శ్రీవారి హుండీని గుత్తకు ఇచ్చేశారు…! – బ్రహ్మోత్సవాల ప్రత్యేకం

శ్రీవారిపై భక్తితో బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు కానుకలుగా సమర్పించిన రాజులు, పాలకులే కాదు…శ్రీవారి ఆదాయాన్ని కొల్లగొట్టినవారూ ఉన్నారు. చరిత్ర పుటలు తిరగేస్తే…రాజులు, నవాబులు, ఆంగ్లేయులు, ఈస్ట్‌ ఇండియా కంపెనీ, పాలేగాళ్లు…ఇలా అనేకులు స్వామివారి సంపదను

 ‘కైంకర్యం’ చేసిన ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. బ్రిటీష్‌ హయాంలో చిత్తూరు జిల్లాలో తహశీల్దారుగానూ, ఆపై దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గానూ పనిచేసిన విఎన్‌ శ్రీనివాసరావు అనే అధికారి ‘తిరుపతి వేంకటేశ్వర – బాలాజీ’ అనే పేరుతో ఓ పుస్తకం రాశారు. 1949లో ప్రచురించిన ఈ పుస్తకంలోని విశేషాలను….1998లో గోపీకృష్ణ అనే రచయిత రాసిన ‘మన ఆలయాల చరిత్ర’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని టిటిడినే (పబ్లికేషన్‌ నెం.75) ముద్రించింది. కీ.శ. 1800 సంవత్సరం నుంచి తిరుమల చరిత్ర మొత్తం ఆంగ్లేయుల రికార్డుల్లో ఉంది. శ్రీనివాసరావు బ్రిటీష్‌ కాలంలో రెవెన్యూ, ఎండోమెంట్‌ శాఖల్లో పని చేయడం వల్ల ఆకాలం నాటి ఆంగ్లేయుల రికార్డులను పరిశీలించే అవకాశం లభించింది. వాటి ఆధారంగానే ఆయన ‘తిరుపతి వేంకటేశ్వర – బాలాజీ’ పుస్తకాన్ని రాశారు. ఇందులోని వివరాల మేరకు….

శ్రీవారి భక్తులపై పన్ను!
ఇప్పుడైతే ప్రజాస్వామిక వ్యవస్థలో, చట్టబద్ధంగా ఏర్పాటయిన టిటిడి నిర్వహణలోని శ్రీవారి ఆదాయ, వ్యయాలకు సంబంధించి అనేక ఆడిట్‌లు, తనిఖీలు ఉన్నాయిగానీ….ఒకప్పుడు ఇవేవీ ఉండేవి కావు. పాలకులు ఇష్టారాజ్యంగా తిరుమల ఆదాయాన్ని తరలించుకు పోయేవారు. శ్రీవారి భక్తులను దోచుకునేవారు. ఇది ఎంతగా వుండేదంటే….తిరుమల కొండ ఎక్కినవారు దిగాలంటే….24 దుగ్గాండ్లు చెల్లించాల్సివచ్చేదట. చెల్లించేదాకా కొండ దిగనిచ్చేవారు కాదట. బ్రాహ్మణులు, పేదలకు కొంత వెసులుబాటు ఉండేదట. కీ.శ.1801లో తిరుమల ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చాక….ఆ వెసులుబాటు కూడా లేకుండా…ప్రతి ఒక్కరి నుంచి 12 అణాలు వసూలు చేశారట. అంటే ఒకరకంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులపైన పన్ను వేసేవారన్నమాట.

అంతా మిగుల్చుకోవడమే…
శ్రీవారికి వచ్చే ఆదాయంలో ఖర్చుల కోసం కేటాయించే డబ్బులూ క్రమంగా తగ్గిపోతూ వచ్చాయట. ‘శ్రీవారి ఆలయ ఖర్చులకు యాదవరాజుల కాలంలో 100 శాతం ఇచ్చేవారు. విజయనగర చక్రవర్తులు 75 శాతం చేశారు. అందులోనూ శ్రీరంగరాయల కాలంలో 50 శాతం అయింది. మహ్మదీయుల కాలంలో 6 శాతానికి – 7 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఆలయ కౌలుదార్లుగా వచ్చినవారు ఇంకా తగ్గించి….ఆదాయాన్ని సొంతానికి మిగలబెట్టుకోవడం ప్రారంభించారు’ అని పుస్తకంలో వివరించారు. అంటే….స్వామివారి ఆదాయాన్ని ఎంతగా తరలించుకుపోయారో అర్థం చేసుకోవచ్చు.

