శ్రీవారి చిల్లర గుట్ట…! నాణేలతో కొత్త పథకాన్ని ప్రవేశపెడితే…!!

వడ్డీ కాసులవాడుగా పేరుపొందిన శ్రీవేంకటేశ్వస్వామికి ఆ కాసులే పెద్ద తలనొప్పిగా మారాయి. కానుకల రూపంలో వస్తున్న నాణేలను లెక్కపెట్టలేక, బస్తాల్లో నింపి, గుట్టగా వేశారు టిటిడి అధికారు. దాదాపు రూ.8 కోట్లు చిల్లర టిటిడి ఖజానాలో ఉన్నట్లు అంచనా. ఇంత భారీ మొత్తాన్ని మూటలు కట్టి వేసుకున్న వైనాన్ని చూసి నూతన ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ విస్మయం వ్యక్తం చేశారు. చిల్లరను బ్యాంకుల్లో జమ చేయకపోవడం వల్ల వచ్చే వడ్డీ నష్టాన్ని ఎవరు భరించాలని ప్రశ్నిస్తున్నారు.

శ్రీవారికి హుండా ద్వారా రోజూ రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా వస్తుంటుంది. చిల్లరను తిరుమల నుంచి తిరుపతి పరిపాలనా భవనంలోని చిల్లర పరకామణి తరలిస్తుంటారు. అక్కడ లెక్కిస్తారు. అయితే…చిల్లర లెక్కింపులో మొదటి నుంచి జాప్యం జరుగుతూనే ఉంది. శ్రీవారి సేవకులతోనూ, టిటిడి ఉద్యోగులతోనూ చిల్లర లెక్కింపు చేయిస్తున్నారు. వాస్తవంగా ఇది కష్టంతో కూడుకున్న పని. చిల్లరను వాటి విలువ ఆధారంగా వేరు చేయడం…అంటే రూపాయి బిల్లలు, రెండు రూపాయల బిల్లలు, ఐదు రూపాయల బిల్లలు వేరు చేయాలి. ఆపై వాటిని లెక్కించాలి. ఇది చాలా నచ్చు వ్యవహారం. దీంతో లెక్కింపు ఆలస్యం అవుతోంది. విదేశీ నాణేలదైతో మరో సమస్య. ఏ నాణెం ఏ దేశానిదో గుర్తించే నిపుణులు కూడా లేరు. అందుకే వాటిని వేరుచేసి మూటలు కట్టి మూలనపడేశారు.

నాణేలను లెక్కించడానికి ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవచ్చు. ఏ రోజు నాణేలను ఆ రోజు లెక్కించడానికి ఎంతమంది అవసరమం అవుతారో అంచనా వేసి….ఆ పనికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవచ్చు. దీనికి కొంత ఖర్చయినా నష్టం లేదు. కోట్ల రూపాయల నెలల తరబడి మూలన వేసుకోవడం కంటే…లెక్కించి సాధ్యమైనంత త్వరగా బ్యాంకుల్లో జమ చేయడం ఉత్తమం. దీనివల్ల పది మందికి ఉపాధి లభిస్తుంది.

టిటిడి తన వద్దనున్న నాణేలతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశాలున్నాయి. టిటిడినే నాణేలను రూ.100, రూ.200, రూ.500, రూ.1000 ఇలా మూటలుగా కట్టి…భక్తులకు విక్రయించవచ్చు. ఈ చిల్లర ఇంటికి తీసుకెళ్లి అక్కడి పేదలకు దానం చేయమని సూచించవచ్చు. దీనివల్ల నాణేలు నోట్ల రూపంలోకి మారుతాయి. ఇదే సమయంలో నిరుపేదలకు దానం రూపంలో ఉపయోగపడుతాయి. ఇటువంటి ఆలోచన ఏదైనా చేస్తేనే నాణేల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*