్నా, ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందంలోని ధర చాలా ఎక్కువగా ఉంది. యూనిట్‌ రూ.2.50కి వచ్చే దశలో రూ.4.49 పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్న. ఒప్పందం కుదుర్చుకునే దశలోనే ధర్మచక్రం ఈ అంశంపై కథనాలు ప్రచురించింది. అప్పటి అధికారులను అడిగితే….’మామూలుగా యూనిట్‌ రూ.7 దాకా ఉంది. అలాంటిది టిటిడి కోసం తగ్గించుకుని రూ.4.49కే ఇస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. మొత్తంమ్మీద ఆ ఒప్పందం అమల్లోకి వచ్చేసింది.

ఛైర్మ‌న్‌, ఈవో స్పందించాలి…

గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో టిటిడి కుదుర్చుకున్న ఒప్పందంపైనా సమీక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది. టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ దీనిపై సత్వరం స్పందించి నిర్ణయం తీసుకోవాలి.

– ఆదిమూలం శేఖ‌ర్‌, ఎడిట‌ర్‌, ధ‌ర్మ‌చ‌క్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*