శ్రీవారి లడ్డూ తయారీ ఆలయం నుంచి బయటకు వచ్చేస్తోంది…!

ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవేంకటేవ్వరస్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలన్నీ ఆలయ ప్రాంగణంలోనే తయారు చేయాలి. ఇది ఆలయ సంప్రదాయం కూడా. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదువుతున్నా…. అన్నప్రనసాదాలు, లడ్డూలను ఆలయ ప్రాంగణంలోనే చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలకు భక్తుల్లో ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకుని, లడ్డూల తయారీని ఆలయం బయటకు తరలించానికి అనేక పర్యాయాలు ప్రయత్నించినా ఏవీ సఫలం కాలేదు. ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది.

ఈ నేపథ్యంలో టిటిడి అధికారులు మెల్లగా, దశలవారీగా, కొంచెంకొంచెంగా లడ్డూల తయారీని బయటకు తెచ్చేస్తున్నారు. లడ్డూలను ఉంటలుగా పట్టిడం మినహాయించి మిగిలిన అన్ని దశలనూ బయటే పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికీ బూందీ తయారీ ఆలయ బయట జరుగుతున్న సంగతి తెలిసింది. ఇప్పుడు మరో దశను కూడా ఆలయం బయటే పూర్తి చేయడానికి నిర్ణయించారు.

లడ్డూలు తయారు చేయాలంటే….ముందుగా శనగపిండిని కలుపుకోవాలి. ఆపై నేతిలో బూందీ కాల్చాలి. చక్కెర జీరా సిద్ధం చేయాలి. బూందీలో చక్కెర పాకం కలపాలి. ఆపై ఉండలుగా తయారు చేయాలి. భక్తుల డిమాండ్‌కు తగినట్టుగా లడ్డూలు తయారీ చేయాలంటే….ఆలయం లోపలున్న పోటు సరిపోవడం లేదన్న కారణం చూపి….కొన్నేళ్ల క్రితం ఆలయం బయట బూందీ పోటు ఏర్పాటు చేశారు. పిండి కలుపుకోవడం, స్టవ్‌పై బూందీ కాల్చడం ఈ రెండు దశలు బయటి పోటులో జరిగిపోతున్నాయి. ఆ తరువాత బూందీని ఆలయం లోపలున్న పోటుకు తరలించి…అక్కడ సిద్ధం చేసే చక్కెర జీరాతో కలిపి ఉండలు చేస్తున్నారు.

తాజాగా పాలక మండలి ఓ నిర్ణయం తీసుకుంది. బయటవున్న బూందీపోటును ఆధునీకరించాలని నిర్ణయించింది. ఆధునీకరణ పేరుతో కొన్ని మార్పులకూ శ్రీకారం చుట్టింది. ఇప్పటిదాకా ఆలయంల లోపల తయారతువున్న చక్కెర జీరానూ బయటవున్న బూందీపోటులోనే తయారు చేయాలన్నది ఆ నిర్ణయం. చక్కెర జీరా తయారీ పరికరాలు, లోపలి పోటులో ఉండటం వల్ల చాలా స్థలం ఆక్రమిస్తోందని, దీనివల్ల తయారైన లడ్డూలను నిల్వ చేయడానికి స్థలం సరిపోవడం లేదని చెబుతూ…చక్కెర జీరా పరికరాలనూ బూందీ పోటులోకి తరలించలని నిర్ణయించారు.

ప్రస్తుతం చక్కెర జీరా తయారు అయిన తరువాత దాన్ని పెద్దపెద్ద ఫ్లాస్క్‌లలోకి పంపుతారు. ఆపై జీరాను డ్రమ్ముల వంటి యంత్రాల్లోకి పంపుతారు. అందులో బూందీవేసి కలుపుతారు. జీరా తయారీ యంత్రాలు, ఫ్లాస్క్‌లు బయట పోటులోకి వచ్చేస్తాయి. కలిపే డ్రమ్ములను లోపల ఉంచుతారా….లేక వాటిని కూడా బయటకు తెస్తారా అనేది స్పష్టంగా తెలియలేదుగానీ….మొత్తంగా లడ్డూల తయారీలో మరో కీలకమైన దశనూ ఆలయం బటయకు తరలించడం మాత్రం ఖాయం.

పిండి కలపడం, బూందీ తయారు చేయడం, చక్కెక పాకం తయారు చేయడం వంటి పనులన్నీ బయట జరిగిపోయాక….ఇక బూందీని లడ్డూలుగా తయారు చేసే ఒక్క దశను మాత్రమే ఆలయం లోపల ఉంచి….లడ్డూలు ఆలయంలోనే తయారవుతున్నాయని చెప్పడంలో అర్థముంటుందా?

చక్కెర పాకం తయారీని కూడా బయటకు తరలించాలన్న నిర్ణయంపై ఆగమశాస్త్ర పండితుల సలహాలు తీసుకున్నారా? సమగ్రమైన ఆలోచన చేశారా? లడ్డూలకు డిమాండ్‌ ఉందన్న పేరుతో తొందరపడి నిర్ణయం తీసుకున్నారా? ఏమో టిటిడి అధికారులే చెప్పాలి!

2 Comments

  1. లడ్డూలు లోపల చేసిన బయట చేసినా అసలు ఆ లడ్డూలను వెంకన్నకు నివేదించకుండానే భక్తులకు అందజేస్తున్నారు.. అలాంటప్పుడు ఆ లడ్డూలను “ప్రసాదం” అని పిలవడం అసంబద్ధం.. ప్రసాదం కానిదాన్ని బయట చేస్తే ఏమిటి లోపల చేస్తే ఏమిటి ?😊

  2. తిరుమల లో శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రం గురించి అర్చకుల కన్నా టీటీడీ అధికారులు కే అమితమైన పరిఙ్ఞానం ఉంది అనే విషయం భక్తులందరూ సమ్మతించిన విషయం తెలిసిందే. కాబట్టీ ఆలయంలో ఆగమ సంబంధించిన విషయాల్లో అర్చకుల జోక్యాన్నీ,అభిప్రాయాన్ని కోరతూ దయచేసి కథనాలు వండి వార్చకండి.

Leave a Reply

Your email address will not be published.


*