శ్రీవారి ఆలయానికి రాజకీయ క్రీడా క్షేత్రంగా మార్చుతున్న అధికారి ఎవరు?

రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలతో టిటిడి ప్రతిష్ట దెబ్బతింటోందంటూ టిటిడి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయింది. కొందరు ఉద్యోగులు శ్రీవారి ఆలయం లోనికీ నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలయంలోకి నల్ల బ్యాడ్జీలు వేసుకెళ్లాలన్న ఆలోచన లేని ఉద్యోగులను రెచ్చగొట్టి…నల్ల బ్యాడ్జీలతో వెళ్లేలాగా చేసి, ఆ ఉద్యోగులను బలిచేసిన అధికారి ఎవరు?

వాస్తవంగా టిటిడి పరిపాలనా భవనం వరకే నల్లబ్యాడ్జీలను పరిమితం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు నిర్ణయించారు. అయితే….ఆనూహ్యంగా కొందరు ఉద్యోగులు ఆలయంలోకీ బ్యాడ్జీలు ధరించి వెళ్లారు. ఇది ఆశ్చర్యం కలిగించింది. ఓ అధికారి ఉద్యోగులను పిలిచి, నల్లబ్యాడ్జీలు ధరించి వెళ్లమని రెచ్చగొట్టినట్లు సమాచారం. అధికారే చెప్పినాక ఇక ఏముందిలే అనుకుని అమాయకులైన ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లారు. ఇప్పుడు ఇదే విమర్శలపాలవుతోంది. టిటిడి అభాసుపాలవుతోంది. సాధారణంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులు చాలా భయభక్తులతో ఉంటారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయానికి ఎప్పడూ పాల్పడరు. ఆ అధికారి ప్రోత్సహించడం వల్లే అంతదూరం వెళ్లారని ఉద్యోగ సంఘాల నాయకులే చెబుతున్నారు.

ఎప్పుడూ మీడియా ముందుకు రాని అయ్యంగార్లు, పోటు కార్మికులు, అర్చకులు అంతా వరుసపెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. రమణ దీక్షితులు వీరెవరిపైనా ఎలాంటి విమర్శలూ చేయలేదు. ఆయన చాలా ఉన్నతస్థాయిలో జరిగిన వ్యవహారాలపై మాట్లాడుతున్నారు. దీన్ని పరిష్కరించాల్సింది ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వమేమో సమస్య పరిష్కారానికి చిన్నపాటి చొరవ కూడా ఇప్పటిదాకా తీసుకోలేదు. సంబంధం లేని ఉద్యోగులు, అర్చకులు, అయ్యంగార్లు వంటి వాళ్లు ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేయడం వెనుక అధికారుల ప్రోత్సమం ఉందనేది బహిరంగ రహస్యం. టిటిడిలో ఆందోళనలు చేయకూడదంటూ ప్రభుత్వం ఆరు నెలలకు ఒకసారి జీవో జారీ చేస్తుంటుంది. 2017లో విడుదల జీవో 23.05.2018కి ముగిసింది. దీన్ని గమనించే అధికారి ఉద్యోగులతో 24న నిరసన చేయించారని కూడా ప్రచారం జరుగుతోంది.

శ్రీవారి ఆలయం అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందని రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలకు ఈ రోజు కొందరు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆలయంలోకి వెళ్లిన ఉదంతమే నిదర్శనం. ఆలయాన్ని రాజకీయ క్రీనీడకు కేంద్రంగా మార్చేస్తున్న అధికారులు… శ్రీవారి సాక్షిగా ఆత్మపరిశీలన చేసుకుంటే తాము చేస్తున్న తప్పులేమిటో తెలుస్తాయి. ఎవరూ చూడలేరు, నన్నేమీ చేయలేరు అనుకుంటే…అతి అమాయకత్వంమైనా అవుతుంది. ఇలాంటివారు శ్రీవారి కోర్టులో నిలబడి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని శ్రీవారి భక్తులు హెచ్చరిస్తున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*