శ్రీవారి ఆలయ దీపాల చుట్టూ అవినీతి నీడలు!

– ఆదిమూలం శేఖర్‌

తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టర్లకు సర్గధామం వంటిది. ‘ఇందు గలడు అందులేడని సందేహము వలదు…యెందెందు వెతకినా అందందుగలడు’ అని భగవంతుని గురించి చెప్పినట్లు….మరుగుదొడ్ల నుంచి శ్రీవారి గర్భాలయం దాకా అవినీతి సర్వాంతర్యామిగా దర్శనమిస్తుంది. శ్రీవారికి కాపలాగా ఉండాల్సిన అధికారులే…కాంట్రాక్టర్లకు తోడుగా నిలబడి అవినీతికి సహకరిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో వెలిగే…దీపాల నీడలోనూ అవినీతి కనిపిస్తోందంటే….అధికారులు, కాంట్రాక్టర్లు ఎంతగా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అసలు విషయం ఏమంటే….

16 దీపాలతో దేదీప్య‌మానం
శ్రీవారి ఆలయంలో దీపాలు వెలిగించడానికి స్వచ్ఛమైన ఆవునెయ్యి సరఫరా చేయాల్సివుండగా….మంచినూనె (నువ్వుల నూనె), వనస్పతి (డాల్డా) సరఫరా అవుతోందట. దీంతో ఆలయ ఉద్యోగులు ఆవేదనతో ధర్మచక్రం దృష్టికి తెచ్చారు. తిరుమల ఆలయంలో మొత్తం 16 దీపాలున్నాయి. ఆలయం లోపల విద్యుత్‌ దీపాలుండవు. నెయ్యి దీపాల వెలుగుల్లోనే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గర్భగుడినాలో నాలుగు, కులశేఖరపడి వద్ద నాలుగు, ఆస్థానం వద్ద రెండు, జయ విజయుల వద్ద రెండు, గరుడాల్వార్‌ వద్ద నాలుగు దీపాలు ఉన్నాయి. ఈ దీపాలకు తెల్లవారు జామున సుప్రభాతంతో మొదలుపెట్టి, రాత్రి ఏకాంత సేవ దాకా దఫదఫాలుగా నెయ్యిపోస్తుంటారు. ఇందుకోసం రోజూ నాలుగు టిన్నుల నెయ్యి అవసరం అవుతుంది.

చూస్తూ చూస్తూ క‌ల్తీ నెయ్యి పోయ‌లేకున్నాం….
ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆచ్చమైన ఆవునెయ్యినే దీపాలకు వినియోగించాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరుతోనే టెండర్లు పిలుస్తారు. అయితే సరఫరాలో మాత్రం కల్తీనెయ్యి వస్తోంది. ఎక్కువ భాగం మంచినూనె, వనస్తతి కలిసి వస్తున్నట్లు ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. ‘ఒక్కోడబ్బాలో కిలో రెండు కిలోలు కూడా నెయ్యి ఉండదేమో. కొన్ని డబ్బాలు తెరవగానే మంచినూనె వాసన వస్తుంది. ఎంతకాలమైనా ఇలాగేవస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. స్వామి దీపాల్లోనూ అవినీతికి పాల్పడేవారిని ఏంచేయాలో మీరే చెప్పండి’ అంటూ ఆవేదనతో చెప్పారు.

త‌నిఖీలు ఏమ‌య్యాయి?
సాధారణంగా ఏ సరుకు కొనుగోలుకైకా టెండరు సమయంలో కాంట్రాక్టర్లు నమూనాలు ఇస్తారు. ఆ నమూనాలు ప్రయోగశాలకు పంపి పరీక్షిస్తారు. టిటిడి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే….ఆ వ్యాపారి టెండరులో పాల్గొనేందుకు అర్హులవుతారు. లేదంటే డిస్‌ క్వాలిఫై అవుతారు. టెండరు దక్కించుకున్న వ్యాపారి సరుకు సరఫరాచేస్తారు. అలా గోదాములకు వచ్చిన సమయంలోనూ శాంపిల్స్‌ సేకరించి తిరుమలలోని ప్రయోగశాలలో పరీక్షిస్తారు. సరిగావుంటేనే ఆ సరుకును అన్‌లోడ్‌ చేయడానికి అనుమతిస్తారు. అది నెయ్యి అయినా, చక్కెరైనా, వస్త్రాలైనా….టిటిడిలో అన్నింటికీ మేలైన ప్రమాణాలే ఉన్నాయి. ఆ ప్రమాణాలను కాంట్రాక్టర్లతో పాటింపజేయడంలోనే లోపాలున్నాయి. షర్మిష్ట టిటిడి ఆరోగ్యాధికారిగా నియమితులైన కొత్తల్లో నెయ్యిలో నాణ్యత లేదని ఒకటి రెండు ట్యాంకర్లను తిప్పి పంపిన ఉదంతాలున్నాయి.

నిపుణుల‌తో ప‌రీక్షించండి…బండారం బ‌య‌ట‌ప‌డుతుంది!
నెయ్యిని కూడా టిటిడి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. అయినా….కల్తీనెయ్యి శ్రీవారి ఆలయం దాకా ఎలా వెళుతుందనేది ప్రశ్న. శ్రీవారి ఆలయ దీపాలకు కల్తీనెయ్యి కాదు… స్వచ్ఛమైన నెయ్యే సరఫరా అవుతోందని వాదించే అధికారులెవరైనా ఉంటే… ‘మీడియాను, ఆహార నిపుణులను తీసుకుని రండి…వగడిలో ఉన్న నెయ్యి డబ్బాలను పరీక్షించండి….అక్కడే తేలిపోతుంది’ అని సవాలు విసిరినట్లు చెబుతున్నారు ఆలయ ఉద్యోగులు. దీనిపైన విచారణ జరిపించాలని, శ్రీవారి దీపాలకూ కల్తీనెయ్యి సరఫరా చేసి స్వామివారి సొమ్మును దోచుకోవడమేగాక…ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్న కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

2 Comments

  1. తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టర్లకు సర్గధామం వంటిది >> ఆయన కళ్ళు మూసుకొన్నాడు.. తెరిచే వరకూ వీళ్ళ అవినీతికి అంతు ఉండదు..

  2. Om namo venkateshaya
    Yes, this kind of information needs to be investigated at surprise and appropriate action to be taken against the lapse, if any, please.

Leave a Reply

Your email address will not be published.


*