శ్రీవారి దర్శనం టికెట్లులో వాటాలు!

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలిలోకి ఎవరు వచ్చినా ముందుగా ఆలోచించేది దర్శనం టికెట్లలో తమ కోటా, తమ వాటా ఎంతనేదే. తమకు ఇన్ని టికెట్లు కావాలి, అన్ని టికెట్లు కావాలని అని డిమాండ్‌ చేసి మరీ సాధించుకుంటారు. తాజాగా కొలువుదీరిన ధర్మకర్తల మండలి కూడా ఇందులో ఏమాత్రం తీసిపోలేదు. ఇప్పటిదాకా రెండు సమావేశాలు మాత్రమే జరిగాయి. చర్చించాల్సిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ దర్శనం టికెట్లులో తమ వాటా పెంచుకోడానికి ప్రాధాన్యత ఇచ్చి చర్చించారు. విఐపి బ్రేక్‌, ఆలయంలో జరిగే సేవలకు సంబంధించిన టికెట్లు రోజూ నిర్ణీత కోటా మేరకు బోర్డు ఛైర్మన్‌కు, సభ్యులకు కేటాయిస్తూ ఉంటారు. విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లు ఛైర్మన్‌కు 100, సభ్యులకు 35 (ఎల్‌1-10 టికెట్లు, ఎల్‌2-25 టికెట్లు) వంతున ఇస్తున్నట్లు సమాచారం. అయితే…తమకు ఇవి సరిపోవని, బ్రేక్‌ దర్శనం టికెట్ల సంఖ్య పెంచాలని గత సమావేశంలో కొందరు సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. బ్రేక్‌ దర్శనం టికెట్లు సంఖ్య పెంచడానికి అధికారులు ససేమిరా అనడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి.

ఒక్కో స‌భ్యునికి రోజుకు 65 టికెట్లు!
అధికారులు ఇంత ఖరాకండిగా ఉన్నందుకు అభినందించాల్సిందే అనుకుంటూవుండగానే….ఇంతలో మరో వార్త వచ్చింది. అదేమంటే…బోర్డు సభ్యుల కోరిక మేరకు….ప్రత్యేక దర్శనం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారట. రోజుకు ఛైర్మన్‌కు 100, సభ్యులకు 30 టికెట్లు వంతున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే విఐపి బ్రేక్‌, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిపితే ఒక్కో సభ్యునికి రోజూ 63 టికెట్లు కేటాయిస్తారన్నమాట. ఈ లెక్కన బోర్డులో ఉన్న ముగ్గురు అధికారులను, ఛైర్మన్‌ను పక్కనపెడితే…16 మంది సభ్యులు అవుతారు. అంటే….రోజుకు 1040 టికెట్లు సభ్యులకే వెళుతాయి. ఇక ఛైర్మన్‌కు కనీసం 200 టికెట్లు ఉంటాయి. రోజూ బోర్డుకు సంబంధించిన సిఫార్సుల మేరకే 1200 టికెట్లు ఇవ్వాల్సివుంటుంది. గతంలోనూ బోర్డు సభ్యులు అధికారులపై ఒత్తిడిచేసి తమకు కావాల్సిన టికెట్లు మంజూరు చేయించుకున్నారు. ఇక ఎంఎల్‌ఏలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రోటోకాల్‌లోని అధికారులు….ఇలా పలుకుబడి ఉన్నవాళ్లకు వందల సంఖ్యలో బ్రేక్‌ దర్శనం టికెట్లు మంజూరు చేస్తుంటారు.

విఐపి టికెట్లులో పారదర్శకత ఏదీ?
అసలు దర్శనం టికెట్లలోనూ బోర్డు సభ్యులకు, విఐపిలకు ప్రత్యేక కోటా ఎందుకు ఉండాలనేది ప్రశ్న. టికెట్లు తీసుకుంటే తీసుకున్నారు….అందులో పారదర్శకత ఉండదు. ఏ రోజు ఏ బోర్డు సభ్యుడు, ఏ ఎంఎల్‌ఏ, ఏ ఎంపి ఎన్ని టికెట్లు తీసుకున్నారు, ఎవరి కోసం తీసుకున్నారు అనే వివరాలు ఏరోజుకు ఆ రోజు వెల్లడించాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ టిటిడి పట్టించుకోవడం లేదు. ఈ టికెట్లు కేటాయింపు వ్యవహారం టాప్‌ సీక్రెట్‌లాగా ఉంచుతున్నారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని రమణ దీక్షితులు విమర్శలు చేస్తే…ఆగమం అంగీకరిస్తే ఆలయంలో జరిగే కార్యక్రమాలను టివి లైవ్‌ ఇవ్వడానికి సిద్ధమని ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. దేవున్ని టివీల్లో చూపాల్సిన అవసరం లేదుగానీ…బ్రేక్‌ దర్శనాల టికెట్లు తీసుకుంటున్న వారి వివరాలను టిటిడి వెబ్‌సైట్‌లో పెట్టగలిగితే చాలు. ఎందుకంటే విఐపిల పేరుతో తీసుకుంటున్న టికెట్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయి. అనేక మంది దళారులు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. రూ.500 టికెట్లు 10 వేలకు, 15 వేలకు అమ్మిన ఉదంతాలున్నాయి. ఇలాంటి వాటికి బ్రేక్‌ వేయాలన్నా టికెట్లు కేటాయింపులో పారదర్శకత తీసుకురావడమే పరిష్కారం.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*