శ్రీవారి ఆలయంలో నల్లబ్యాడ్జీల వార్తకు ప్రాధాన్యత లేదా?

తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి వెళితే అది సాదాసీదా విశేషమేమీ కాదు. పత్రికలుగానీ, టివి ఛానళ్లకుగానీ విశేషమైన వార్తే అవుతుంది. శ్రీవారిని భóుజాలపై మోసేవారు, సేవల సమయంలో సన్నాయిమేళం వేయించేవారు, ఆలయాన్ని పర్యవేక్షించేవారు, క్యూలైన్లను నడిపేవారు….అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీన్ని భక్తులంతా ఆశ్చర్యం చూశారు. రమణ దీక్షితులు టిటిడి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, దానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అయితే నల్లబ్యాడ్జీలు ధరించి ఆలయంలోకీ వెళతారని ఎవరూ ఊహించలేదు. ఈ వార్తలకు ప్రాధాన్యత లేదన్నట్లు కొన్ని పత్రికలో ఎక్కడో లోపల పేజీల్లో కనిపించకుండా మూలనపడేశాయి. ఆలయ ఉన్నతాధికారుల ప్రోత్సాహం, ప్రమేయం లేనిదే కిందిస్థాయి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి లోనికి వెళ్లే అవకాశమే లేదు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించిన అంశం సీరియస్‌ అవడంతో అది ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ వార్తకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా మూలనపడేశారని పాఠకులు భావించాల్సిన పరిస్థితి. తిరుమలలో చీమ చిటుక్కుమన్నా పెద్దపెద్ద వార్తలు వేస్తుంటారు. ఈ విషయంలో మాత్రం ఎందుకో అలాంటి మనసు రాలేదు. అసలు నల్లబ్యాడ్జీలు లోనికి ఎలా వెళ్లగలిగాయి, దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనే విశ్లేషణ కూడా ఇవ్వడానికి ప్రయత్నించలేదు. ఈ వార్తకు ప్రాధాన్యతను డెస్క్‌లు గుర్తించలేదా…లేక గుర్తించినా కావాలనే ప్రాధాన్యత తగ్గించి ప్రచురించారా? లోగుట్లు పెరుమాళ్లకే ఎరుక.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*