శ్రీవారి లడ్డూ టోకెన్ల గుట్టురట్టు చేసిన ధర్మచక్రం – ఎట్టకేలకు విజిలెన్స్‌ దృష్టి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల టోకెన్లలో జరుగుతున్న అక్రమాలపై కొన్ని నెల క్రితమే ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కంప్యూటర్లతో పనిలేకుండా, మాన్యువల్‌ టోకెన్ల రూపంలో జరుగుతున్న అక్రమాలను ఆ కథనం సవివరంగా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో టిటిడి విజిలెన్స్‌ అధికారులు దృష్టిసారించి….కొందరు అక్రమార్కులను పట్టుకుంది. వేలాది టోకెన్లు అక్రమంగా తరలిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను విజిలెన్స్‌ అధికారులు వెల్లడించాల్సివుంది. నెలకు కోటి రూపాయలకుపైగా దందాగా మారిన ఈ మాన్యువల్‌ టోకెన్ల మాయాజాలం ఎలా జరుగుతోందో మరోసారి చూడండి….

మాన్యువల్‌ లడ్డూ టోకెన్లు వరం
కాలినడక భక్తులు, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులు వైకుంఠం-1 ద్వారా దర్శనానికి వెళుతుంటారు. క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించే ముందు….ఏటిసి పార్కింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్‌ సెంటర్లలో టికెట్లను స్కానింగ్‌ చేస్తారు. అదేవిధంగా లడ్డూ టోకెన్లు ఇస్తారు. రూ.300 దర్శనం భక్తులకు లడ్డూలు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకున్న టికెట్టుపైనే ఇస్తారు కాబట్టి….స్కానింగ్‌ వద్ద వాళ్లకు ప్రత్యేకంగా లడ్డూ టోకెన్లు ఇవ్వరు. అందువల్ల ఇక్కడ టికెట్‌ స్కానింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. సాయంత్రం 7 గంటల తరువాత రూ.300 దర్శనం స్లాట్స్‌ ముగిసిపోతాయి. అప్పటి నుంచి ఆ స్కానింగ్‌ సెంటర్‌ ఖాళీగా ఉంటుంది. ఇదిలావుండగా… ఎలాంటి టోకెన్‌ లేనివారిని వైకుంఠం-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వైకుంఠం-2లోని షెడ్లన్నీ నిండిపోతాయి. అలాంటప్పుడు….వైకుంఠం-1లో కంపార్టుమెంట్లలోకి అనుమతిస్తారు. ఈ కంపార్టుమెంట్లలోకి వెళ్లాలంటే…స్కానింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి, అక్కడ లడ్డూ టోకెన్లు తీసుకుని వెళ్లాలి. రూ.300 స్కానింగ్‌ కేంద్రంలో లడ్డూ టోకెన్లు సాఫ్ట్‌వేర్‌ ద్వారా (ఫింగర్‌ ఫ్రింట్‌ తీసుకోవడం, ఫొటో తీసుకోవడం వంటివి) ఇచ్చే సదుపాయాలు లేకపోవడం వల్ల….4 లడ్డూలు, 2 లడ్డూలు విలువైన లడ్డూ టోకెన్లు సిద్ధంగా ఉంచుకుంటారు. వైకుంఠంలోకి ప్రవేశించే వారికి డబ్బులు తీసుకుని మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చిపంపుతారు. ఇదే దళారులకు, అక్రమాలర్కులకు వరంగా మారింది. రద్దీ ఉన్నప్పుడు కచ్చితంగా మాన్యువల్‌ టోకెన్లు ఇస్తుంటారు. ఇటీవల మూడు నెలల పాటు రోజూ రద్దీ ఉండటంతో…దాదాపు రోజూ మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చారు.

