శ్రీవారి ఖజానాలోని…మలేషియా డాలర్లు చిల్లపెంకులే!

మలేషియా డాలర్‌ (ప్రస్తుతం రింగిట్‌ అంటున్నారు) విలువ మన డబ్బుల్లో చూస్తే 17 రూపాయలు. ఒక మలేషియా డాలర్‌ మన వద్ద ఉంటే రూ.17 ఉన్నట్లే. అయితే…టిటిడి వద్ద మలేషియా డాలర్లు కుప్పలుగా ఉన్నా పైసా విలువ లేకుండాపోయాయి. చిల్ల పెంకులతో సమానమయ్యాయి. దీనివల్ల శ్రీవారికి ఎన్ని కోట్లు నష్టం వాటిల్లిందో లెక్కలు వేస్తేగానీ తెలియదు. ఆసక్తికరమైన ఈ కథనంలోకి వెళితే….

టిటిడిలో మలేషియా నాణేల సమస్యను తెలుసుకోడానికి ముందుగా…మలేషియా కరెన్సీ గురించి కొంచెం తెలుసుకోవాలి. మనకు పావలా, అర్ధరూపాయి, రూపాయి నాణేలు ఉన్నట్లు మలేషియాలో 5 సెంట్స్‌, 10 సెంట్స్‌, 20 సెంట్స్‌, 50 సెంట్స్‌, డాలర్‌ నాణేలు ఉండేవి. వివిధ దశల్లో విడుదల చేసిన డాలర్‌ నాణేల్లో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని గుర్తించిన మలేషియా సెంట్రల్‌ బ్యాంకు….2005 డిసెంబర్‌ 7వ తేదీ నుంచి వాటి చెలామణిని రద్దు చేసింది. మనదేశంలో పెద్దనోట్లు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టినట్లు….డాలర్‌ నాణెం స్థానంలో డాలర్‌ నోట్‌ తీసుకొచ్చింది. అంటే డాలర్‌ నాణేలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. డాలర్‌ బిల్లను రద్దు చేసినపుడు… ప్రజల వద్ద ఉన్న నాణేలను బ్యాంకులు నిర్ణీత గడువులోపు వెనక్కి తీసుకున్నాయి.

ఇప్పుడు అసలు విషయానికొస్తే….టిటిడి వద్ద 40 టన్నుల మలేషియా నాణేలు ఉన్నాయి. దశాబ్ద కాలంగా మార్పిడి చేయకపోవడంతో గుట్టగా పడివున్నాయి. ఇందులో 5, 10, 20, 50 సెంట్స్‌ నాణేలతో పాటు డాలర్‌ నాణేలూ ఉన్నాయి. మలేషియాలో డాలర్‌ నాణేన్ని రద్దు చేసిన తరువాత ఈ నాణేలు శ్రీవారి హుండీకి చేరాయా? లేక అంతకు మునుపు నుంచి చేరినవి కుప్పగా ఉన్నాయా? అనేది తెలియదుగానీ…టిటిడి వద్ద ఉన్న 40 టన్నుల మలేషియా నాణేల్లో డాలర్‌ నాణేలూ లక్షల సంఖ్యలో ఉంటాయనడంలో సందేహం లేదు. అవన్నీ ఇప్పుడు దేనికీ పనికిరాకుండాపోయాయి.

మలేషియాలో డాలర్‌ నాణెం రద్దయిన విషయమైనా టిటిడి అధికారులకు తెలుసా…తెలియదా అనేది అనుమానంగా ఉంది. ఈ అనుమానం కలగడానికి భూమిక ఏమిటో ఇకొన్ని వివరాలు తెలుసుకుంటే మీకే తెలుస్తుంది. టిటిడి తనవద్ద నున్న మలేషియా నాణేలను మార్పిడి చేయడానికి దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. 2003 దాకా విదేశీ నాణేలను బరువును బట్టి విక్రయించేవాళ్లు. ఆ తరువాత 2009 దాకా ఆ నాణేల విలువను బట్టి మార్పిడి చేసేవాళ్లు. 2009 తరువాత ఈ పద్ధతిలో మార్పిడి కూడా చాలాఏళ్లు ఆగిపోయింది.

