శ్రీవారి మీద భక్తా….రాజకీయ రక్తా…! డిక్లరేషన్‌ వివాదం వెనుక ఉద్దేశాలేమిటి..!!

హిందూ మతేతరులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే…తమకు వెంకటేశ్వరునిపైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని ఒక ధ్రువీకరణ పత్రం (డిక్లరేషన్‌) ఇవ్వాలన్న నిబంధనలపై పెద్ద దుమారమే రేగుతోంది. స్వామిని దర్శించుకోవాలంటే భక్తివుంటే సరిపోతుందని, డిక్లరేషన్‌ అవసరం లేదని టిటిడి బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యాలతో రాజుకున్న వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో మరింత తీవ్రమవుతోంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వివాదాన్ని రగిలించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న చంద్రబాబు…ఆ క్రమంలో తిరుమల ప్రస్తావన తెచ్చారు. హిందూమతంపై దాడి తిరుమలతోనే మొదలయిందని విమర్శించారు. హిందువులు కానివారు శ్రీవారిని దర్శించుకోడానికి డిక్లరేషన్‌ ఇవ్వాల్సివున్నా జగన్‌ మోహన్‌ రెడ్డి దాన్ని పాటించలేదని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి డిక్లరేషన్‌ వివాదం తెరపైకి వచ్చింది.

చంద్రబాబు మాట్లాడిన దానికి టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ మోహన్‌ రెడ్డిగానీ, ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగానీ అనేక పర్యాయాలు భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డిని టిటిడినే బ్రహ్మాత్సవాలకు ఆహ్వానిస్తున్నందున ఆయన్ను డిక్లరేషన్‌ అడగటం భావ్యం కాదని సహేతుకమైన వివరణే ఇచ్చారు. ఈ క్రమంలోనే….స్వామివారి దర్శినానికి భక్తి ముఖ్యంగానీ డిక్లరేషన్‌ కాదని జనరల్‌ కామెంట్‌ చేశారు.

వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు…కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయింది కొందరు నాయకులకు, మీడియా సంస్థలకు. శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ అవసరం లేదని, దాని తొలగిస్తున్నట్లు సుబ్బారెడ్డి చెప్పినట్లు కథనాలు వండి వర్చేశారు. వెంటనే తేరుకున్న సుబ్బారెడ్డి….తన మాటల ఆంతర్యాన్ని మరోసారి వివరించారు. డిక్లరేషన్‌ తొలిగించాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. అయినా…. మత వివాదాల కోసమే కాచుకుని పొంచివున్న విచ్ఛిన్నకర శక్తులు శాంతించడం లేదు. వివాదాన్ని రాజేస్తూనే ఉన్నాయి.

సాధారణ భక్తుల విషయాన్ని పక్కనపెడితే…జగన్‌ మోహన్‌ రెడ్డి డిక్లరేషన్‌ ఇవ్వాలా వొద్దా అనేది చర్చ. ఆయన ఇప్పటికే తిరుమల సహా అనేక హిందూ దేవాలయాలను సందర్శించారు. పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. కాలి నడకన తిరుమలకు వెళ్లడమంటే ఎంతో భక్తివుంటేనే సాధ్యం. ఆపని జగన్‌ మోహన్‌ రెడ్డి చేశారు. శ్రీవారిపై నమ్మకం ఉందనడానికి ఇంతకంటే రుజువులు అక్కర్లేదు. అయినా జగన్‌ విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారంటే ఇందులో రాజకీయ దురుద్దేశాలున్నాయని అనుకోవాలి.

తిరుమల దర్శనానికి డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని గట్టిగా చెబుతున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిబంధనను ఎందుకు అమలు చేయలేదన్నది ప్రశ్న. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడే జగన్‌ మోహన్‌ రెడ్డి పలు పర్యాయాలు స్వామివారిని దర్శించుకున్నారు. మరి అప్పట్లో చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని కొడాలి నాని వంటి వారు ప్రశ్నిస్తున్నారు.

న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించాలని గట్టి ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అదేవిధంగా దళిత కార్డును ఉపయోగించి జగన్‌పై వ్యతిరేకతను సృష్టించడం కోసం శత విధాలా ప్రయత్నించారు. వాస్తవంగా ఇవేవీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు మతం కార్డు వినియోగిస్తున్నారు.

దురదృష్టవశాత్తు జరిగిన ఒకటి రెండు ఘటనలను (అంతర్వేతిలో రథం దహనం కావడం, విజయవాడ రథం మీదున్న వెండి సింహం బొమ్మలు మాయమవడం) ఆసరా చేసుకుని తెలుగుదేశం పార్టీ తమ రాజకీయాలు చేయాలని చూస్తోంది. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక హిందూమతం మీద, దేవాలయాల మీద దాడులు ఎక్కువయ్యాయన్న ప్రచారాన్ని ఎత్తుకుంది. అందులోకి తిరుమల శ్రీవారినీ లాగుతోంది.

హిందూమతంపైన దాడి తీవ్రమయిందని విమర్శలు చేస్తున్న టిటిడి….ఆ దాడులు చేస్తున్నది ఎవరో చెప్పదు. క్రైస్తవులు చేస్తున్నారా, ముస్లింలు చేస్తున్నారా, ఇంకో మతం వాళ్లు చేస్తున్నారా…అనేది మాత్రం చంద్రబాబు చెప్పరు. ఎందుకంటే చెబితే ఆ వర్గాల వారు దూరమవుతారు. అందుకే తెలివిగా మాట్లాడుతారు. ఉద్యమం పేరుతో రాష్ట్ర వ్యాపితంగా హిందూ దేవాయాల్లో పూజలు చేశారు.

