శ్రీవారి ఆభరణాలపై ప్రభుత్వంలో ఆకస్మిక మార్పు!

శ్రీవారి ఆభరణాల విషయంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని ఇప్పటిదాకా రాజకీయంగా చూస్తూ, రమణ దీక్షితులుపై చర్యలకే ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వంలో ఆకస్మికంగా మార్పు కనిపిస్తోంది. ఒకవైపు టిటిడి అధికారులు, పాలక మండలి సభ్యులు ఆభరణాలన్నీ పక్కాగా ఉన్నాయని, విచారణ అవసరం లేదన్నట్లు మాట్లాడుతున్న తరుణంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ….ప్రతి రెండేళ్లకు ఒకసారి శ్రీవారి ఆభరణాలను న్యాయమూర్తి ద్వారా తనిఖీ చేయిస్తామని చెప్పారు. దీనికి కొనసాగింపుగా బుధవారంనాడు (27.06.2018)…శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేసి నివేదిక ఇచ్చేందుకు సిట్టింగ్‌ జడ్డిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాశారు. ఇది అనూహ్య పరిణామమే అనుకోవాలి.

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఆయన్న 24 గంటల్లో ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. రెండు రోజుల క్రితం ఆగమ సలహాదారు పదవిపైనా వేటు వేశారు. తన డిమాండ్లపై జులైలో నిరాహార దీక్షకు దిగుతానని దీక్షితులు ప్రకటించిన విషయంల తెలిసిందే. అదేవిధంగా దీక్షితులు తరపున ఎంపి సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో కేసు వేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామాలే ప్రభుత్వంలో మార్పు తెచ్చాయని భావించాలి. దీక్షితులు దీక్షకు దిగితే….అలజడి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణ సామాజికవర్గం తెలుగుదేశం పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఆయన దీక్ష చేపడితే….బ్రాహ్మణ సామాజికవర్గంతో పాటు మఠాధిపతులు, పీఠాధిపతులు మద్దతుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని విచారణ జరిపించమని ఆదేశించే అవకాశాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తపడింది. విచారణకు తాము వ్యతిరేకం కాదన్న సంకేతాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి పూనుకున్నారు. ఏమైనా ఇది శుభపరిణామం. ఈ విధంగానైనా వివాదానికి తెరదించితే శ్రీవారి భక్తులంతా సంతోషిస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*