2012లో మళ్లీ నాణేల మార్పిడి కోసం ప్రయత్నించారు. నాణేల విలువ ఆధారంగా మార్పిడి చేయడం కోసం టెండర్లు పిలిచారు. బ్యాంకులు, ఆర్‌బిఐ అనుమతి ఉన్న ఏజెన్సీలు మాత్రమే విదేశీ నాణేలు మార్పిడి చేయడానికి వీలుంది. అప్పుడు కొటాక్‌ మహీంద్రా బ్యాంకు మాత్రమే స్పందించి టెండర్లు వేసింది….ఒక సెంటు నాణేనికి 4 పైసలు, 5 సెంట్ల నాణేనికి 12 పైసలు, 10 సెంట్ల నాణేనికి 40 పైసలు 20 సెంట్ల నాణేనికి రూపాయి, 50 సెంట్ల నాణేనికి రూ.2.80, డాలర్‌ నాణేనికి 40 పైసలు ఇవ్వడానికి కొటేషన్లు వేసింది. ఎక్కువ విలువ కలిగిన నాణేనికి వేసిన కొటేషన్‌ మిగిలిన వాటితో పోల్చితే తక్కువగా ఉందనే పేరుతో అప్పుడు ఏ నాణేలనూ మార్పిడిచేయకుండా అలాగే పెట్టేశారు.

తాజాగా 23.06.2018 మళ్లీ టెండర్లు పిలిచారు. ఈసారి కొటాక్‌ మహీంద్రా బ్యాంకుతో పాటో మరో నాణేల మార్పిడి ఏజెన్సీ కొటేషన్లు వేసింది. సెంట్స్‌ కాయిన్స్‌ను పక్కన పెడితే….మలేషియా డాలర్‌ నాణేనికి ఇండియా సిమెంట్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, చెన్నై అనే సంస్థ ఐదు పైసలు మాత్రమే ఇవ్వడానికి సిద్ధపడింది. మహేంద్ర బ్యాంకు 49 పైసలు ఇస్తామని చెప్పింది. అయితే…దీన్ని బోర్డు తిరస్కరించింది.

ప్రస్తుతం మలేషియా డాలర్‌ విలువ రూ.17గా ఉంది. అంత విలువ చేసే డాలర్‌కు 49 పైసలు ఇవ్వడం ఏమిటి? అనే అనుమానంతో బోర్డు దీన్ని తిరస్కరించివుండొచ్చు. అయితే….డాలర్‌ నాణేలు చెలామణిలో లేవనే సంగతి బోర్డుకు అధికారులు తెలియజేశారా లేదా అనేది ప్రశ్న. అసలు ఆ సమాచారం టిటిడి అధికారుల వద్ద ఉందా అనేది అన్నింటి కంటే కీలకమైన ప్రశ్న. నిజంగా ఉంటే….డాలర్‌ నాణేలను పక్కన పెట్టి మిగిలిన నాణేలనైనా మార్పిడి చేసివుండేవారు. డాలర్‌ను కరిగించి లోహం తీసుకోవడం మినహా నగదు రూపంలో అది పనికి రాదు. ఈ విషయం తెలియక…డాలర్‌ నాణేనికి సరైన రేటు రాలేదనే ఆలోచనతో ఈ టెండరునే ఇప్పటికి రెండు సార్లు పక్కన పెట్టేశారు.

టిటిడి వద్ద డాలర్‌ నాణేలు ఎక్కువగా ఉన్నాయా, సెంట్స్‌ నాణేలు ఎక్కువగా ఉన్నాయా అనేదాన్ని బట్టే….శ్రీవారికి ఎంత నష్టం, ఎంత లాభం అనేది తేలుతుంది. ఎక్కువ విలువ కలిగిన డాలర్‌ నాణేలు అధికంగా ఉంటే….శ్రీవారికి అంత నష్టమే. తక్కువ విలువ (డినామినేషన్‌) కలిగిన నాణేలు ఉంటే కొంత ఆదాయమైనా సమకూరుతుంది. మన పెద్ద నోట్లను ఏ విధంగానైతే రూ.40 కోట్లను టిటిడి మూలనపడేసిందో…మలేషియా డాలర్‌ కాయిన్స్‌ను కూడా ఆ విధంగా మూలన పడేయాల్సిందే. లేదంటే కరిగించి లోహాన్ని ఏ ఇతర అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చు.

ధర్మచక్రం చేస్తున్న సూచన ఏమంటే….చెలామణిలో లేని డాలర్‌ నాణేలను పక్కన పెట్టి ముందుగా మిగతా నాణేలను సాధ్యమైనంత త్వరగా మార్పిడి చేయాలి. ఇప్పటికే దశాబ్ద కాలంగా గుట్టగా పోసుకుని ఉన్నారు. ఇంకా ఎక్కువ కాలం పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. అధికారులు దీనిపైన ప్రత్యేకంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*