శ్రీవారి ఆలయంలో 1000 ఏళ్ల కిందట జరిగిన మోసం : అదేమిటో తెలుసుకోవాల్సిందే..!

దేవుడన్న భయం కూడా లేకుండా స్వామివారి సందపను మింగేసే ఘనులు ఈనాడే కాదు…ఆనాడూ ఉన్నారు. శ్రీవారి ఆలయంలో దీపారాధన కోసం ఇచ్చిన బంగారాన్ని స్వాహా చేసిన వారి నుంచి ఉదంతం రాజుల కాలంలోనే జరిగింది. ఆ స్వాహారాయుళ్లపై విచారణ జరిపించి… ఆ బంగారాన్ని స్వామి ఖజానాకు జమ చేశారు. ఇలాంటివి ఒకటి రెండు ఉదంతాలు శాసనాల్లో కనిపించాయి. ఆసక్తికరమైన ఈ ఘటనల వివరాల్లోకి వెళితే…

ఇది చోలరాజుల కాలం నాటి ఉదంతం. అంటే….సుమారు 1000 సంవత్సరాల ముందునాటి ఘటన. అప్పుడు తిరుపతి నగరం ఇంకా ఏర్పడలేదు. తిరుచానూరు, తిరుమండ్యం గ్రామాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి తిరుమండ్యం పాలననాధికారికి దాతల నుంచి 23 పాన్‌ బంగారు నాణేలు విరాళంగా అందాయి. శ్రీవారి ఆలయంలో రోజూ 24 నెయ్యి దీపాలు వెలిగించే ఒప్పందంతో ఈ బంగారు నాణేలు అందజేశారు దాతలు. అయితే… తిరుమండ్యం గ్రామాధికారి శ్రీవారి ఆలయంలో 24 దీపాలకు బదులు 2 దీపాలు మాత్రమే వెలిగిస్తూ వచ్చారట.

ఆ రోజుల్లో ఆలయాలను పర్యవేక్షించడానికి ‘అరుళక్కిం’ అనే పదవి ఉండేది. ఆయన ఆలయాల్లో పూజలు, నైవేద్యాలు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేసేవారు. మొదటి రాజేంద్ర చోళ దేవుడు పాలనలో ఉండగా….అరుళక్కిం అధికారి ఒకరు తిరుచానూరుకు వచ్చారు. అక్కడే విడిది చేశారు. అప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే దీపారాధన గురించి చర్చిస్తుండగా…అర్చకులు ఓ ఫిర్యాదు చేశారు. తిరుమండ్యం పాలనాధికారి మోసాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతే….తిరుమండ్యం గ్రామాధిపతిని పిలిచి విచారించారు. ఆయన చేసిన తప్పునకు మందలించారు. అంతేగాక అతని నుండి 23 పాన్‌ బంగారాన్ని వసూలు చేసి శ్రీవారి ఖజానాకు జమ చేయించారట. అప్పటి నుంచి ఆలయంలో 24 దీపాలు వెలిగించే బాధ్యతను ఆలయ అధికారులకు అప్పజెప్పారట.

ఇది కీ.శ.1235నాటి ఉదంతం. మూడో రాజరాజ చోళుని పరిపాలనా కాలంలో జరిగింది. తిరుచానూరుకు సమీపంలోని యోగిమల్లవరంలో వెలసిన శ్రీతిప్పలాధీశ్వర అనే పరాశరేశ్వర దేవాలయం ఉంది. ఆ ఆలయంలో నిత్యం అభిషేకం, అన్నప్రసాద నైవేద్యం చేయడాని జయిన్‌ కొండ బ్రహ్మమారయన్‌ అనే దాత 26 1/4 కొలంజుల స్వచ్ఛమైన బంగారం తిరుచానూరు స్థానత్తారులకు ఇచ్చారు. ఈ మేరకు శిలాశాసనం రాయించారు. అయితే…బంగారం తీసుకున్నవారు… పరాశరేశ్వరునికి పూజలు, నైవేద్యాలు చేయించలేదు. ఇది వీర నరసింగయాదవ రాయలు దృష్టికి వెళ్లింది. తిరుచానూరు స్థానిత్తారులను న్యాయ విచారణకు పిలిపించారు. అయితే…తమకు ఏ విషయమూ తెలియదని వారు బుకాయించారు. అర్చకులు శిలాశాసనాలనే ఆధారంగా, సాక్ష్యంగా చూపించారు. ఆలయంలో ఊడిగంచేసే వారినీ రాజు విచారించారు. వారు కూడా శిలాశాసనంలోని సమాచారం వాస్తవమేనని చెప్పారు. దీంతో రాజు….తిరుచానూరు స్థానత్తారుల నుంచి 26 1/4 కొలంజుల బంగారాన్ని వసూలు చేసి….పరాశరేశ్వర స్వామి భాండాగారానికి స్వాధీనపరిచారట. ఇవి మన ప్రాంతంలోని రెండుచోట్ల జరిగిన ఉదంతాలు. ఇక దేశ వ్యాప్తంగా ఎంతమంది ఆలయాల సొమ్ము దిగమింగారో!

1 Comment

  1. మనుషులు ఎప్పుడూ అంతే
    ఆకలి ఉన్నప్పుడు ఓ రకంగా,తీరాక ఓ విధంగా
    డబ్బు ఉన్నప్పుడు ఓ రకంగా లేనప్పుడు ఓ రకంగా
    ఉద్యోగం లేనప్పుడు ఓ రకంగా, వచ్చాక ఓరకంగా
    అధికారం ఉన్నప్పుడు ఓ రకంగా అవసరం ఉన్నప్పుడు ఓరకంగా ప్రవర్తిస్తాడు
    కానీ ప్రస్తుతం సమాజంలో గతం కంటే భిన్నంగా అవినీతి, అత్యాశ,కులపిచ్చి వ్యభిచారం మోసం, లంచగొండితనం, అనైతికత రాజ్యమేలుతున్నాయి

Leave a Reply

Your email address will not be published.


*