శ్రీవారి ఆలయంలో డాలర్‌ శేషాద్రి పెత్తనం! అధికార పార్టీ నేత దంపూరుకు చేదు అనుభవం!

అధికార తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు దంపూరు భాస్కర్‌ యాదవ్‌ రెండు రోజుల క్రితం విఐపి విరామ సమయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఎల్‌-1 టికెట్టుపొంది కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శించుకునేదుకు ఆలయంలోకి ప్రవేశించిన దంపూరుకు చేదు అనుభవం ఎదురయింది. ఆలయంలో అన్నీతానై పెత్తనం సాగిస్తున్న డాలర్‌ శేషాద్రి దీనికి కారణమయ్యారు. క్యూలో ముందుగా వెళుతున్న దంపూరు భాస్కర్‌ యాదవ్‌ చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపేసి….మరోచేత్తో వెనుక ఉన్న ముగ్గురు మహిళలను (ఆయనకు కావాల్సినవారు) ముందుకు లాక్కుని, నిలబెట్టి దర్శనం చేయించారు. స్వామివారి సన్నిధిలో ఏమీ మాట్లాడలేక మౌనంగా వచ్చేశారు భాస్కర్‌ యాదవ్‌. అధికార పార్టీ నగర అధ్యక్షులంటే ఎంఎల్‌ఏతో సమానం. అటువంటి వ్యక్తితోనే డాలర్‌ శేషాద్రి అమర్యాదగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థానికుడైన అధికార పార్టీకి చెందిన తనతోనే ఇలా వ్యవహరిస్తే…ఇక బయటివారితో ఎలా ప్రవర్తిస్తారోనని దంపూరు ఆవేదన చెందుతున్నారు. శ్రీవారి ఎదుట ఆయన పెత్తనం ఏమిటని దంపూరు ప్రశ్నిస్తున్నారు. తాను ఈ ఉదంతంపై టిటిడి ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని భాస్కర్‌ చెబుతున్నారు. అయినా…శేషాద్రికి అంతటి పెత్తనం ఎవరిచ్చారు? విఐపి బ్రేక్‌ దర్శనాల సమయంలో, ఆలయంలో ఆయనకు ఏంపని? ఇటువంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ముందుకొస్తున్నాయి.

సాధారణ ఉద్యోగిగా టిటిడిలో చేరిన డాలర్‌ శేషాద్రి….శ్రీవారి ఆలయంపై తిరుగులేని ఆధిపత్యం సంపాధించారు. మామూలు ఉద్యోగి అయిప్పటికీ ఆలయ ప్రధాన అర్చకుడే ఆయనే అనేంతగా; ఆయన లేనిదే ఏ ఉత్సవమూ జరగనంతగా చెలామణి అయిపోయారు. శ్రీవారి దర్శనం కోసం ప్రముఖులు ఎవరు వచ్చినా వారితో రాసుకుని పూసుకుని వ్యవహరిస్తూ…జాతీయ స్థాయిలో పలకుబడి సంపాదించుకున్నారు. ఆ పలుకుబడిని ఉపయోగించుకునే…2006లో రిటైర్‌ అయినా ఇప్పటికీ, 12 ఏళ్ల నుంచి ఎక్స్‌టెన్షన్‌ (పొడిగింపు) తెచ్చుకుంటూ ఆలయంలో పెత్తనం సాగిస్తున్నారు. డాలర్‌ శేషాద్రి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. డాలర్ల కుంభకోణంలో శేషాద్రిని నిందితునిగా చేర్చడం, ఆ తరువాత కోర్టు తీర్పుతో బయటపడటం తెలిసిన విషయాలే. నైతిక ప్రవర్తన విషయంలోనూ ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

