శ్రీవారి లడ్డూ పోటులో ప్రమాదం…కార్మికునికి తీవ్ర గాయాలు

తిరుమల శ్రీవారి లడ్డూ పోటులో ప్రమాదం జరిగింది. బూందీ, చక్కెర జీరా కలిపే యంత్రంలోని గేరు బాక్సు విరిగిపోవడంతో ఓ కార్మికుని చెయ్యి విరిగిపోయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆలయం బయట ఉన్న పోటులో తయారయ్యే బూందీని ఆలయం లోపలున్న పోటులోకి తరలించి అక్కడ ప్రత్యేక యంత్రంలో చక్కర జీరాతో కలుపుతారు.సొమవారం ఉదయం (02.07.2018) ఇలా కలుపుతుండా గేర్ బాక్సు విరిగిపోయి కార్మికుని చేతిపై న పడిపోయింది. దీంతో అతని చెయ్యి ఎముక రెండుగా విరిగినట్లు తెలుస్తోంది. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

భద్రత లేని బతుకులు

శ్రీవారికే కాకుండా కోట్లాది మందికి అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూలను తయారుచేసే పేద బ్రాహ్మణుల భద్రత కరువయింది. ఎప్పడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని అభద్రత మధ్య పని చేస్తున్నారు. ప్రత్యేకించి ఆలయం బయట ఉన్న బూందీ పోటులో ప్రమాదం మరింతగా పొంచివుందు. ఈ పోటులో తరచూ మంటలు వ్యాపిస్తుంటాయి. సలసల కాగే నేతి వద్ద పనిచేసేటప్పుడు అగ్ని ప్రమాదం సంభవిస్తే కార్మికులు గజగజ వణికిపోతారు. అదృష్టవశాత్తు ఇప్పటిదాకా ఎవరికీ ప్రాణాపాయం జరగలేదుగానీ చిన్న చిన్న ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. పని ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటుంది. అర్థ రాత్రి 12 గంటలకు డ్యూటికి వెళ్లాల్సి వుంటుంది. రెండోరోజు అర్థరాత్రిదాకా పోటులో ఉండాలి.

బీమా లేదు

పోటులో జరుగుతున్న ప్రమాదాలను చూసిన తరువాత ఆందోళనకు గురయిన కార్మికులు గత ఈఓ సాంబశివరావుకు తమ గోడు చెప్పుకున్నారు. స్పందించిన ఆయన అందరికీ ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. పత్రాల్లో సంతకాలు కూడా తీసుకున్నారు. ఆయన బదిలీతో అది అటకెక్కింది.

అధికారులు తమ మెహార్బానీ కోసం లడ్డూల ఉత్పత్తి పెంచమని ఒత్తిడి చేస్తారుగానీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోరు. ఇక్కడ దాదాపు 500 మంది పేద బ్రాహ్మణులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. జరగరానిది జరిగితే కుటుంబాలు వీధులపాలే. ఇస్తున్న జీతాలు‌ అంతంతమాత్రమే. తమను రెగ్యులర్ చేయమని వేడుకుంటున్నా టిటిడి అధికారులు కనికరించడం లేదు.‌ రమణ దీక్షితులు వివాదం వచ్చినపుడు…తమకు అర్చకులంటే అపారమైన గౌరవమని చెప్పుకుంటున్న అధికారులు నిరుపేద బ్రాహ్మణులు పట్ల చిన్నచూపు చూస్తూ అలక్ష్యం చేస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగిపుడు తమ జీవితాలు, కుటుంబాలు ఏమవుతాయోనన్న భయం కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా టిటిడి అధికారులు పోటు కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలి. ఉద్యోగ భద్రత, జీవిత బీమా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*