అవసరమైన సందర్భంలో వీర లౌకికవాదిగా ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరమ ఆధ్యాత్మికవేత్తగా మారిపోయినట్లు మాట్లాడుతున్నారు. మొన్ని ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం మోడీపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రిపుల్‌ తలాక్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ…మోడీ వ్యక్తిగత విషయాలనూ ప్రస్తావనకు తెచ్చారు. తమ పార్టీ ముస్లింలకు, క్రైస్తవులకు అండగా ఉంటుందని పదేపదే చెప్పారు. అటువంటిది ఇప్పుడు….జగన్‌ను ఇబ్బంది పెట్టడం కోసం ముస్లింలపైన, క్రైస్తవులపైన వ్యతిరేకత వ్యక్తమయ్యేలా రెచ్చగొడుతున్నారు.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు మరిచిపోతున్నదేమంటే…. హిందూత్వ పేరుతో రాజకీయాలు చేసినంత మాత్రాన తాము రాజకీయంగా బలపడలేమన్నది. ఎందుకంటే….జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు ఓట్లు వేసింది మత ప్రాతిపదికన కాదు. తెలుగుదేశం ఓటమికి, జగన్‌ గెలుపునకు అనేక కారణాలున్నాయి. వాటిపై ఆత్మావలోకనం చేసుకుని, సరిదిద్దుకుంటే లబ్ధిపొందవచ్చు మినహా న్యాయవ్యవస్థను, మీడియాను, దళిత కార్డును ప్రయోగించినట్లు మతాన్ని కూడా ప్రయోగిస్తే ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే…

మతం పేరుతో రాజకీయాలు చేయడానికి బిజెపి ఎప్పుడో పేటెంట్‌ తీసుకుంది. మతం కార్డు ఉపయోగించి ఉత్తర భారత దేశంలో చాలావరకు విజయవం తమయింది కూడా. ఇప్పుడు అదే ప్రయోగాన్ని దక్షిణ భారత దేశంలో చేయాలని చూస్తోంది. అందుకే ఏ చిన్న ఘటన జరిగినా దానికి ఆజ్యంపోసి రగిలిస్తూ, ఆ మంటలో చలి కాచుకోవాలని చూస్తోంది. అంతర్వేతి అంశంలోగానీ, తిరుమల విషయంలోగానీ బిజెపి మాట్లాడితే…దాని ఉద్దేశం ఏమిటో జనానికి సులభంగానే అర్థమవుతుంది. బిజెపి స్వరూపం ఏమిటో బాగా తెలుసుకాబట్టి జనం పెద్దగా పట్టించుకోరు కూడా. ఇప్పుడు విషాదం ఏమిటంటే…తెలుగుదేశం పార్టీ కూడా బిజెపి చెప్పుల్లో కాలుపెట్టాలని చూడటమే.

ఆంధ్రప్రదేశ్‌లో మతరాజకీయాలు ఫలించవని ముందే అనుకున్నాం. అణుమాత్రం ఫలించినా అది రాజకీయంగా బిజెపికి లాభం చేకూర్చుతుంది తప్ప తెలుగుదేశం పార్టీకి కాదు. మతం పేరుతోనైనా బిజెపి బలపడితే…తొలుత నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే. ఏపిలో బలపడటం కోసం బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ దానికి ఊతమిస్తోంది. మతపరమైన వివాదాలను తాము చేపట్టకుంటే వెనుకబడిపోతామని, బిజెపి లాభ పడుతుందని తెలుగుదేశం భావిస్తుండొచ్చు. వాస్తవం ఏమంటే….సున్నితమైన మతంపై రాజకీయాలు చేస్తే మైనారిటీల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న మద్దతు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. హిందువుల్లో లాభపడకపోగా మైనార్టీల్లో దెబ్బతింటే టిడిపికి చెంపదెబ్బ గోడదెబ్బ రెండూ తగిలినట్లు అవుతుంది.

ఇక్కడ పవన్‌ కల్యాణ్‌ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఆయన బిజెపితో అవగాహన కుదుర్చుకున్నప్పటి నుంచి బాబా లాగా మాట్లాడుతున్నారు. తమపరమైన అంశాలను బిజెపి కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయనకూ చెప్పేది ఒక్కటే…ఈ అంశం బిజెపికి తప్ప జనసేనకు ఏమాత్రం లాభించవు. జగన్‌ను సెగ పెట్టడం కోసం మతం మంటలు రాజేస్తే…రేపు ఆ మంటలే చంద్రబాబును. పవన్‌ను దహించివేస్తాయన్న విషయాన్ని మరవకూడదు.

ఇక మళ్లీ తిరుమల విషయానికొస్తే….ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రంలో మతపరమైన అలజడి సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని కొన్ని శక్తులు గుంట నక్కల్లా కాచుకుని కూర్చున్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందన్న ప్రచారంగానీ, చర్చి నిర్మించారన్న హడావుడిగానీ, టిటిడి వెబ్‌సైట్‌లో అన్యమత కీర్తనలున్నాయన్న గగ్గోలుగానీ….అటువంటివే. తిరుమలలో ఏం జరుగుతోందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. స్వామివారిపై అశంచలమైన భక్తివిశ్వాసాలు కలిగిన భక్తులకు మరింత బాగా తెలుసు. అందుకే…ఏ వివాదమైనా టీకప్పులో తుఫానులాగా చల్లారిపోతోంది. ఇప్పుడే కాదు…ఎప్పుడైనా తిరుమల ప్రశాంతంగానే ఉంటుంది. ఇక్కడ సామరస్యం పరిఢవిల్లుతుంది. కుతంత్రాలు చేయాలనుకునే దుష్ట శక్తులకు ఎప్పటికీ నిరాశ తప్పదు.

…. ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*