శ్రీవారి ఆలయంలో ‘స్థానాత్తరులు’ ఏం చేసేవాళ్లో తెలుసా…!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు 8,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 14,000 మంది అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఇక పరోక్షంగా కొన్ని వేల మంది శ్రీనివాసుని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 500 ఏళ్లకు మునుపే స్వామివారి ఆలయంలో 29 రకాల ఉద్యోగులు పనిచేసేవారట. ఆ వివరాలు శాసనాల్లో లభ్యమయ్యాయి.

15వ శతాబ్దంలో 29 రకాల ఉద్యోగులు శ్రీవారి ఆలయంలో పనిచేసేవారు. ఇప్పటిలాగా నెలకోసారి వేతనాలు ఇచ్చేవారు కాదు. వివిధ ఉత్సవాల సందర్భంగా స్వామివారి ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లించేవారట. ఈ ఉద్యోగుల్లో దేవస్థానం స్థానాత్తరులు, దేవాలయ అధికారులు, కాపలాదారులు, బంగారుపనిచేసే కంసాలీలు, కొలిమిపనివారు, దేవాలయానికి కట్టెలు తీసుకొచ్చేవారు, తాపీ పనిచేసేవారు, ఊడిగందారులు, మేళం వాయిద్యగాళ్లు, ఏనుగు మావటీలు, దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్లు…మొత్తం 29 రకాల ఉద్యోగులు ఉండేవారు.

పాలక మండలి వంటి స్థానాత్తరులు…

ఇప్పడు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి ఉన్నట్లే 15 శతాబ్దకాలంలో తిరుమల, తిరుపతిలోని ఆలయాల వ్యవహారాలను చూడటానికి ఒక కమిటీ ఉండేది. దీన్ని స్థానాత్తరు అని పిలిచేవారు. ఈ కమిటీలో 12 మంది సభ్యులుండేవారు. ఒక శాసనంలో లభించిన వివరాల ప్రకారం, 12 మంది స్థానాత్తరుల్లో….తిరుపతి శ్రీవైష్ణవులు-4, నంబియార్‌ (శ్రీవారి ఆలయ అర్చకుడు) – 1 నంబియార్‌ తిరుచానూరు-1, కోయిల్‌ కెల్వి జియ్యర్‌ (పెద్దజియ్యర్‌, చిన్నజియ్యర్‌)-2, కోయిల్‌ కానుక్కు తిరునిన్రస్డయు – ఉడైయార్‌-2 సభ్యులు ఉండేవారు. ఈ సభ్యులు ఆలయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేవారు.

బ్రహ్మోత్సవాల ముగింపురోజే లెక్కలు..

సాళువ రాజుల కాలంలో తిరుమలలో ఏడాదికి ఏడుపర్యాయాలు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు జరిగేవట. ఈ ఉత్సవాల్లో చివరి రోజైన 9వ రోజు….అప్పటిదాకా భక్తుల నుంచి వసూలైన విరాళాలు, కానుకల వివరాలను….కొలువుదీరిన ఉత్సవార్ల ఎదుట, భక్తుల సమక్షంలోనే, ఆముదపడి వాసలిలో చదివి వినిపించేవారట. ఈ కొలువు ఉగ్రాణం వద్ద జరిగేదని శాసనాలు చెబుతున్నాయి. స్వామివారికి లభిస్తున్న ఆదాయ వివరాలు పారదర్శకంగా ఉండటం కోసం ఇలాంటి ఏర్పాటు చేశారని భావించాలి. ఏమైనా అప్పట్లోనే అంత మంచి విధానం రూపొందించినందుకు అభినందించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*