ఎక్స్‌టెన్సన్‌పై కొనసాగుతున్న శేషాద్రి తన పరిధులు, పరిమితులు మరచిపోయి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనాల సమయంలో, అదీ ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు పూర్తయ్యేదాక ఉండి, తమకు కావాల్సిన వారికి దగ్గరుండి దర్శనం చేయించి వెళతారట. విఐపిల్లోనూ తమకు కావాల్సిన విఐపిలకు ప్రత్యేక మర్యాదలు చేస్తారన్నమాట. ఇందుకు సాక్ష్యం దంపూరు భాస్కర్‌ యాదవే. ఎల్‌1లో వెళ్లిన ఆయన్ను, ఆపేసి వెనుక ఉన్నవారిని ముందుకు పంపడమంటే అర్థం అదేకదా? ఇంతకంటే సాక్ష్యం కావాలా? అయినా రిటైర్‌ అయిన ఒక సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగికి ఆలయం లోపల పనేమిటన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అటువంటి అవకాశం అధికారులు ఆయనకు ఎందుకు ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఆలయ అర్చకులతోనూ, ఉద్యోగులతోనూ దురుసుగా ప్రవర్తిస్తారని సమాచారం. ప్రసాదాలు తయారుచేసే బ్రాహ్మణులు, ప్రసాదాలు లోపల పెట్టడానికి వెళితే…గర్జించి, గాండ్రించి తరిమేస్తారట. ఆగమ శాస్త్రం ప్రకారం జరగాల్సిన కైంకర్యాల విషయంలోనూ జోక్యం చేసుకుని త్వరత్వరగా ముగించమని ఒత్తిడి చేస్తారట. 25 – 30 నిమిషాలు జరగాల్సిన తోమాల సేవను 10 నిమిషాల్లో ముగించమని హుంకరిస్తారట. ఆలయ ప్రధాన అర్చకులైనా…శేషాద్రి మాటకు ఎదురుచెప్పలేక ఆయన చెప్పినట్లు చేసి వెళ్లిపోతారట. ‘నేను (శేషాద్రి) లేకపోతే…ఆలయంలో ఏదీ జరగదు’ అనే భావం అధికారులకు కలిగించడానికే ఇదంతా చేస్తారని అర్చకుల ఆరోపణ. ఇంకా ఆలయాన్ని శుభ్రం చేసేటప్పుడు….కింది స్థాయి ఉద్యోగులను నోటికొచ్చినట్లు మాట్లాడుతారట. ఆలయం లోపల నడవటానికి పెద్దపెద్ద చెక్కలు వేశారు. ఆలయాన్ని శుభ్రం చేసేటప్పుడు వాటిని క్షణాల్లో తీసి క్షణాల్లో వేయాలని హూంకరిస్తారట. ఇంకో విషయం ఏమంటే…ఏ అధికారి అయినా ఆలయంలో కొనసాగాలంటే శేషాద్రి అండదండలు ఉండాల్సిందే. శేషాద్రి మద్దతు లేని అధికారి ఎవరూ దీర్ఘకాలం ఆలయంలో మనలేదని అంటారు.

ఇప్పుడు రగులుతున్న రమణ దీక్షితులు వివాదం ఇంత పెద్దది అవడానికి మూల కారణం శేషాద్రినే అంటారు ఆలయ ఉద్యోగులు. సాధారణ ఉద్యోగి, అదీ రిటైర్‌ అయిన ఉద్యోగి తమపై పెత్తనం చేయడం ఏమిటనేది రమణ దీక్షితులు మొదటి నుంచి లేవనెత్తుతున్న ప్రశ్న. ఇదేదో శేషాద్రి, రమణ దీక్షితులు మధ్య ఆధిపత్య పోరుగా కనిపిస్తుందిగానీ…టిటిడి అసంబద్ధ నిర్ణయాల వల్ల తలెత్తిన వివాదం. రమణ దీక్షితులుపై ఉన్న కోపాన్ని టిటిడిపై కోపంగా ప్రదర్శిస్తున్నారు రమణ దీక్షితులు. డాలర్‌ శేషాద్రి చేసే పనుల్లో ఇంకో ఉద్యోగికి శిక్షణ ఇప్పించారు. అయినా ఇంకా ఆయన్ను కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నవారు అనేక మంది. శ్రీవారి సన్నిధిలోనే తుదిశ్వాస విడిచేయాలన్నది తన కోరికని శేషాద్రి చెబుతుంటారు…టిటిడిలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకూ అటువంటి కోరిక ఉంటుంది. మరి అందరికీ అవకాశం ఇస్తారా? 65 ఏళ్లు నిండాయని రమణ దీక్షితులను తొలగించారు. ఇందులో తప్పులేదు. మరి శేషాద్రిని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలూ వస్తున్నాయి. వీటికి టిటిడి అధికారులు ఏమని సమాధానం చెబుతారు? శేషాద్రి కొనసాగింపును ఎలా సమర్థించుకుంటారు?!

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*