వేల లడ్డూలు హాంఫట్‌!
మాన్యువల్‌ టోకెన్లు ఇస్తున్నారని తెలియగానే ఆ వార్త క్షణాల్లో తిరుమల మొత్తంగా ఉన్న దళారులకు, పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి…ఇలా అందరికీ తెలిసిపోతుంది. నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తారు. టోకెన్లు తీసుకుంటారు. వాస్తవంగా అయితే…టోకెన్‌ తీసుకున్నవాళ్లు అలాగే కంపార్టుమెంట్లలోకి వెళ్లాలి. కానీ కుమ్మక్కు వ్యవహారంతో ఇటే బయటకు వచ్చేస్తున్నారు. అక్కడే తిరుగుతుంటే సూపర్‌వైజర్లు, త్రిలోక్‌ సిబ్బందికి (టోకెన్లు జారీచేసే సంస్థ) అసలు అడ్డే ఉండదు. ఎలాంటి ఫింగర్‌ ఫ్రింట్స్‌గానీ, ఫొటోలుగానీ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో….టోకెన్లను సిబ్బందే సులభంగా బయటకు తరలించేస్తున్నారు. ముందే చెప్పిన ఉదాహరణల్లో పట్టుబడింది ఇటువంటి టోకెన్లే. టోకెన్‌ తీసుకుని బయటకు రాలేని దళారులు దర్శనానికి వెళతారు. అదే సాఫ్ట్‌వేర్‌ ద్వారా టోకెన్లు ఇస్తే….ఇలా లడ్డూల కోసమే వచ్చే దళారులను కంప్యూటరు పట్టిచ్చేస్తుంది. అందుకే మాన్యువల్‌ ఇచ్చేటప్పుడు మాత్రమే దళారులు దర్శనాకి వెళుతుంటారు. మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చారంటే…అక్కడ నుంచి ఆ రోజు రెండు వేల లడ్డూలకుపైగా అడ్డదారుల్లో తరలిపోయినట్లేనట. విజిలెన్స్‌, పోలీసు, ఎస్‌పిఎఫ్‌ తదితర సిబ్బంది కూడా ఈ దారిలో లడ్డూలు తీసుకోవడం అలవాటపడ్డారు. దీంతో రాచమార్గంలా ఉన్న దీన్ని అడ్డుకోడానికి ఎవరూ పెద్దగా ఆసక్తిచూపడం లేదు.

వైకుంఠం-2లోనూ…
వైకుంఠం-2లో లడ్డూ కౌంటర్ల నుంచి కూడా టోకెన్లు తరలిపోతున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది సాంకేతికంగా ఉన్న లోపాలతో టోకెన్లు పొందుతున్నారు. ఫింగర్‌ ఫ్రింట్స్‌ ఉన్నప్పటికీ… ఒక్కో వేలు పెట్టి ఒక్కో టికెట్టు తీసుకోవచ్చు. ముందుగా భక్తులను చూపుడు వేలు పెట్టమంటారు. ఆ టికెట్‌ ప్రింట్‌ తీస్తారు. ‘ఆ వేలుతో ప్రింట్‌ రావడం లేదు…ఇంకో వేలు పెట్టండి’ అంటూరు. అప్పుడు ఇంకో టికెట్టు వస్తుంది. మొదటి టికెట్టును భక్తుడికి ఇస్తారు. రెండో టికెట్టును సిబ్బంది కొట్టేసి బయటకు తరలిస్తారు. ఇదిలావుండగా… కొందరు దళారులు లోనికి వెళ్లి లడ్డూ టికెట్టు తీసుకుంటారు. కొంత సేపటి తరువాత తాము ఎక్కువ సేపు నిరీక్షించలేమని, దర్శనం వద్దని, వెళ్లిపోతామని చెప్పి బయటకు వచ్చేస్తుంటారు. సాధారణంగా అలాంటి వారి నుంచి టోకెన్‌ తీసుకుని ఎగ్జిట్‌ మార్గలో స్కాన్‌ చేస్తే…ఆ టోకెన్‌కు విలువ లేకుండాపోతుంది. అది లడ్డూ వితరణ కేంద్రాల్లో స్కాన్‌ కాదు. కానీ…టోకెన్‌ లోపలెక్కడో దాచిపెట్టుకుని, తాము టోకెన్‌ తీసుకోలేదని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ఈ విధంగానూ నిత్యం వందలాది లడ్డూ టోకెన్లు తరలిపోతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*