శ్రీవారి కార్పస్ నిధికి కోతలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆర్థిక సంక్షోభంలోకి వెళుతున్న ప్రమాద ఘంటికలు గోచరిస్తున్నాయి. ఒకవైపు డిపాజిట్లు తగ్గిపోతున్నాయి, వడ్డీరేట్లలో కోతపడుతోంది, మరోవైపు ఖర్చులు అదుపుతప్పుతున్నాయి….వెరసి టిటిడి భవిష్యత్తు ఆందోళన కలిగించేలా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,310 కోట్లతో టిటిడి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఏటా టిటిడి ఆదాయం పెరుగుతున్నా, అదుపు తప్పుతున్న ఖర్చులు, దుబారా వ్యయం వల్ల బ్యాంకులో డిపాజిట్‌ చేసే మొత్తం తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగిస్తోంది. 

భారీగా తగ్గుతున్న డిపాజిట్లు….
సాధారణంగా హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్‌ ఆదాయంగా పరిగణిస్తారు. కానుకల ద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని శాశ్వత పనులకు వినియోగించగా మిగిలిన దాన్ని డిపాజిట్‌ చేయాలి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు దర్శనాల టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, తలనీలాల విక్రయాలు వంటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటారు. రెవెన్యూ ఆదాయం నుంచే ఉద్యోగుల జీతభత్యాలు, మార్కెటింగ్‌ సరుకుల కొనుగోలు, విద్యుత్‌ ఛార్జీలు వంటివాటి కోసం ఖర్చు చేయాలి. డిపాజిట్లు ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ అంత ఎక్కువగా వస్తుంది. భవిష్యత్తులో హుండీ ఆదాయం తగ్గినా…వడ్డీ రావడం వల్ల ఆలయ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే డిపాజిట్‌ చేసే మొత్తమే తగ్గిపోతోంది. 2020-21లో రూ.105 కోట్లు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. 2019-20లో 165 కోట్లు డిపాజిట్ చేశారు. 2018-19 సంవత్సరంలో రూ.200 కోట్లు కార్పస్‌ ఫండ్‌ కింద డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుంటే ఆచరణలో రూ.86 కోట్ల మాత్రమే డిపాజిట్‌ చేయగలిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019-20లో కార్పస్‌ఫండ్‌ డిపాజిట్‌ లక్ష్యాలను రూ.78.85 కోట్లకు తగ్గించుకున్నారు. అయితే ఆచరణలో రూ.165 కోట్లు అయింది. అయినా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే… 2016-17లో రూ.475 కోట్లు, 2015-16లో రూ.783 కోట్లు, 2014-15లో రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఎంత డిపాజిట్ ‌చేయాలో లెక్కేసుకోవచ్చు. 

హుండీ ఆదాయం పెరుగుతున్నా….
డిపాజిట్లు చేయడం అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేయడమే. ఆదాయం తగ్గినపుడు పొదుపూ తగ్గుతుంది. టిటిడి విషయంలో ఆదాయం తగ్గడం లేదు. పెరుగుతోంది. అయినా డిపాజిట్లు భారీగా తగ్గాయి. హుండీ ద్వారా వచ్చే కానుకలను పరిశీలిస్తే….2014-15లో రూ.993 కోట్లు, 2015-16లో రూ.1000 కోట్లు, 2016-17లో రూ.1010 కోట్లు వచ్చాయి. 2017-18లో 1,116 కోట్లు, 2019-20లో 1,310 కోట్లు వచ్చాయి. అంటే హుండీ ద్వారా వస్తున్న ఆదాయం పెరుగుతూనే ఉంది. 2014-15లో రూ.993 కోట్లు వచ్చినపుడే…. రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. అలాంటిది రూ.1,310 కోట్ల ఆదాయం వచ్చినపుడు డిపాజిట్లు పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ప్రమాద సంకేతంగా భావించాలి. ప్రతి సంవత్సరం నిర్ణీత శాతం కార్పస్ లో డిపాజిట్ చేయాలన్న ఓ తీర్మానాన్ని టిటిడి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

1 Comment

  1. రాజకీయాలు నుండి తప్పించాలి

Leave a Reply

Your email address will not be published.


*