శ్రీవారి ఆలయంలో అంతా రహస్యమే..! మీడియా కళ్లకూ గంతలు!!

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏమి జరుగుతోందన్నది బయటకు రాదు. ఎవరూ ఓపెన్‌గా చెప్పరు. మీడియా కళ్లకూ గంతలు కట్టేస్తారు. గొంతు నొక్కేస్తారు. ఏదో విధంగా మీడియా తెలుసుకుని బటయ ప్రపంచానికి చెబితే….అప్పుడు అదికాదు ఇదికాదు అంటూ తప్పించుకుంటారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. రమణ దీక్షితులు చెబుతున్న శ్రీవారి పోటు (అన్నప్రసాదాల పాకశాల) కూడా ఒక ఉదంతమే.

తిరుమల శ్రీవారి అడ్డూలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. లడ్డూల తయారీ పెంచడం కోసం చాలా మంది ప్రయత్నించారు. అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేశారు. ఇవన్నీ ఆగమ నియమాలకు ఇబ్బంది లేకుండా జరిగినవే. శ్రీవారి ఆలయం లోపల ఉన్న పోటును విస్తరిస్తే…లడ్డూల తయారీ పెరుగుతుందని చాలా మంది ఈవోలు గుర్తించారు. అయితే అది 1000 ఏళ్ల నాటి నిర్మాణం. దానికి చిన్నచిన్న మరమ్మతులు చేయడం మినహా పడగొట్టడంగానీ, తొలగించడంగానీ చేయకూడదు. అందుకే అందరూ వెనకడుగు వేశారు. అయితే అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఈవోగా వచ్చిన తరువాత…వెనుకా ముందూ ఆలోచించకుండా పోటు పనులు చేపట్టారు. పోటుకు అనుకుని ఉన్న ఉగ్రాణం (సరుకులు నిల్వవుంచే గది)లో కొంత భాగాన్ని తొలగించారు. బూందీని కలిపి, ఉంటగా చేయడానికి ఉపయోగపడే బండల సంఖ్యను పెంచారు. రమణ దీక్షితులు లేవనెత్తుతున్న అంశం ఇదే. వెయ్యి సంవత్సరాల చరిత్ర వున్న పోటులో గోడలు తొలగించడం, బండలు తవ్వేయడం వంటివి ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తే ఇలాంటి చర్యలు బయటపడుతాయన్న భయంతోనే ఆ శాఖ అధికారులను ఆలయంలోకి అడుగుపెట్టడానీకుండా అడ్డుపడ్డారని ఆయన చెబుతున్నారు.

దాదాపు 25 రోజుల పాటు పనులు జరిగితే…లోపల ఏమి చేస్తున్నారో మీడియాకు టిటిడి అధికారులు చెప్పలేదు. వెయ్యి సంవత్సరాల నుంచి స్వామివారికి ఒకచోట ప్రసాదాలు తయారువుతుండగా, దాన్ని పోటు ఆధునీకరణ పేరుతో ఇంకో చోటికి మార్చినపుడు మీడియాకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఎందుకు రహస్యంగా ఉంచారనేది ప్రశ్న. చీమ చిటుక్కుమన్నా పత్రికల్లో, టివీల్లో వార్తలొస్తాయి. అలాంటిది పోటు రిపేరు, ప్రసాదాల తయారీ చోటు మార్పు గురించి తెలినీకుండా మీడియాను ఎందుకు చీకట్లో ఉంచారని అడిగితే సమాధానం చెప్పేవాళ్లు ఉండరు. ధర్మచక్రమం మాత్రం తనకు వచ్చిన సమాచారంతో దీనిపై ‘శ్రీవారి ఉగ్రాణానికి గ్రహణం’ అనే శీర్షికన అప్పుడే ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ మాటకొస్తే పోటు రిపేరు గురించి తనకే తెలియదని రమణ దీక్షితులు చెబుతున్నారు. ప్రధాన అర్చకునితో సంప్రదించకుండా ఇంతటి కీలక నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. పోటును తవ్వేసిన విషయం తనకూ తెలియదని ఈవో చెప్పినట్లు రమణదీక్షితులు వెల్లడించారు. ఇది వాస్తవమైతే ఇంతకంటే ఆరాచకం ఇంకొకటి ఉండదు. వెయ్కికాళ్ల మండపం తొలగింపు, రథమండపం తొలగింపు గురించి రమణ దీక్షితులుతో చర్చించి, ఆయన ఆమోదంతోనే చేశామని చెబుతున్న అధికారులు….పోటు మరమ్మతుల గురించి ఆయనకు చెప్పారా, ఆయన ఆమోదం ఉందా అనేది మాత్రం చెప్పడం లేదు. ఆలయం లోపల ఇనుప నిచ్చెన మెట్లు నిర్మించడన్ని కూడా రహస్యంగా చేశారు. ఏదో విధంగా అది బయటపడి మీడియాకు తెలిసింది. మీడియా గగ్గోలు పెట్టడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

టిటిడి అధికారులు అనుకున్నది చేసేయాలి. ఎవరూ అడ్డుపడకూడదు. అందుకే అంతా రహస్యంగా ఉంచుతారు. రహస్యం ఉన్నచోట అనుమానాలూ తలెత్తుతాయి. నిధుల కోసమే పోటును రహస్యంగా తవ్వేశారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారంటే ఇదే కారణం. ఆ రోజు పోటు ఆధునీకరణ గురించి బయటకు చెప్పివుంటే (ఆధునీకరణ అంటే ఏమి చేయబోతున్నారు, ప్రసాదాలు ఎక్కడ తయారుచేయబోతున్నారు అనే వివరాలు) ఈరోజు రమణ దీక్షితులు తనకు తెలియదని చెప్పే అవకాశమే ఉండేది కాదు. పారదర్శకంగా సాగాల్సిన ఆలయ వ్యవహారాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? తిరుమల ఆలయంలో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు, ఏదిపడితే అది చేయడానికి అవకాశాలు లేవు. సంప్రదాయాలు, నిబంధనలు అడ్డుపడుతుంటాయి. ఇలాంటి వాటిని అధిగమించడానికి… ఒక్కోసారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే భక్తుల కోసమే ఇదంతా చేస్తున్నామని చెబుతున్నారు. ఇది ఎప్పటికీ మంచిది కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*