శ్రీవారి ఖజానాలో కాకి లెక్కలేమిటి సారూ…!

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. వేలమంది ఉద్యోగులు, అధికారులు పని చేస్తున్న సంస్థ. ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐపిఎస్‌ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. ఇటువంటి సంస్థలో ప్రతిదీ పక్కాగా ఉండాలి. అయితే…శ్రీవారి ఖజానాలోనే కాకి లెక్కలు చెబుతున్నారు. దానికి అధికారులు తలూపుతున్నారు.

తిరుపతిలోని టిటిడి జ్రెజరీ నుంచి వెండి కిరీటం ఒకటి, రెండు బంగారు కమ్మలు, రెండు బంగారు గొలుసులు మాయమైనట్లు వార్తలొచ్చాయి. దీనికి ఏఈవో శ్రీనివాసులును బాధ్యునిగా చేస్తూ…ఆయన జీతం నుంచి రూ.7.37 లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. (వాస్తవంగా ట్రెజరీలో జరిగిన గోల్‌మాల్‌ సంగతి 2017 డిసెంబర్‌లోనే ధర్మచక్రం బయటపెట్టింది. దీనిపై ప్రత్యేక కథనం ఇంకో పోస్టులో చూడొచ్చు)

ట్రెజరీలో జరిగిన వ్యవహారంపై టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ…ట్రెజరీలో టన్నుల కొద్దీ వెండి, బంగారు వస్తువులు భద్రపరుస్తారని, ఈ క్రమంలో కొన్ని వస్తువులు కనిపించకుండాపోయాయని చెప్పారు. అదే సమయంలో కొన్ని వస్తువులు రికార్డుల్లో ఉన్నవాటి కంటే అదనంగానూ ఉన్నాయని వివరించారు.

తిరుమల శ్రీవారి హుండీలో కానుకగా వచ్చే వెండి, బంగారు ఆభరణాలను తిరుపతిలోని ట్రెజరీకి పంపుతుంటారు. ప్రతి వస్తువునూ జాగ్రత్తగా అక్కడి పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక గొలుసు ఉందనుకుంటే….అందులో రంగురాళ్లు ఉన్నాయా, ముత్యాలు ఉన్నాయా, రత్నాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి…ఇలా ప్రతిదీ వివరంగా రాస్తారు.

ట్రెజరీ నుంచి వెండి, బంగారు వస్తువులను కరించడానికి మింట్‌కు పంపేటప్పుడూ అంతే వివరంగా తనిఖీ చేసి పంపుతుంటారు. ఈ ప్రక్రియలో అదనంగా రావడానికి గానీ, కనిపించకుండా పోవడానికిగానీ ఆస్కారం లేదు. అప్పుడు కనిపించకుండా పోయిన వాటిలో 5.400 కిలోల వెండి కిరీటం కూడా ఉంది. ఇదేమి చిన్న వస్తువు కాదు. పొరపాటును ఇతర వస్తువుల్లో కలిసిపోయిందని చెప్పడానికి. ఉద్దేశపూర్వకంగా మాయం చేస్తే తప్ప అది గల్లంతయ్యే అవకాశమే లేదు.

అదేవిధంగా 11.778 కిలోల వెండి రికార్డుల కంటే అదనంగా ఉందట. రెండు కిలోల ముత్యాలు అదనంగా ఉన్నాయట. ఇంకా పలు వస్తువులు అదనంగా ఉన్నట్లు తమ తనిఖీల్లో తేలిందని ఈవో వివరించారు.

శ్రీవారి ట్రెజరీలో ఈ విధమైన లెక్కలను భక్తులు ఎవరైనా ఆమోదిస్తారా…అనేది ప్రశ్న. ఇది కంప్యూటర్‌ యుగం. తనిఖీ చేయడం కూడా చాలా సులభం. అటువంటిది కొన్ని కిలోల బరువున్న కిరీటం మాయమవడం, కొన్ని అదనంగా రావడం….ఇవన్నీ చూస్తే ట్రెజరీ నిర్వహణ బాగుందని ఎవరైనా అనుకుంటారా? అధికారులు సమర్ధించుకున్నా…భక్తులు మాత్రం దీన్ని ఆమోదించడం లేదు. ట్రెజరీ తీరు మారాలని కోరుతున్నారు.

ఇదంతా చూస్తుంటే….గందరగోళం సృష్టించడానికి అదనపు వస్తువులు చేర్చారా అనే అనుమానమూ కలుగుతోంది. లోతైన విచారణ జరగడకుండా కనిపించని వస్తువుల విలవను సంబంధిత ఉద్యోగి నుంచి రికవరీ చేయాలని మాత్రం నిర్ణయించడం సమంజసమా…అనే ప్రశ్న కూడా వస్తోంది. గతంలో ఎప్పడైనా ఈ విధంగా లెక్కల్లో హెచ్చు తగ్గులు వచ్చాయా అనేది చెప్పాలని భక్తులు కోరుతున్నారు.

ఏదిఏమైనా శ్రీవారికి సమర్పిస్తున్న కానుకలు పక్కదాని పట్టడం లేదన్న విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించాలంటే….ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూడాలి. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు, విలువైన కానుకలు భద్రపరిచే ట్రెజరీ వ్యవహారాలు మరింత పకడ్బందీగా నిర్వహించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*