శ్రీవారి హుండీపై ఈస్ట్‌ ఇండియా కంపెనీ పెత్తనం
కీ.శ.1801లో చంద్రగిరిని పాలిస్తున్న అజీమ్‌ ఉల్‌ ఉమ్రా అనే నవాబు….31.07.1801న చేసుకున్న ఓ ఒప్పందంతో తిరుమల శ్రీవారి హుండీ ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్లింది. ఆంగ్లేయుల సేనలు చంద్రగిరికి రక్షణ కల్పించినందుకు….ఏటా 9 లక్షల నగదు చెల్లించేలా గతంలో నవాబుగా మహ్మద్‌ఆలీ అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఆజీమ్‌ ఉల్‌ ఉమ్రా వచ్చిన తరువాత….’ఆదాయంలో తనకు ఒక భాగం చెల్లించి…మిగిలినది మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి’ అనేలా ఒప్పందం చేసుకున్నాడు. అప్పటి నుంచి శ్రీవారి హుండీపైన పెత్తనం ఆంగ్లేయులకు వెళ్లింది. ఇది నచ్చని….పాలేగాళ్లు దారికాచి, తిరుమలకు వచ్చే భక్తులను దోచుకునేవారట. దీంతో ఆంగ్లీయులే రహదారుల వెంబడి సైనికులను నియమించి భక్తులకు రక్షణ కల్పించారట.

గుత్తకు శ్రీవారి ఆలయం
కీ.శ. 1802లో రాజురామ్‌జోసో అనే వ్యక్తి తిరుమల ఆదాయాన్ని గుత్తగా తీసుకునేందుకు 65,000 నక్షత్ర పగోడీలకు టెండరు వేశారట. ఆశ్చర్యం ఏమంటే….అప్పటిదాకా ఆదాయం చాలా తక్కువగా చూపించేవారట. అంతకు మునుపు 5 సంవత్సరాల ఆదాయం మొత్తం కలిపినా 62,881 పగోడీలుగా చూపించారట. అలాంటిది కాంట్రాక్టరు ఒక ఏడాదికే 65,000 నక్షత్ర పగోడీలు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే…అంతకుముందు శ్రీవారి ఆదాయం ఎంతగా అక్రమంగా తరలిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

దండయాత్రల నుంచి రక్షణ
శ్రీవారికి వస్తున్న ఆదాయం కోసం ఆంగ్లేయులు దండయాత్రల నుంచి తిరుమల ఆలయాన్ని రక్షించిన సందర్భాలూ ఉన్నాయి. కీ.శ.1686లో చివరి మొగలాయి చక్రవర్తి అయిన ఔరంగజేబు దక్షిణాదిలోని మహ్మదీయ రాజ్యాలను జయించాడు. హైదరాబాద్‌ నిజాం రాజ్యము, కర్నాటక నవాబు రాజ్యము అలా స్థాపించబడినవే. తిరుపతి ప్రాంతం కర్నాటక నవాబుల పరిధిలోకి వెళ్లింది. కీ.శ.1750లోనే తూర్పు ఇండియా కంపెనీ శ్రీవారి ఆలయ ఆదాయాన్ని కర్నాటక నవాబుల నుంచి గుత్తకు తీసుకుంది. అందువల్ల ఆలయాన్ని, ఆలయ ఆదాయాన్ని రక్షించుకోవడం వారి బాధ్యత అయింది. ఈ క్రమంలోనే కీ.శ.1753లో మహ్మద్‌ కమాల్‌ అనే రాజు దండయాత్ర చేయగా అంగ్లేయులు ప్రతిఘటించారు. కీ.శ.1757లో మహ్మద్‌ ఆలీ సోదరుడు నజీబుల్లా అన్నపైన తిరగబడి శ్రీకాళహస్తి, కార్వేటినగరం జమీందార్లను దోచుకున్నాడు. ఆగస్టు నెలలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చి ఆ ఆదాయాన్ని దోచుకోవాలనుకున్నాడు. దీన్ని పనిగట్టిన ఆంగ్లేయులు అతన్ని అడ్డుకున్నారు.

కీ.శ.1758 సెప్టెంబర్‌లో (బ్రహ్మోత్సవాల సమయం) మెరచిన్‌ అనే ఫ్రెంచి అధికారి నెల్లూరు నజీబుల్లా, చంద్రగిరి అబ్దుల్‌ వహాబ్‌ సేనలతో తిరుమలకు వచ్చాడు. స్వామివారి హుండీ దోచుకోవాలను కున్నాడట. అయితే….ఆలయ కాంట్రాక్టరుగా ఉన్న వ్యక్తి తానే స్వయంగా కొంత డబ్బులు చెల్లించడంతో అతను వెనుదిరిగాడట.

కీ.శ.1782 జనవరిలో చంద్రగిరి కోటను హైదరాలీ ముట్టడించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అదే సమయంలో శ్రీనివాసమంగాపురం, తొండవాడ తిమ్మప్ప ఆలయం, అగస్తేశ్వరాలయం, తిరుపతిలోని అచ్యుతరాయపురం, యోగిమల్ల వరంలోని పరాశరేశ్వరాలయాలను కొల్లగొట్టాడు. అయితే తిరుమల ఆలయం జోలికి వెళ్లలేదు. కీ.శ.1782 నుంచి కీ.శ.1784 దాకా హైదరాలీ తరపున శ్రీవారి ఆలయాన్ని అతని ప్రతినిధి అయిన ఆనిగాళ్ల నరసయ్య అనే వ్యక్తి నిర్వహించినట్లు రికార్డుల్లో ఉంది. అంటే ఆ కాలంలో వచ్చిన ఆదాయం హైదరాలీకి చేరినట్లే అనుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*