శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! ధర్మచక్రం ప్రత్యేక కథనం..!!

-ఆదిమూలం శేఖర్, ఎడిటర్, ధర్మచక్రం

కలియుగ దైవంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీనివాసుడు అపర కుబేరుడే. ఆయనకు బ్యాంకుల్లో రూ.15 వేల కోట్ల నగదు డిపాజిట్లు, ఎనిమిది టన్నుల బంగారు నిల్వలు, వెండి కొండలే కాదు, వందల కోట్లు విలువైన భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి.

ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉన్నాయి. సెంటు ఖాళీ జాగా కనిపిస్తే ఆక్రమణదారులు పాగా వేసేస్తున్న ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులు ఎంతవరకు పదిలంగా ఉన్నాయన్న సందేహం కలుగుతోంది. ఎక్కడెక్కడో ఉన్న ఈ ఆస్తులను పరిరక్షించడం తితిదేకి సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది.

తితిదే తన అవసరాల కోసం కొనుగోలు చేసిన భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు, భక్తులు శ్రీవారికి విరాళంగా ఇచ్చిన ఆస్తులు కొన్ని ఆలయాలను తితిదే విలీనం చేసుకోవడం ద్వారా సంక్రమించిన భూములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ మధ్యే తితిదే ఎస్టేట్స్ విభాగం శ్రీవారి ఆస్తుల జాబితాను రూపొందించింది. తితిదేకి ఎక్కడెక్కడ ఏయే ఆస్తులున్నాయి. ఇవి ఎలా వచ్చాయి. ఎవరు వచ్చారు. తితిదేకి 200కిపైగా ఉన్న కళ్యాణమండపాల రూపంలోనే కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 

ఇంకా తితిదే కార్యాలయాలు, ఆస్తుల పరిరక్షణ, రోడ్లు వంటివి నిర్మించిన భూములు ఉన్నాయి. ఇలాంటి ఆస్తుల పరిరక్షణ పెద్ద సమస్య కాదు గానీ అక్కడక్కడా సాగు భూమి రూపంలో ఇళ్ల స్థలాల రూపంలో ఇళ్ల రూపంలో ఉన్న ఆస్తులు ఆక్రమణకు గురయ్యే ప్రమాదముంది. తిరుపతి చుట్టుప్రక్కల ఉన్న ఆస్తులు మినహా దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై తితిదేకి సరైన పర్యవేక్షణ కూడా లేదు. పర్యవేక్షించాలనుకున్నా అంతటి యంత్రాంగం తితిదేకి లేదు.

తిరుపతి సమీపంలోని పేరూరు చెరువు కూడా టిటిడిదే…

తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా తెన్‌కాశి తాలూకా కుట్రాలంలో 19,336 చదరపు అడుగుల విస్తీర్ణం గల సత్రం ఒకటి 1969లో శ్రీవారికి కానుకగా వచ్చింది. విలుపురం జిల్లా శంకరాపురం తాలూకా, ఎస్‌.కలత్తూరులో ఎకరా భూమి ఉంది. తిరువళ్ళూరు జిల్లా, ఊత్తుకోటై తాలూకా, సీతంజేరి గ్రామంలో 8.53 ఎకరాల భూములను కాంచీపురం, చెంగల్పట్టు, శ్రీ పెరంబదూరు, వేలూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 20 చోట్ల ఖాళీ స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. తమిళనాడులో మొత్తం 41 చోట్ల శ్రీవారి ఆస్తులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో 10 చోట్ల స్వామివారికి కానుకగా లభించిన ఆస్తులు ఉన్నాయి. బెంగుళూరు నార్త్ తాలూకా, కాఫీబోర్డు కాలనీలో 2,400 చదరపు అడుగుల జాగా ఉంది. చిక్‌ మంగుళూరు తాలూకా హెబెల్లిలో 6.72 ఎకరాల భూములు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో మామిడి తోటలూ ఉన్నట్లు తితిదే రికార్డులు చెబుతున్నాయి. రిషికేష్‌లో దాదాపు 12 ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 10 చోట్ల స్వామివారి ఆస్తున్నాయి. ఒరిస్సాలో జైపూర్‌లో 1088 చదరపు అడుగుల ప్లాట్లు ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ప్రతి జిల్లాలోనూ శ్రీవారి ఆస్తున్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 ఆస్తులు దేవస్థానం రికార్డుల్లో ఉన్నాయి. ఇందులో తంబళ్ళపల్లి మండలం కోసువారిపల్లిలో 76 ఎకరాలు, యర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లిలో 44.68 ఎకరాల భూములు ఉన్నాయి. కడప జిల్లాలో 41చోట్ల శ్రీవారి ఆస్తులు ఉన్నాయి. కళ్యాణ మండపాలు, దేవాలయాలు కాకుండా 80 ఎకరాల దాకా వ్యవసాయ భూములు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 33 ఆస్తులు ఉన్నాయి.

ధర్మచక్రం వారపత్రికలో 2016లో ప్రచురితమైన కథనం

ఇలా ప్రతి జిల్లాలోను శ్రీవారి పేరిట ఆస్తులు, భూములు ఉన్నాయి. పర్యవేక్షణ, నిర్వహణ ఇబ్బందిగా ఉన్న ఆస్తులను విక్రయించాలని ఇటీవల తితిదే పాలకమండలి నిర్ణయించింది. ఏయో ఆస్తులు విక్రయించాలనేది ఇప్పటికే గుర్తించింది కూడా. గతంలోనూ నిర్వహణ ఇబ్బందిగా మారిన పలు ఆస్తులను వేలంపాటలో విక్రయించారు. తాజాగా విక్రయించడానికి గుర్తించిన ఆస్తులను వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలి.

చెన్నైలో ఉన్న సదావర్తి భూముల వ్యవహారం ఎంత జఠిలంగా మారిందో చూస్తున్నాం. 200 ఎకరాలకుపైగా ఉన్న భూములన్నీ ఆక్రమణకు గురయి 80 ఎకరాలు మాత్రమే మిగిలి ప్రభుత్వమే తలచుకున్నా ఆ భూములను కబ్జాదారుల చేతుల్లో నుంచి విడిపించలేని పరిస్థితి ఉంది. శ్రీవారి ఆస్తులకు అలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాల్సిన అవసరముంది.

2 Comments

  1. ఆస్తులను కాపాడుకోలేమా?

Leave a Reply

Your email address will not be published.


*