శ్రీవారి బ్రేక్‌ దర్శనం సమయం మార్చండి..!

తిరుమలలో విఐపి దర్శనాలకు సంబంధించి మార్పులు తీసుకొస్తున్నారు ప్రస్తుత ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి. ఈ మార్పులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భక్తులు ఎంతగానో అభినందిస్తున్నారు. ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 దర్శనాల పద్ధతిని రద్దు చేసి; ప్రోటోకాల్‌, నాన్‌ ప్రోటోకాల్‌ రెండు రకాల దర్శనాలు మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రోటోకాల్‌ వ్యక్తులకు మాత్రమే హారతి, శఠారీ, తీర్థం ఇస్తున్నారు. దీనివల్ల రెండు గంటల సమయం ఆదా అయినట్లు ఛైర్మన్‌ స్వయంగా ప్రకటించారు.

విఐపి బ్రేక్‌ దర్శనాలకు సంబంధించి మరో రెండు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అందులో ప్రధానమైనది….దర్శనం సమయం మార్చడం. ఇప్పుడు ఉదయం 6.30 – 7.30 గంటలకు విఐపిలను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఉదయం సుప్రభాతం, ఇతర సేవలు, పూజాది కార్యాక్రమాలు ముగిసిన వెంటనే విఐపిలను దర్శనానికి పంపుతున్నారు. విఐపి దర్శనాలు ముగిసి….సాధారణ దర్శనాలు మొదలయ్యే సరికి ఉదయం 10.30 గంటలపైన అవుతోంది.

సాధారణంగా బ్రేక్‌ దర్శనం గరిష్టంగా గంట సమయంలో అయిపోతుంది. క్యూలోకి ప్రవేశించిన తరువాత గంటల బయటకొచ్చేయవచ్చన్నమాట. ఈ టికెట్లు కలిగిన భక్తులు అతిథిగృహాల్లో బస చేసి….ఆ సమయానికి దర్శనానికి వస్తారు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా దర్శనం పూర్తి చేసుకుని బయటకివస్తారు. ఇదే సమయంలో….సాధారణ భక్తులు గంటల కొద్దీ క్యూలైనులో వేచివుంటారు. రాత్రంతా క్యూలోనే ఉంటారు. ఉదయం పూజలు అనంతరం దర్శనాలు మొదలైనా….విఐపిలను ముందుగా పంపడం వల్ల సామాన్య భక్తులు..మరిన్ని గంటలు క్యూలోనే వేచివుండాల్సి వస్తోంది. అదే పూజలు పూర్తవగానే….క్యూలైనులో వేచివున్న భక్తులను దర్శనానికి అనుమతిస్తే…వారి నిరీక్షణ సమయం దాదాపు నాలుగైదు గంటలు తగ్గించినట్లు అవుతుంది.

విఐపిలు ఎటూ ప్రశాంతంగా గెస్ట్‌హౌస్‌లలో ఉంటారు. ఎప్పుడు దర్శనం కల్పించినా వారికి కలిగే ఇబ్బంది ఏమీ ఉండదు. ఉదయం కల్యాణోత్సవం బ్రేక్‌ సమయంలోనే…విఐపి దర్శనాలూ కల్పించడానికి అవకాశం ఉందని తిరుమల ఆలయం గురించి బాగా తెలిసినవారు చెబుతున్నారు. దీనివల్ల విఐపిలకు తిరుమలలో గెస్ట్‌హౌస్‌లు కల్పించాల్సిన అవసరం కూడా తగ్గుంతుందని చెబుతున్నారు. బ్రేక్‌ దర్శనాన్ని ఉదయం 11 గంటలకు మార్చడం వల్ల… తిరుపతిలోనే బసచేసి, ఉదయం బయలుదేరి దర్శనానికి వచ్చి, దర్శనానంతరం తిరిగి వెళ్లిపోతారు. తెల్లవారి 6 గంటలకు ఉండటం వల్ల…విఐపిలు రాత్రే తిరుమలకు చేరుకుని బస చేయాల్సివస్తోంది. అదేవిధంగా దర్శనానికి వెళ్లడం కోసం…ఏ తెల్లవారుజామునో నిద్రలేచి రెడీ అవ్వాల్సివస్తోంది. అదే 11 గంటలకు మార్చగలిగితే…ఇవన్నీ ఉండవు. ప్రశాతంగా ఉదయం 6 గంటలకో, ఏడు గంటలకో నిద్రలేచి, స్నానాలు పూర్తి చేసుకుని, బయలుదేరవచ్చు.

విఐపి బ్రేక్‌ దర్శనం సమయం మార్చడం వల్ల ఇటు క్యూలైన్‌లో సామాన్య భక్తులు పడే అవస్థలను తప్పించవచ్చు. అదేవిధంగా విఐపిలూ ఓపిగ్గా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్పు గురించి టిటిడి ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పారదర్శకత అవసరం…

విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లకు సంబంధించి పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ రహస్యం ఉంటే అక్కడ అవినీతి, అక్రమాలకు అవకాశం ఉంటుంది. విఐపి బ్రేక్‌ దర్శనాల టికెట్లలో పారదర్శకత లేదు. ఎవరు ఎన్ని టికెట్లు తీసుకుంటున్నారో ఎవరికీ తెలియదు. రోజూ తీసుకునే వాళ్లు ఉన్నారు. రెండు రోజులకోసారి తీసుకునేవాళ్లున్నారు. వారానికి ఒకసారి తీసుకునేవాళ్లు ఉన్నారు. ఏరోజు ఎవరికి ఎన్ని టికెట్లు ఇచ్చిందీ…బహిరంగంగా టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచగలిగితే….అక్రమాలకు బ్రేక్‌ వేయొచ్చు. రోజూ టికెట్ల కోసం లెటర్లు ఇచ్చేవాళ్లూ ఆలోచించే అవకాశం ఉంటుంది. విఐపిల పేరు చెప్పి ఎవరైనా టికెట్లు తీసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటే…అదీ బయటపడే అవకాశాలుంటాయి.

బ్రేక్‌ దర్శనం టికెట్ల వివరాలు బహిరంగపరచాలని చాలాకాలంగా భక్తులు కోరుతున్నారు. అయినా ఇప్పటిదాకా ఉన్న అధికారులు దాన్ని పట్టించుకోలేదు. ఈ పనిచేసే అధికారుల దందాకూ బ్రేకులు పడిపోతాయి. అందుకే….దాని జోలికి వెళ్లలేదు. బ్రేక్‌ దర్శనాల అక్రమాలకు కళ్లెం వేయాలన్న పట్టుదలతో ఉన్న ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి…ఏరోజుకు ఆ రోజు బ్రేక్‌ టికెట్ల వివరాలు టిటిడిలో వెబ్‌సైట్‌లో పెట్టడానికి చర్యలు తీసుకుంటే…ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినవారవుతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*